కళ్లెదుటే నాన్న చనిపోయాడు.. వీడియోలు తీశారే కానీ ఒక్కరూ దగ్గరికి రాలేదు.!

by Daayi Srishailam |

కళ్లెదుటే నాన్న చనిపోయాడు.. వీడియోలు తీశారే కానీ ఒక్కరూ దగ్గరికి రాలేదు.!
X

సోషల్‌మీడియా వాడని యువత లేదు.

అందులోనూ ఇన్‌స్టా‌గ్రామ్.

కానీ.. దేనికి వాడుతున్నారు దాన్ని.?

హాయ్ ఫ్రెండ్స్.. హౌ ఆర్‌యూ ఫ్రెండ్స్.. బై ఫ్రెండ్స్..

ఇంతే కదా.?

ఇంకా కొందరైతే సొల్లు ముచ్చట్లకే వాడతారు.

వీళ్లంతా షాలినిని చూసి నేర్చుకోవాలి.

ఆమె తన దుఃఖాన్ని.. బాధను పంచుకుంటూ అనాథల జీవితాల్లో ఆశలు చిగురింపజేస్తోంది.

- దిశ, ఫీచర్స్

100 మందికి..

చెన్నయ్ యువతి షాలినిది మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి సేవాభావం కలిగి ఉన్న ఫ్యామిలీ. తన ఫ్యామిలీకి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ చిన్నతనంలోనే భుజాలపై వేసుకుంది. తన బాధను లోలోపలే ఉంచుకొని కుమిలిపోయే బదులు.. మరొకరికి వెలుగై నిలవాలన్న సంకల్పంతో సోషల్‌మీడియాను వేదికగా ఎంచుకొని తన మనోవేదనను పంచుకుంటోంది. అవసరంలో ఉన్నవారిక చేయూతనిస్తూ.. ఒక ప్రేమ సముదాయాన్ని నిర్మించింది. 22 ఏళ్ల వయసులో 100 మందికిపైగా జీవితాల్లో ఆశను నింపింది.

జీతం కూడా వారికే..

షాలిని చిన్నప్పట్నుంచి పుట్టినరోజులు.. వార్షికోత్సవాలు వంటి సందర్భాల్లో అనాథాశ్రమాలు.. వృద్ధాశ్రమాలకు వెళ్తుండేది. కుటుంబ సభ్యుల పేరుమీద అక్కడ అన్నదానం చేస్తుండేది. ఆశ్రమాల్లో గడపడం చిన్నప్పటి నుంచే అలవాటున్న షాలిని అక్కడివాళ్లతో మనస్ఫూర్తిగా మాట్లాడేది. వాళ్లకు ఒక్కపూట భోజనం పెడుతున్నామనే సాటిసిఫేక్షన్ కంటే.. వాళ్లతో ఓ గంట స్పెండ్ చేస్తున్నామనే అనుభూతి గొప్పగా అనిపించేది. ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలో "జీవ రక్షణై" సేవా సంస్థలో వాలంటీర్‌గా చేరింది. పార్ట్‌టైం కంటెంట్ రైటర్‌గా పనిచేసి సంపాదించిన జీతం కూడా ఆశ్రమ పిల్లలకోసమే ఖర్చు చేసింది.

జీవితం మారిపోయింది

2022లో షాలిని నాన్నతో కలిసి హాస్టల్‌కు వెళ్తుంటే రోడ్డు ప్రమాదం జరిగి తన కళ్లెదుటే నాన్న ప్రాణాలు కోల్పోయాడు. షాలిని షాక్ అయ్యింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ షాక్‌లో ఆయన దగ్గరికి కూడా వెళ్లలేకపోయింది. ఒకవైపు రక్తపు మడుగులో నాన్న.. ప్రాణం ఉందా లేదా కూడా తెలియదు. ఇంకోవైపు ఆ రక్తం చిమ్మిన దుస్తులతో నిస్సహాయ స్థితిలో పడివున్న షాలిని. జనాలు వస్తున్నారు.. చూస్తున్నారు.. వీడియోలు తీసుకుంటున్నారు.. వెళ్లిపోతున్నారు. కానీ ఒక్కడూ సాయం చేయడం లేదు. వాళ్లకు ఇతరుల ప్రాణంకన్నా.. వాటిద్వారా వచ్చే లైక్సే ఇంపార్టెంట్ అని అప్పుడు షాలినికి అర్థమైంది.

అదే తన బలం

సమాజంలోని మనుషులను చూసి బాధపడ్డది. నాన్నను కోల్పోయిన బాధను ఎలా తట్టుకోవాలో అర్థంకాక రెండు నెలలు ఇంటి గడపదాటి బయటకు రాలేదు. ఒకరకంగా ఆత్మవిశ్వాసం కోల్పోయింది. ఏమీ తోచక తాను సేవచేసే అనాథాశ్రమానికి వెళ్తే.. పిల్లలంతా ఏడుస్తూ ఉరుకొచ్చి ఒక్కసారిగా హత్తుకున్నారు. నాన్న మా మధ్యలోనే ఉన్నాడక్కా అనడంతో ఆ మాటలు తన హృదయాన్ని తాకాయి. వాళ్లకు పంచిన ప్రేమను తిరిగొచ్చినందుకు సంతోషించింది. దాన్నే తన బలంగా మార్చుకుంది. దానికి సోషల్ మీడియాను వేదికగా ఎంచుకోవాలనుకున్నది.

ప్రేమ మందిరం కోసం..

ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ కొలాబరేషన్లు చేస్తే డబ్బు వస్తుందన్న సంగతి తెలుసుకుంది. నాన్నకు జరిగిన ప్రమాదం గురించి పంచుకుందామని ఓ వీడియో పెట్టింది. అనూహ్య స్పందన వచ్చింది. తన బాధను చెప్తూనే అనాథలు.. వృద్ధుల సమస్యలేంటో చెప్తోంది. ఇప్పటివరకు 190 వీడియోలు చేసింది. ఆ వీడియోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనాథలకు.. వృద్ధులకు.. వితంతువులకు.. ఆపదలో ఉన్నవారికి.. పేద విద్యార్థులకు.. చిరు వ్యాపారాలు పెట్టుకునేవారికి సాయం చేస్తోంది. తన బాధను ఇంకొకరి ఆశలకు పునాదిగా వేస్తూ ఒక ప్రేమ మందిరాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. అక్కడే విద్య.. వైద్యం అందించాలనేది షాలిని కల.

Next Story