Health : ఆరోగ్యకరమైనవే కానీ.. ఈ ఆహారాలను పచ్చిగా తినడం ప్రమాదకరం

by Javid Pasha |

Health : ఆరోగ్యకరమైనవే కానీ.. ఈ ఆహారాలను పచ్చిగా తినడం ప్రమాదకరం

Health : ఆరోగ్యకరమైనవే కానీ.. ఈ ఆహారాలను పచ్చిగా తినడం ప్రమాదకరం
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం చాలా ముఖ్యం. అయితే అనేక పోషకాలు ఉన్నప్పటికీ కొన్ని పదార్థాలు పచ్చిగా తింటే ప్రమాదం అంటున్నారు నిపుణులు. అలాచేస్తే అవి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే ఏయే పదార్థాలను వండకుండా పచ్చిగా తినకూడదో, ఏ పానీయాలను పచ్చిగా తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

మాంసం, పాలు

పచ్చి మాంసం తినడం, పచ్చి పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదనే నమ్మకాలు కూడా కొందరిలో ఉంటాయి. కానీ ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే పచ్చిమాంసంలో సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి. అందుకే పచ్చిమాసం తిన్న తర్వాత గానీ, పచ్చిపాలు తాగిన తర్వాత గానీ వాంతులు, విరేచనాలు అవుతాయి. జ్వరం కూడా వస్తుంది. రక్తంలో ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. కొన్నిసార్లు ప్రాణహాని సంభవించవచ్చు.

గుడ్లు

పచ్చి గుడ్ల(Raw Eggs)లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉంది. ఇవి తినడం వల్ల తీవ్రమైన జీర్ణ సమస్యలు సంభవిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీయడంవల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు పచ్చిగుడ్లు తినడం మరింత ప్రమాదకరం.

కాసావా

పచ్చి కాసావా(Raw Cassava)లో సైనోజెనిక్ గ్లైకోసైడ్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలో సైనైడ్‌గా మారి విషపూరితం కావచ్చు. దీనివల్ల వికారం, తలతిరగడం వంటివి సంభవిస్తాయి. కొన్నిసార్లు అవయవ వైఫల్యం చెంది మరణానికి కూడా దారితీయవచ్చు. కాసావాను బాగా ఉడకబెట్టి లేదా ప్రాసెస్ చేసి మాత్రమే తినాలి.

కిడ్నీ బీన్స్

పచ్చి కిడ్నీ బీన్స్‌(Raw Kidney Beans)లో ఫైటోహెమాగ్లుటినిన్ అనే టాక్సిన్ ఉంటుంది. తీవ్రమైన జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. పాయిజన్‌గా మారి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పికి కారణం అవుతుంది. కాబట్టి వీటిని కనీసం10 నిమిషాలు ఉడకబెట్టి తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story