- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Eyes : కళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్.. శరీరంలో ఆ సమస్య ప్రారంభమైనట్టే!
Eyes : కళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్.. శరీరంలో ఆ సమస్య ప్రారంభమైనట్టే!

దిశ, ఫీచర్స్ : ఉన్నట్లుండి కంటి చూపు మసకబారుతోందా? ఒక్కోసారి తల గిర్రున తిరగడమో, తలనొప్పితో పరిసరాల సగం సగం కనిపించడమో వంటి అనుభవాలు ఒకటికి రెండుసార్లు ఎదురయ్యాయా? అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించండి. డయాబెటిస్ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోండి. ఎందుకంటే శరీరంలో మధుమేహం ప్రారంభమైతే కూడా అచ్చం ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం చాలామంది దీనిబారిన పడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడమనే పరిస్థితి కంటి ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తోంది. ఇంతకీ మధుమేహానికి కంటి ఆరోగ్యానికి లింకేంటి? దానివల్ల కళ్లల్లో కనిపించే మార్పులేమిటి? తదితర వివరాలను పరిశీలిద్దాం.
ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఒకసారి వచ్చాక అది పూర్తిగా నయం కాదు. కంట్రోల్ల్ ఉంచుకోవడానికి నిరంతరం మందులు వాడటం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. కాగా కొందరు ఈ వ్యాధి బారిన పడే వరకు దానిని గుర్తించలేకపోతున్నారు. శరీరంలో ఏదో ఒక సమస్య ఎదురయ్యాక ఆప్పత్రులకు వెళ్లినప్పుడు, అక్కడ నిర్వహించే మెడికల్ టెస్టుల తర్వాత అసలు విషయం తెలిసి ఆందోళన చెందుతుంటారు. ముందస్తు సంకేతాలు లేదా లక్షణాలపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి ప్రారంభానికి ముందు కళ్లల్లో కనిపించే ఈ లక్షణాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
దృష్టి లోపం
మన శరీరంలో డయాబెటిస్ ప్రారంభం అయితే పలు లక్షణాలను బట్టి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మునుపటి మాదిరి కళ్లు స్పష్టంగా కనిపించకపోవడం, కంటి చూపులో మార్పులు సంభవించడం సంకేతాలు మీలో కనిపిస్తే అనుమానించాల్సిందే. ఎందుకంటే మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. అంతేకాదు అప్పటికే షుగర్ పేషెంట్లు అయిన వారిలో రక్తంలో చక్కెరస్థాయిలు హెచ్చు తగ్గులలకు గురికావడంవల్ల కూడా ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ విధమైన మార్పులు ఐ లెన్స్ వాపునకు దారితీయడం వల్ల కళ్లల్లో అస్పష్టమైన దృష్టి ఏర్పడే చాన్స్ ఉంటుంది.
కళ్లల్లో నొప్పి
మధుమేహం ప్రారంభంలోనే నరాలపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకే కళ్లల్లో నొప్పి లేదా ఒక విధమైన ఒత్తిడిని అనుభవిస్తు్న్న భావన ఏర్పడుతుంది. మీలో ఆ సంకేతాలు కనిపిస్తే మధుమేహం బారిన పడి ఉండవచ్చు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా గ్లాకోమా వంటి పరిస్థితికి దారితీయవచ్చు. కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించి తగిన సూచనలు పాటించడం బెటర్.
కళ్ల చుట్టూ వాపు
కళ్లలో ఒత్తిడి వంటి భావనతోపాటు కళ్లచుట్టూ వాపు కనిపించడం కూడా మధుమేహం ప్రారంభ లక్షణంగా పేర్కొంటున్నారు నిపుణులు. ఎందుకంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి కంటి కణాలపై ప్రభావం పడినప్పుడు ఇలా వాపు సంభవిస్తుంది. దీంతో కనురెప్పలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించాలి.
బ్లర్‌గా కనిపించడం
రాత్రిపూట ఇంట్లో అయినా, బయట అయినా వెలుతురులో ఉంటే కళ్లకు ఇబ్బందిగా అనిపించడం, బ్లర్‌గా కనిపించడం, కళ్లు గుంజడం వంటి లక్షణాలు కనిపించినా అవి డయాబెటిస్ ప్రారంభ సంకేతం కావచ్చు. కాబట్టి ఈ లక్షణాలు మీలో కనిపిస్తే గనుక జాగ్రత్త పడాలి. మధుమేహం మొదట నరాలపై ప్రభావం చూపడంవల్ల రాత్రిళ్లు అస్పష్టంగా కనిపంచే సమస్య ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెరస్థాయిలు అదుపు తప్పడంవల్ల ఇలా జరుగుతుంది. మధుమేహం ప్రారంభ లక్షణాల్లో ఇది కూడా ఒకటి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






