20 ఏళ్లకే 60 ఏళ్ల జబ్బులు..! యువతలో ముందస్తు వృద్ధాప్యం!!

by Javid Pasha |   (  Updated:2025-11-27 06:43:24  IST  )

20 ఏళ్లకే 60 ఏళ్ల జబ్బులు..! యువతలో ముందస్తు వృద్ధాప్యం!!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వైద్య నిపుణులు ఒక భయానక ధోరణిని గమనిస్తున్నారు. ఏంటంటే.. ఒకప్పుడు అత్యధిక మందిలో 60 ఏండ్లలో కనిపించే ఆరోగ్య సమస్యలు ఇప్పుడు 10 నుంచి 20 ఏండ్ల వయసులోనే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వెన్ను నొప్పి, తీవ్రమైన అలసట, కీళ్ల బలహీనత, స్ట్రెస్ హార్మోన్ల పెరుగుదల, ఆందోళన, చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, బట్టతల రావడం, డయాబెటిస్, థైరాయిడ్ వంటి జీవక్రియ సంబంధిత వ్యాధులు దాడిచేయడం ఇప్పుడు యువతీ యువకుల్లో చాలా కామన్ అయిపోయింది. వైద్య నిపుణుల పరిభాషలో చెప్పాలంటే.. ఈతరం యువతీ యువకులు బాహ్య కారణాలకంటే కూడా శారీరక కారణాలవల్లే వేగంగా వృద్ధాప్యానికి దగ్గర అవుతున్నారు.

కారణాలు

చిన్న వయసులోనే వృద్ధాప్యంలో వచ్చే హెల్త్ ఇష్యూస్ ఎందుకని దాడిచేస్తున్నాయి? అంటే.. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిలో మనం అనేక సౌకర్యాలు అనుభవిస్తున్నప్పటికీ, మరోవైపు ఆరోగ్యపరంగా నష్టపోతున్నామని కూడా చెబుతున్నారు. ఉదాహరణకు బాల్యంలో, టీనేజీలో కూడా రోజులో గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్ టాప్ ముందు కూర్చోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం వల్ల వెన్నెముక దెబ్బతింటున్నది. నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే ప్యాకెట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ వల్ల శరీరానికి తగిన పోషకాలు అందకపోగా ఊబకాయం సమస్య తలెత్తుతోంది. 20 ఏండ్ల వయసులోనే ఓపిక లేకపోవడం, త్వరగా అలసిపోవడం, ఎముకల బలహీనత సమస్యలు వేధిస్తున్నాయి. అలాగే ఒబేసిటీ చిన్న వయసులోనే మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తున్నది.

ఏం చేయాలి?

ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం, శరీరానికి అవసరమైన పోషకాహారం తీసుకోవడం, శారీరక శ్రమను కలిగి ఉండటం వంటివి చిన్న వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డకుంటాయి. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. అలాగే తగినంత నిద్ర (7–9 గంటలు) కూడా చాలా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు, ఇంటిలో చేసిన ఆహారాలు తీసుకోవడం, బయటి ఆహారాలు అవాయిడ్ చేయడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, ప్రతిరోజూ కాసేపు ఎండలో గడపడం వంటి హాబిట్స్ అనారోగ్యాలను దూరం చేస్తాయి. వృద్ధాప్య లక్షణాలను అడ్డుకుంటాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఇది వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link

Next Story