రాగల్లు యిసిరేటి ఓ రామ సిలకా.!

by Daayi Srishailam |

ప్రతీ ఇంట్లో ఉండే సాధనం ఇసుర్రాయి.

రాగల్లు యిసిరేటి ఓ రామ సిలకా.!
X

"లెహరాయి" తెలుసుగానీ..

ఇసుర్రాయి తెలుసా మీకు.?

"ఈ తరం" పిల్లలకు పరిచయం చేయాల్సిన వస్తువు ఇది.

ఇప్పుడంటే మిక్సర్లొచ్చాయి.. గ్రైండర్లొచ్చాయి.

కానీ..

ఇవేవీ వాడుకలో లేనప్పుడు..

ప్రతీ ఇంట్లో ఉండే సాధనం ఇసుర్రాయి.

- దిశ, ఫీచర్స్

"రాగల్లు యిసిరేటి ఓ రామ సిలకా.. మొగుడెందు బోయెనో మొగము కళదప్పే".. "పచ్చొడ్లు నే దంచి పాలెసరుబెట్టీ పాలేటి గడ్డనా" వంటి పాటలు పాడుతూ ఇసుర్రాయి ఇసిరేవాళ్లు. ఇరుగు పొరుగు ముచ్చట్లన్నీ ఇసుర్రాయి కాడనే వస్తుండె. అలాంటి ఇసుర్రాయి చూద్దామన్నా కనిపించని పరిస్థితి ఇప్పుడు.

మిక్సీలెక్కడివి.?

"ఇచ్చట పిండి గిర్నీ కలదు".. "మా వద్ద పిండి రుబ్బ బడును" అనే బోర్డులు బస్తీ బస్తీకి చూస్తుంటాం. "హెల్త్ కాన్షియస్" పెరిగి జనాలిప్పుడు మళ్లీ జొన్నలు.. తైదలు.. సజ్జల ఆహారాన్ని తింటున్నారు. అంటే జొన్న రొట్టెలు.. జొన్న గట్కా.. జొన్నంబలి.. తైదంబలి తీసుకుంటున్నారు. ఇవి కావాలంటే జొన్నలను.. రాగులను పొడి చేయాలి కదా.? వాటి కోసం అయితే గిర్నీ పట్టించడం లేకపోతే ఇంట్లో మిక్సీలో వేసుకొని పట్టుకోవడం చేస్తుంటారు. కానీ.. ఒకప్పుడు ఈ మిక్సీలు.. గ్రైండర్లేవీ లేనప్పుడు "ఇసుర్రాయి"తోనే వీటిని పట్టించేవాళ్లు.

ఏమిటీ ఇసుర్రాయి.?

ఇసుర్రాయి అంటే గుండ్రటి "ఇసిరే రాయి". దీనిని తిరగలి అనికూడా అంటారు. పైన ఒకటి.. కిందొకటి ఫలకలు ఉంటాయి. కిందున్న ఫలకకు మధ్యలో ఒక "సీకు మొన" ఉంటుంది. పైనున్న ఫలకానికి మధ్యలో రంధ్రం ఉంటుంది. దానిని ఆ మొనలో పొందిస్తారు. రంధ్రానికి రెండు వైపులా చిన్నపాటి ద్వారాలుంటాయి. రంధ్రంలోంచి గింజలు పోస్తుంటే ద్వారాల నుంచి కిందికి జారుతూ ఉంటాయి. పై ఫలకంపై చిన్నపాటి "బద్ది" లాంటి హోల్ ఉంటుంది. సన్నటి కట్టెను దాంట్లో పెట్టి కుడి నుంచి ఎడమకు.. ఎడమ నుంచి కుడికి తిప్పుతారు. దీనిని ఇసుర్రాయి గుంజ అంటుండె.

ఏమేం ఇసురుతారు.?

ధాన్యాల్లో జొన్నలు.. తైదలు.. సజ్జలు.. వడ్లు ఇసురుతారు. జొన్న గట్క కోసం దంచిన జొన్నలు కావాలి కదా.? అట్లా దంచకుండా ఇసుర్రాయిలో ఇసిరితే తొందరగా ఉడుకుతాయి.. మంచిగా జీర్ణం అవుతుంది. ఇట్లా ఇసరడాన్ని "బరపటిచ్చుడు" అనేటొళ్లు. జొన్నలు.. తైదలు బరపటిచ్చి గట్కా వండుకొని తినేటొళ్లు. అట్లనే సజ్జలు.. వడ్లు కూడా. వడ్లకు పైపొట్టు పోవడానికి బరపటిచ్చుడు అవసరం. ఇక గింజలు అయితే కందులు.. బొబ్బర్లు.. శెనగలు.. పెసర్లు.. బియ్యం బరపటిచ్చేవాళ్లు. ఇప్పుడంటే మిక్సీలొచ్చి ఐదు నిమిషాల్లో చూర్ణం అవుతుందిగానీ.. ఇసుర్రాయితో బరపటియ్యడానికి అద్దగంట పట్టేది.

మంచి కమ్యూనికేషన్

"ఇసుర్రాయి" వాడుకలో ఉన్నప్పుడు కుటుంబ సంబంధాలు బాగుంటుండె. అప్పుడన్నీ ఉమ్మడి కుటుంబాలే కాబట్టీ.. ఒక్కరే కాకుండా ఇంకొకరిని తోడు తీసుకొని ఇసిరేటొళ్లు. వదిన మరదళ్లు.. అత్తా కోడండ్లు.. తోటి యారాండ్ల కాంబినేషన్లో ఇసుర్రాయి పనిచేస్తుండె. చిన్న చిన్న మనస్పర్దలు.. కమ్యునికేషన్ గ్యాప్ ఉంటే ఇసుర్రాయి కాడ అవన్నీ పటాపంచలు అయ్యేవి. అత్త గురించి కోడండ్లు.. కోడండ్ల గురించి అత్త ఇక్కడ్నే ఇంకొకరితో ముచ్చట్లు పంచుకునేటొళ్లు. ఒకరు కొంతసేపు గింజలు పోస్తే.. ఇంకొకరు కొంతసేపు గింజలు పోసి తిప్పుతుండేవాళ్లు.

పిల్లలకూ ఆటవిడుపు

"ముచ్చట్ల" మురిపెమే కాదు.. పిల్లలకూ ఇక్కడ మంచి ఆటవిడుపు ఉండేది. పెద్దొళ్లు పప్పుల్లాంటివి బరపటిస్తుంటే వాటిలో నుంచి కొన్ని పప్పులు తీసి పిల్లలకు పెడతుండె. బొబ్బెర్ల వంటివి పెంకమీద వేయించిన తర్వాతే బరపటిస్తారు కాబట్టీ పిల్లలకు మంచి రుచికరమైన స్నాక్స్‌లా ఫీలైతుండెవాళ్లు. గర్భిణులకు మంచి పౌష్టికాహారం కాబట్టీ రుబ్బుతుండగానే అప్పుడో బుక్క ఇప్పుడో బుక్క నోట్లో వేసుకుంటుండేవాళ్లు. అప్పటిమందమే కాకుండా రెండుమూడు సార్లకు ఒకసారి వచ్చేటట్లు ఇసిరిన పప్పులను డబ్బాలల్ల దాచిపెడ్తుండె. సుట్టమో పక్కమో వచ్చినప్పుడు అవసరమొస్తుండె.

పురాణాల్లోనూ ఇసుర్రాళ్లు..

సింపుల్‌గా.. ఇసుర్రాయొక ధాన్యాలు.. పప్పు గింజలను ప్రాసెసింగ్ చేయడానికి ఇంట్లోనే వినియోగించే సాధనం. గింజలను పిండి.. రవ్వ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటి మన మిక్సీలు.. గ్రైండర్ల లెక్క అన్నమాట. అయితే ఇసుర్రాయి మీద ప్రాసెసింగ్ చేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది. ఇసుర్రాయి వాడకం పురాణాల నుంచి ఉందని అంటుంటారు. ఈ మధ్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఒక వెంచర్‌లో ఒక పెద్ద ఇసుర్రాయి వెలుగులోకి వచ్చింది. ఇది హిడింబి ఇసుర్రాయని చరిత్రకారులు చెప్తున్నారు. మహాభారతంలో భీముని భార్య హిడింబి వాడిన ఇసుర్రాయిగా దీనిని పిలుస్తారట.

Next Story