- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా గమనించారా? అరుదుగా కొందరికి కాళ్లపై చర్మం లోపలి భాగంలో నరాలు ఉబ్బి వంకర్లు తిరిగినట్టు పైకి కనిపిస్తుంటాయి. అలా ఎందుకు జరిగిందో తెలియక కొందరు ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు తమకు బలం పెరిగిందనే అపోహకు కూడా లోనవుతుంటారు. కానీ వాస్తవానికి ఇదొక ఆరోగ్య సమస్య. సిరల్లో(veins) వాపు కారణంగా ఇలా జరుగుతుంది. నరాలు ఉబ్బడంతోపాటు స్కిన్ లోపలి నుంచి నీలం రంగులో కనిపిస్తుంటాయి. దీనినే వైద్య పరిభాషలో వెరికోస్ వీన్స్(Varicose veins) అంటారు.
వెరికోస్ వీన్స్ - కొన్ని కారణాలు
*సాధారణంగా రక్తాన్ని గుండె వైపు తీసుకెళ్లే సిరల్లోని వాల్వులు(valves) సరిగ్గా పనిచేయకపోతే.. ఆ రక్తం సిరల్లోనే నిలిచిపోతూ ఉంటుంది. ఫలితంగా వాపు లేదా వెరికోస్ వీన్స్ ఏర్పడతాయి. వాల్వులు బలహీనంగా ఉన్నప్పుడు రక్తాన్ని ఒకే దిశలో పంపలేవు. దీంతో రక్తం కిందకు జారిపోతుంది. అలాగే ఎక్కువసేపు నిలబడి ఉండే వృత్తుల్లో ఉండే వారికి ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా బస్ కండక్టర్లు, పోలీసులు, టీచర్లు, నర్సులు, షాప్‌లల్లో పనిచేసేవారు, సెక్యూరిటీ సిబ్బంది వంటి ఉద్యోగుల్లో వెరికోస్ వీన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే చాన్స్ ఎక్కువ.
*అలాగే గర్భధారణ సమయంలో కొందరు స్త్రీలకు ఈ సమస్య వస్తుంది. రక్త పరిమాణం పెరగడం, గర్భాశయం ఒత్తిడి సిరలపై పడటం వల్ల ఇలా జరుగుతుంది. దీంతోపాటు హార్మోన్ మార్పులు, మెనోపాజ్, గర్భ నిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం వంటివి కూడా కారణం అవుతాయి.
*పురుషుల కంటే కూడా స్త్రీలలో ఈ సమస్య 2-3 రెట్లు ఎక్కువ. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చే చాన్స్ అధికంగా ఉంటుంది. ఊబకాయం ఉన్నవాళ్లల్లో కూడా వెరికోస్ వీన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శరీర బరువు వల్ల కాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. మరికొందరికి వయసు రీత్యా కూడా వస్తుంటాయి. కొందరికి జన్యుపరమైన కారణాలవల్ల కూడా వస్తుంది.
లక్షణాలు
కాళ్లల్లో సిరలు ఉబ్బి పైకి కనిపిస్తుంటాయి. ముఖ్యంగా నీలం/ఊదా రంగులో వంకరగా ఉంటాయి. వాపు, నొప్పి వల్ల ఎక్కువ సేపు నిలబడితే అలసట వేధిస్తుంది. కాళ్లల్లో మంట, సిరల చుట్టూ చర్మం దురదగా అనిపించడం, కాలి చీలమండలు, పాదాలు వాపు, రాత్రిపూట తిమ్మిరి, నిద్రలో తిమ్మిర్లు పట్టడం వంటివి సంభవిస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొందరిలో ఎటువంటి లక్షణాలు లేకపోయినా సిరల్లో వాపుతో వెరికోస్ వీన్స్ రావచ్చు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలి.
జాగ్రత్తలు
కాంప్రెషన్ స్టాకింగ్స్ ధరించాలి. ఎక్కువసేపు నిలబడే పరిస్థితిని నివారించాలి. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు వాకింగ్ చేయాలి. కూర్చున్నప్పుడు కాళ్లు చాపుకొని మరో కుర్చీమీదనో, ఎత్తైన ప్రదేశంపైనో ఉంచితే బెటర్. ఇవన్నీ రిలాక్సేషన్ అందిస్తాయి. అలాగే వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బరువు తగ్గడం, వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి సమస్యను జఠిలం కాకుండా చేస్తాయి. టైట్ ఫిట్స్ కాకుండా వదులైన దుస్తులు ధరించాలి.
చికిత్స (Treatment Options)
వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించాలి. వ్యాధి తీవ్రతను బట్టి మెడిసిన్ సజెస్ చేయడం, చికిత్స అందించడం చేస్తారు. ముఖ్యంగా కాంప్రెషన్ థెరపీ, స్టాకింగ్స్ ధరించడం, స్క్లెరోథెరపీ (Sclerotherapy), సిరలో ఇంజెక్షన్ ఇవ్వడం, చిన్న-మధ్యస్థ సిరలకు లేజర్ థెరపీ (EVLT), ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ద్వారా రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (RFA) వంటి చికిత్సలు అందిస్తారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ (Vein Stripping) ద్వారా సిరను తొలగించడం వంటివి చేస్తారు.
ఆయుర్వేదంలో..
వెరికోస్ వీన్స్‌కు ఆయుర్వేద చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో పొట్లి థెరపీ (Potli Therapy) ఒకటి. ఇది ఆయుర్వేదంలోని ఒక సాంప్రదాయ చికిత్సా పద్ధతి. వివిధ మూలికలను, ఆకులను, ఆయుర్వేదిక్ ఔషధాలతో మిశ్రమంతో తయారు చేసిన బట్టలో పొట్లం కట్టి నిప్పు కణికల సహాయంతో దానిని గోరు వెచ్చగా చేసి సిరలపై కాపుతారు. అంటే గోరు వెచ్చిన పొట్లాన్ని సున్నితంగా టచ్ చేస్తారు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తక్షణ ఉపశమనం లభిస్తుంది. వెరికోస్ ప్రాబ్లం ఉన్న వారు రోజుకు 10-15 నిమిషాలపాటు వారంలో 3-5 రోజులు ఇలా చేస్తే మంచిదంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ఇది వైద్యుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






