40 ఏండ్ల వయసులో ఆ మార్పు.. పురుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

by Javid Pasha |

40 ఏండ్ల వయసులో ఆ మార్పు.. పురుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
X

దిశ, ఫీచర్స్ : కాలం మనకోసం ఆగదు. అదొకర నిరంతర ప్రవాహం లాంటిది. ప్రతీ క్షణం.. ప్రతీ నిమిషం.. ప్రతీ రోజు మారుతూనే ఉంటుంది. మనుషుల వయస్సు కూడా అంతే.. ఒక్క క్షణం వృథా చేయకుండా.. మన కోసం ఆగకుండా మనల్ని దాటుకుంటూ పోతూనే ఉంటుంది. అయితే వయసుతోపాటు శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. నిర్లక్ష్యం చేస్తే సమస్యగా మారుతుంటాయి. అందుకే ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే 40 ఏండ్ల వయసు నుంచి పురుషులు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో చూద్దాం.

ప్రోటీన్లు - రోగ నిరోధక శక్తి

నాలుగు పదులు దాటిన తర్వాత మగవారిలో సహజంగానే కొన్ని శారీరక మార్పులు, కొందరిలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి కూడా ప్రతికూల, సానుకూల ప్రభావాలు ఉంటాయి. కాబట్టి వయస్సు పెరుగుదలతో పాటు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో భాగంగా అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు తప్పక ఉండేలా చూసుకోవాలి. లీన్ మాంసం, చేపలు, గుడ్లు, గింజలు, విత్తనాలు, బీన్స్, పెరుగు వంటి వాటిలో ఇవి పుష్కలంగా ఉంటాయి. జింక్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి.

కండరాల్లో మార్పు - విటమిన్ల లోపం

40 ఏండ్ల తర్వాత పురుషులందరిలోనూ టెస్టో స్టెరాన్ లెవల్స్ తగ్గుతుంటాయి. ఇవి కండరాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అలా జరగకుండా ఉండాలంటే విటమిన్ డి అవసరం. ఇది సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అలాగే ఎముకలకు కాల్షియం అందిందిచడంవల్ల బలంగా మారుతాయి. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. క్యాన్సర్లు, వివిధ స్కిన్ అలర్జీలు రాకుండా ఉంటాయి. దీంతోపాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించకుండా విటమిన్ డి రిలేటెడ్ ఫుడ్స్ సహాయపడతాయి. సాల్మన్ చేపలు, గుడ్డు సొనలు, రెడ్ మీట్, తృణ ధాన్యాలు తినడంవల్ల కూడా విటమిన్ డి కొంత వరకు భర్తీ అవుతుంది.

మానసిక ఆందోళన

బాల్యం, యుక్త వయస్సులో ఉన్న ఫిట్‌నెస్, ఉత్సాహం 40 ఏండ్ల తర్వాత ఉండదు. ముఖ్యంగా విటమిన్ కె లోపం ఈ సమస్యను మరింత పెంచుతుంది. శరీరంలో ఇది లోపించినప్పుడు మానసిక ఆందోళన పెరగుతుంది. కాబట్టి ఇటువంటి మార్పును గమనించినప్పుడు, సమస్య నుంచి బయటపడటానికి కె. విటమిన్ భర్తీ చేయడం చాలా ముఖ్యం. అందుకోసం ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో హెల్తీ డైట్ మెయింటెన్ చేయాలి. మరో విషయం ఏంటంటే.. చాలామందికి 40 ఏండ్ల తర్వాత ప్రోస్టేట్ హెల్త్‌ ఇష్యూస్ వస్తుంటాయి. చాలా వరకు విటమిన్ ఏ లోపంవల్ల ఇలా జరగుతుంది. నివారణ కోసం క్యారెట్లు, చిలగడ దుంపలు, మిల్క్ ప్రొడక్ట్స్ వంటి విటమిన్ ఏ లభించే ఆహారాలు కూడా తీసుకుంటూ ఉండాలి.

నాడీ వ్యవస్థపై ప్రభావం

40 ఏండ్లు దాటిన పురుషుల్లో నాడీ సమస్యలు రావచ్చు. విటమిన్ 12 లోపం ఇందుకు ప్రధాన కారణం. మొక్కలు, జంతు ఆధారిత ఆహారాల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మాంసాహారం, చేపలు, గుడ్లు, మొక్కల ద్వారా లభించే పప్పులు, నట్స్ వంటివి ఆహారంలో భాగంగా తరచుగా తీసుకుంటూ ఉండాలి. అధిక బరువు, ఒత్తిడి, డయాబెటిస్ వంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. శరీరంలో మెగ్నీషియం లోపంవల్ల ఇలా జరుగుతుంది. లోపం లేకపోయినా వచ్చాయంటే వంశపారంపర్య సమస్యలు కావచ్చు. మెగ్నీషియం లోపిస్తే గుండె కండరాలు బలహీన పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బచ్చలి కూర, చిక్కుళ్లు, తృణ ధాన్యాలు, ఇతర ఆకుకూరల్లో ఇది లభిస్తుంది. కాబట్టి ఈ ఆహారాలు రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా, అలాగే తగిన శారీక శ్రమ కలిగి ఉండటంవల్ల శరీరంలో ఏజ్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్షల సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story