- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : అధిక కొవ్వు.. శరీరంలోని ఏ భాగంలో పెరిగితే ఏం జరుగుతుంది?
బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా పెరిగితే శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్‌ఫ్లమేషన్, రక్తనాళాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

దిశ, ఫీచర్స్ : శరీరంలో కొవ్వు శాతం పెరగడం హానికరమనే విషయం తెలిసిందే. కానీ కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు.. కొవ్వు ఎక్కడ పేరుకుపోతుంది అనేది కూడా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మారుతున్న ఆహారపు అలవాట్లు, సీటింగ్ జాబ్స్, స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల బాడీ ఫ్యాట్ పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని భాగాల్లో పేరుకుపోయే కొవ్వు తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అవేమిటి? ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏయే భాగాల్లో ఎక్కువ?
పొట్ట & నడుము (బెల్లీ ఫ్యాట్ / విసెరల్ ఫ్యాట్) భాగాల్లో కొవ్వు పేరుకుపోవడం అత్యంత ప్రమాదకరం. చర్మం కింద ఉండే సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ కంటే, అంతర్గత అవయవాల(లివర్, ప్యాంక్రియాస్, గుండె) చుట్టూ పేరుకుపోయే విసెరల్ ఫ్యాట్ హార్మోన్లు & ఇన్‌ఫ్లమేటరీ సబ్‌స్టాన్సులను విడుదల చేస్తుంది. అలాగే లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోతే ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తుంది.
కారణాలు ఏమిటి?
జంక్ ఫుడ్, స్వీట్స్, ఆయిలీ & ప్రాసెస్డ్ ఫుడ్స్, సుగర్ డ్రింక్స్, అధిక కేలరీలు వంటి ఆహారపు అలవాట్లు అధిక కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చోవడం, అధిక స్క్రీన్ టైమ్, నిద్రలేమి, స్ట్రెస్ (కార్టిసాల్ హార్మోన్ పెరిగి బెల్లీ ఫ్యాట్ పెంచుతుంది) వంటి జీవనశైలి అలవాట్లు కూడా శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీంతోపాటు వయసు పెరగడం, హార్మోనల్ మార్పులు(మెనోపాజ్), జన్యుపరమైన కారణాలు, దీర్ఘకాలంపాటు మందులు వాడాల్సి రావడం వంటివి బాడీఫ్యాట్‌ను పెంచే అవకాశం ఉంది.
ఏం జరుగుతుంది?
బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా పెరిగితే శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్‌ఫ్లమేషన్, రక్తనాళాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ రావడం, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం వంటివి జరుగుతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ కూడా పెరగడంతో గుండె జబ్బులు & స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. అంతేకాకుండా రొమ్ము, పెద్దప్రేగు, గర్భాశయం, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది. అధిక కొవ్వు పేరుకుపోవడంవల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్, స్లీప్ అప్నియా, హార్మోనల్ ఇబ్బందులు, జ్ఞాపకశక్తి, ఆయుష్షు తగ్గడం వంటివి సంభవించే చాన్స్ ఉంటుంది.
పరిష్కారాలు
*వ్యాయామాలు : కొవ్వు తగ్గాలంటే కేలరీ డెఫిసిట్ + ఎక్సర్‌సైజ్ + లైఫ్‌స్టైల్ మార్పులు అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే రోజుకు కనీసం 30-45 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ (వెయిట్ లిఫ్టింగ్) వంటి వ్యాయామాలు చేయాలి. కోర్ ఎక్సర్‌సైజెస్ (ప్లాంక్, క్రంచెస్) కూడా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది.
*ఆహారం: తక్కువ కేలరీ, అధిక ప్రొటీన్ కలిగిన గుడ్డు, చికెన్, పప్పు, పాలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండేవి తప్పక తీసుకోవాలి. జంక్ ఫుడ్, సుగర్, మైదా తగ్గించాలి. దీంతోపాటు రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తాగడం మర్చిపోవద్దు. ఇవన్నీ పాటిస్తూ.. రోజుకు 7-8 గంటల నిద్రపోవడం, ఒత్తిడి నిర్వహణ (మెడిటేషన్, యోగా), ధూమపానం-మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారాలు, వ్యాయామాలు పాటించినా ఊబకాయం, అధిక కొవ్వు సమస్యలు తలెత్తుతుంటే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






