Tongue : వామ్మో.. నాలుకపై ఆ మచ్చలా..? ఏం జరుగుతుందో తెలుసా?

by Javid Pasha |

Tongue : వామ్మో.. నాలుకపై ఆ మచ్చలా..? ఏం జరుగుతుందో తెలుసా?

Tongue : వామ్మో.. నాలుకపై ఆ మచ్చలా..? ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : శరీరంలో నాలుక చాలా ముఖ్యమైందనే విషయం తెలిసిందే. మాట్లాడటానికి, ఆహారం రుచి తెలియడానికి మాత్రమే కాదు, హెల్త్ విషయంలోనూ ఇది కీ రోల్ పోషిస్తుంది. అందుకే ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్తే.. నాలుక చూపించాలని అడుగుతుంటారు. అంటే.. ఇక్కడ నాలుక రంగు, దానిపై ఏర్పడే మచ్చలు, వివిధ మార్పులు వంటివి శరీరంలో జ్వరం, క్యాన్సర్ సహా పలు రోగాలను గుర్తించడంలో సహాయపతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ రకమైన మార్పులు, ఏ రోగాలను సూచిస్తాయో ఇప్పుడు చూద్దాం.

* తెల్లటి మచ్చలు : నాలుక రంగు మారడం లేదా తెల్లటి మచ్చలు కనిపించడం, క్రీమ్ వంటి పదార్థం నాలుకపై ఉత్పత్తి అవుతుండటం వంటివి అనుమానించ దగినవివని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇవి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు సంభవించే లక్షణాలుగా పేర్కొంటున్నారు. అట్లనే కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా నాలుకపై తెల్లటి మచ్చలు ఏర్పడవచ్చు. తెల్లటిమచ్చలు, క్రీమ్ వంటి పదార్థం ఎక్కువగా కనిపిస్తే అది ల్యుకోప్లాకియా వ్యాధికి దారితీస్తుందని, క్రమంగా క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

*చర్మపు ముళ్లు : నాలుక మీద చర్మం చిన్న ముళ్ల మాదిరిగా పెరగడం, చిన్నగా ఓ వరుస క్రమంలో వెట్రుకలు పెరగడం వంటివి కూడా ప్రమాదకరమైన సంకేతాలే. ఇటువంటి లక్షణాలతోపాటు తెలుపు, నలుపు లేదా గోధుమ రంగులోకి మారితే ప్రొటీన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరిగిందని చెప్పవచ్చు. అలాగే హానికరమైన బ్యాక్టీరియా వల్ల కూడా ఇలా జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే అది క్యాన్సర్ డెవలప్ కావడానికి దారితీయవచ్చు. కాబట్టి అనుమానం రాగానే వైద్య నిపుణులను సంప్రదించడం బెటర్.

*ఎర్రగా మారడం : నాలుక రోజుల తరబడి సాధారణం కంటే ఎర్రగా మారడం లేదా పింక్ నుంచి స్కార్లెట్‌కి మారితే దానిని ప్రమాద సంకేతంగా భావించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది కవాసకి (KD) వ్యాధికి సంబంధించిన లక్షణం కూడాను. దాంతోపాటు విటమిన్ల లోపం, పిల్లల్లో స్కార్లెట్ జ్వరం వల్ల కూడా నాలుక ఎర్రగా మారవచ్చు. పెద్దల్లో దీర్ఘకాలంగా నాలుక ఎర్రగా కనిపిస్తే క్యాన్సర్ లక్షణంగా అనుమానించాలి.

*క్రమంగా నల్లబడటం : దాదాపు నాలుక నల్లబడటం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇలాంటి లక్షణం కనిపించినప్పుడు జాగ్రత్త పడాలి. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు అయి ఉంటే గనుక వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది కామన్‌గా యాంటాసిడ్ మాత్రలు తీసుకున్న తర్వాత జరుగుతుంది. కానీ సాధారణ వ్యక్తులకు ఇలా జరిగితే ఆందోళన కలిగించే విషయమే. యాంటాసిడ్ లేకుండానే నాలుక నల్లగా మారుతున్నట్లయితే డాక్టర్లను సంప్రదించాలి.

*గాయం తగ్గకపోవడం : అకస్మాత్తుగా నాలుక కొరుక్కోవడం వల్లో, అలాంటిదేమీ లేకపోయినా నాలుకపై ఏదైనా గాయం అయినట్లు కనిపించడమో జరిగితే అనుమానించాల్సిందే. అట్లనే తినడానికి ఇబ్బందిగా మారడం, చాలా రోజులైనప్పుటికీ నాలుకపై గాయం తగ్గకపోవడం ప్రమాద సంకేతం. ఒకవేళ మందులతో కూడా అది నయం కావడం లేదంటే మీ శరీరంలో క్యాన్సర్ డెవలప్ అవుతున్నట్లు అనుమానించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* పగుళ్లు, మంట : నాలుకపై పగుళ్లు ఏర్పడటం, మంటగా అనిపించడం వంటివి కూడా ఏదో ఒక వ్యాధి సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు. సాధారనంగా ఎసిడిటీవల్ల, నరాల రుగ్మతవల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కువ రోజులు ఈ సమస్యతో బాధపడుతుంటే అది సోరియాసిస్ సిండ్రోమ్ లక్షణం కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే అది ఇతర వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా హెల్త్ జర్నల్స్, నిపుణుల అభిప్రాయాల నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story