మంచెమీది గుడిసె.. మదిలో మెదులుతున్న మధుర జ్ఞాపకం!

by Javid Pasha |

ఎన్ని వెన్నెల రాత్రులను చూస్తూ మురిపోయానో నేను. ఎన్ని చీకటి రాత్రులను ఆస్వాదిస్తూ.. నక్షత్రాలను లెక్కపెడుతూ ఆనందపడ్డానో నేనైతే..

మంచెమీది గుడిసె.. మదిలో మెదులుతున్న మధుర జ్ఞాపకం!
X

దిశ, ఫీచర్స్ : అంతసేపూ వాతావరణం బాగానే ఉండె. క్షణాల్లో చల్లబడిపోయింది. ఆ వెంటనే గాలి వీయడం ప్రారంభమైంది. అంతలోనే ఆకాశంలో ఉరుముల చప్పుళ్లు ప్రారంభం అయ్యాయి. మధ్య మధ్యలో మెరుస్తున్న మెరుపులు కళ్లు జిగేల్ మనిపించేలా వచ్చినట్టే వచ్చి మాయమైపోతున్నాయి. చిన్నగా పెద్ద పెద్ద చినుకులు స్టార్ట్ అయ్యాయి. మరో క్షణమో, మరో నిమిషమో, మహా అయితే కొన్ని క్షణాలో, కొన్ని నిమిషాలో అంతే ఇక.. పెద్ద వానైతే వచ్చేలా ఉంది. నిజానికి ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పటి పిల్లలైతే భయపడతారు. కానీ అప్పట్లో.. అనగా 90‌s కిడ్స్‌కి అదొక ఆస్వాదించదగ్గ అందమైన వెదర్ అనే చెప్పాలి. నేనూ అంతే చల్లటి గాలిని, ఉరుములను, మెరుపులను చూస్తూ ఆనందంతో కేరింతలు కొడుతున్నాను. నాకు తోడుగా అన్నా, అక్కా, చెల్లి, మా పొలం పక్కలో ఉండే దోస్తులు కూడా ఉన్నారు. అందరం వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, ఆనంద పారవశ్యంలో మునిగిపోతూ ఎగురుతూ దుంకుతూ పొలం గట్ల పొంటి ఉర్కులాడుతున్నాం.

మామిడి పండ్లు తింటూ..

అసలే వేసవి కాలం. వర్షకాలం కాకపోయినా మధ్య మధ్యలో ఉరుములు, మెరుపులతో వానలు వస్తాయి కదా అలాంటిదే అప్పుడు మారిన వాతావరణమూ కురుస్తున్న వాన. చెప్పలేం ఒక్కోసారి పిడుగులు కూడా పడుతుంటాయి. పంటలు పాడవుతుంటాయి. అప్పటి వరకైతే మేమున్నచోట పిడుగులేం పడలేదు. ముఖ్యంగా అది మామిడిపండ్ల సీజన్ కూడా. వాన గాలికి మా చెలకలోని మామిడి చెట్లు ఊగుతున్నాయి. కాయలు రాలుతున్నాయి. అక్కడక్కడా పండ్లు కూడా పడుతున్నాయి. అంటే అప్పుడప్పుడే పాకానికి వస్తున్నాయి కాబట్టి మొత్తం పండ్లు కాలేదు. చెట్లుమీద ఎక్కువగా కాయలు, తక్కువగా పండ్లు ఉన్నాయన్నమాట. ఇక మేమంతా చెట్టు కిందకు ఉరికీ ఉరికీ రాలిన పండ్లను తీసుకొచ్చి తింటూ ఎంజాయ్ చేస్తున్నాం.

గుడిసెలోకి ఉరికినం..

అంతలోనే కాస్త దూరం నుంచి ఒక పిలుపు. వాన ఎక్కువయ్యేలా ఉందిరోయ్.. పిడుగుల పడగల్ల, చెట్లకిందకు పోకుండ్రి.. గుడిసెలోకి రండి బెటా.. అంటూ మా నాయన మంచె మీద గుడిసెలోంచి గట్టిగా పిలుస్తుండు. గుడిసెలో మా తాత, నానమ్మ, అమ్మ కూడా ఉన్నారు. వాన మొగులు, ఉరుములు, మెరుపులు చూసి వాళ్లు ముందుగానే గుడిసెలోకి వచ్చారు. మమ్మల్ని రమ్మంటే మేము వినకుండా ఆడుకుంటూ ఉన్నాం. ఇక వాన పెద్దగా అయ్యేలా ఉందనిపించి పిలువడం స్టార్ట్ చేసిండు మా నాయిన. మాతోపాటు ఉన్న మా దోస్తుగాల్ల అమ్మా, నాయినలు కూడా వాళ్లను అట్లనే పిలుస్తున్నారు. వాళ్లు కూడా ఫర్లాంగ్ దూరంలో వాళ్ల పొలంలోని మంచమీద గుడిసెలోనే ఉన్నారు. చూస్తుండగానే వానగాలి ఎక్కువైతున్నట్టే కనిపించి ఇక మేమంతా మంచె మీద ఉన్న గుడిసెలోకి ఉరికినం.

మెదులుతున్న జ్ఞాపకాలు

చేతుల్లో పట్టుకెళ్లిన మామిడి పండ్లు తింటూ.. వానపడుతున్న తీరును చూస్తూ.. మండు వేసవిలో కురుస్తున్న వానలో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాం. వానల్లోనే కాదు. ప్రతీ సీజన్‌లో పొలంకాడికిపోయినప్పుడు మంచెమీద గుడిసెనే మాకు పెద్ద ఆసరా అప్పట్లో.. చలికాలం చలిపెట్టినా, వానకాలం వానకొట్టినా, ఎండాకలం నిద్దురొచ్చినా ఆ గుడిసెలో సేదదీరేది. అందులో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఎన్ని వెన్నెల రాత్రులను చూస్తూ మురిపోయానో నేను. ఎన్ని చీకటి రాత్రులను ఆస్వాదిస్తూ.. మెరుస్తున్న నక్షత్రాలను లెక్కపెడుతూ ఆనందపడ్డానో నేనైతే.. ఒకటా రెండా.. నా చిన్నప్పటి ఎన్నో జ్ఞాపకాలు ఆ మంచె మీద గుడిసెతో పెనవేసుకుపోయాయి. కానీ ఇప్పుడూ.. మనసులో దాని తాలూకు జ్ఞాపకాలు తప్ప, మంచె మీద గుడిసె లేదు. గుడిసెలోంచి నన్ను పిలిచిన నాన్న కూడా లేడు.

- మొహ్మద్ జునైద్

Next Story