Brain stroke : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేముందు శరీరంలో ఏం జరుగుతుంది? ఎలా కాపాడుకోవాలి?

by Javid Pasha |

ఆకస్మికంగా ముఖం వంకర తిరగడం, తిమ్మిరిగా అనిపించడం, మాటల్లో తడబాటు కనిపిస్తే బీ అలర్ట్.. అది బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు.

Brain stroke : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేముందు శరీరంలో ఏం జరుగుతుంది? ఎలా కాపాడుకోవాలి?
X

దిశ, ఫీచర్స్ : బ్రెయిన్ స్ట్రోక్.. ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని వేధిస్తున్న ప్రాణాంతక సమస్యల్లో ఇదొకటి. 2025-2026 నివేదికల ప్రకారం ప్రతీ సంవత్సరం వరల్డ్‌వైడ్ 1.2 కోట్ల(12 మిలియన్లు) కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 9.4 కోట్లమంది స్ట్రోక్ సమస్యతో బాధపడుతున్నారు. ఏడాదికి 6.5 నుంచి 7.25 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి. ఇక భారతదేశ పరిస్థితిని పరిశీలిస్తే.. లాన్సెట్ న్యూరాలజీ అండ్ ఐసీఎంఆర్ డేటా ప్రకారం.. ప్రతీ సంవత్సరం సుమారు 12.5 లక్షల నుంచి 18 లక్షల వరకు కొత్త స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. ఇది 1990 నుంచి ఇప్పటి వరకు 51% పెరిగింది. ఇక ప్రపంచ స్ట్రోక్ కేసుల్లో ఇండియా వాటా సుమారు 10% ఉంది. ఇంతకీ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి?

శరీరం నుంచి మెదడుకు రక్త సరఫరా ఆకస్మికంగా ఆగిపోవడం లేదా తగ్గిపోవడాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. దీనివల్ల మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందకచనిపోతాయి. ఈ పరిస్థితిని మెదడు ఆక్సిజన్ ఆకలి (Brain oxygen starvation) లేదా బ్రెయిన్ అటాక్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ స్ట్రోక్ కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్ (85% కేసులు నమోదవుతున్నాయి), కాగా రెండవది హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కీమిక్ స్ట్రోక్‌లో రక్తనాళంలో ఆటంకం ఏర్పడటంవల్ల మెదడుకు రక్తం చేరదు. హెమరేజిక్ స్ట్రోక్‌లో రక్తనాళం చిట్లడంవల్ల రక్తం మెదడులోకి కారుతుంది. దీంతో కేవలం కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోతాయి. కాబట్టి ఇది ప్రాణాంతకమైన ఎమెర్జెన్సీగా నిపుణులు పేర్కొ్ంటున్నారు.

ఎందుకు వస్తుంది?

స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణం.. హైపర్ టెన్షన్ (రక్తపోటు పెరగడం). ఇది రక్తనాళాలను ప్రభావితం చేయడం ద్వారా రక్త ప్రవాహాన్ని బ్లాక్ చేస్తుంది. ఇస్కీమక్ స్ట్రోక్‌లో అయితే రక్తం గడ్డ కట్టడం, కొవ్వు పెక్కులుగా మారి రక్త సరఫరాను అడ్డుకోవడం, గుండెలో అట్రియల్ ఫైబ్రిలేషన్(Atrial fibrillation) వల్ల రక్తం మెదడుకు చేరకపోవడం సంభవిస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్‌లో అధిక రక్తపోటు వల్ల రక్తనాళం పగలడం లేదా ఉబ్బడం (అనూరిజం) వల్ల రక్తం కారుతుంది. ఇక ఇతర జీవనశైలి కారణాల విషయానికి వస్తే.. డయాబెటిస్, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, శారీరక శ్రమలేకపోవడం, వయసు పెరగడం, కుటుంబ చరిత్ర, అధిక మద్యపానం వంటి రిస్క్ ఫ్యాక్టర్లు రక్తనాళాలను దెబ్బతీస్తాయి.

స్ట్రోక్ లక్షణాలు

స్ట్రోక్ రావడానికి ముందు లేదా వస్తున్న సమయంలో ఆకస్మికంగా ముఖం వంకరగా తిరగడం లేదా తిమ్మిరిగా అనిపించడం, ఒక చేయి బలహీనంగా మారి పైకి ఎత్తడానికి రాకపోవడం , మాటలు తడబడటం లేదా అర్థం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు వెంటనే అలర్ట్ అవ్వాలని, అంబులెన్స్‌కు కాల్ చేసి దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆలస్యమయ్యేకొద్దీ ప్రాణాంతకంగా మారుతుంది. ఇతర లక్షణాల విషయానికి వస్తే.. శరీరం ఒకవైపు తిమ్మిరి పట్టడం లేదా బలహీనంగా మారిపోవడం, ఆకస్మిక గందరగోళం, వెంటనే కళ్లు మసకబారడం, తీవ్రమైన తలనొపపి, బాడీ బ్యాలెన్స్ కోల్పోవడం, మైకం లేదా నడవలేకపోవడం వంటివి సంభవిస్తాయి. ఈ లక్షణాలు కొన్ని నిమిషాలు వచ్చిపోతే కూడా (TIA – మినీ స్ట్రోక్) వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

నివారణ లేదా పరిష్కారం ఏమిటి?

స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ సాధారణ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. అలాగే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. రోజుకు 30 నిమిషాల వ్యాయామం(వాకింగ్, స్విమ్మింగ్ లాంటివి), హెల్తీ ఫుడ్స్ (తక్కువ ఉప్పు, ఎక్కువ కూరగాయలు, పండ్లు), బరువు నియంత్రణ, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయడం ద్వారా నివారణ సాధ్యం. ఇక స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. ఇస్కీమిక్ స్ట్రోక్‌కు 4.5 గంటల్లోగా తగిన చికిత్స, మెడిసిన్ అందాలి. హెమరేజిక్‌కు శస్త్రచికిత్స, రక్తపోటు నియంత్రణ. తర్వాత ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీతో పూర్తిగా కోలుకోవచ్చు. ప్రధానంగా స్ట్రోక్ వచ్చినప్పుడు సమయం చాలా ముఖ్యం. చికిత్స ప్రారంభం కావడంలో ఆలస్యమైతే ప్రాణాంతకం అవుతుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోగలరు.

Next Story