Fashion : సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ సరికొత్త రూపం.. జెండర్ న్యూట్రల్ ఫ్యాషన్‌పైనే Gen Z ఆసక్తి !

by Javid Pasha |

ఈతరం అన్నింటిలో డిఫరెంటే.. అది ఫ్యాషన్‌లో కూడా కనబడుతోంది. సంప్రదాయాలు, కట్టుబాట్లు జాన్తానై.. అంటూ జెండర్ న్యూట్రల్ ఫ్యాషన్ ఫాలో అయిపోతోంది

Fashion : సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ సరికొత్త రూపం.. జెండర్ న్యూట్రల్ ఫ్యాషన్‌పైనే Gen Z ఆసక్తి !
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు రంగు రంగుల పూల డిజైన్ కలిగిన కుర్తాలు అమ్మాయిలే ధరించేవారు.. ఇప్పుడు అబ్బాయిలు కూడా ధరిస్తున్నారు. ఒకప్పుడు పొడవాటి జుట్టు యువతులకే కనిపించేది.. ఇప్పుడు యువకులు సైతం బారెడు జుట్టు పెంచి క్లిప్పులు పెడుతున్నారు. ఒకప్పుడు చెవిపోగులు లేడీస్‌కే అందం అనుకునేవారు.. ఇప్పుడు జేంట్స్ కూడా ఒక చెవిలో స్టైల్ కోసం వాటిని పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు ప్యాంటు షర్టులు పురుషులే ధరించేవారు.. ఇప్పుడు స్త్రీలు సైతం ధరిస్తున్నారు. మొత్తానికి వస్త్ర ధారణలో, ఆధునిక ఫ్యాషన్ పోకడల్లో అబ్బాయిలకు, అమ్మాయిలకు పెద్ద తేడా ఏమీ ఉండట్లేదు. చూడగానే అబ్బాయా.. ? అమ్మాయా? అని సందేహం వచ్చేలా ఉంటోంది కొందరు టీనేజర్ల ఆహార్యం. దీనినే జెండర్ న్యూట్రల్ ఫ్యాషన్(Gender-Neutral Fashion)గా అభివర్ణిస్తారు నిపుణులు.

నచ్చిందే చేసేస్తాం..

యెస్.. ఈతరం(Gen Z) అన్నింటిలో డిఫరెంటే.. అది ఫ్యాషన్‌లో కూడా కనబడుతోంది. సంప్రదాయాలు, కట్టుబాట్లు జాన్తానై.. మాకు నచ్చితే చాలు ఫాలో అయిపోతాం.. అనే ధోరణి ఆధునిక యువత సరికొత్త మార్గంగా విస్తరిస్తోంది. ఎవరో ఏదో అనుకుంటారని తమ అభిరుచులను, అలంకరణ పద్ధతులను, భావాలను దాచడం లేదు నేటి యువత. తప్పేముంది? కాలానుగుణంగా ఫ్యాషన్ పోకడలు కూడా మారుతున్నాయి. జెన్ జీలను తప్పు పట్టడానికి లేదంటూ యువతను సమర్థించేవారూ ఎక్కువే ఉంటున్నారు. ముఖ్యంగా మోడ్రన్ ఫ్యాషన్ డిజైనర్లు ఈ మార్పులను స్వాగతించాలే తప్ప వ్యతిరేకిస్తే మాత్రం మార్పు ఆగుతుందా అంటున్నారు. పైగా అది ఆత్మ వ్యక్తీకరణ ప్రతీక. ఆత్మగౌరవంలో భాగమని పేర్కొంటున్నారు. జెన్ జీలు మనసులో మాట కూడా ఇదే.

సమగ్రత.. సమానత్వం

జెండర్ న్యూట్రల్ ఫ్యాషన్ అనేది ఇప్పుడొక ప్రాంతానికో, ఒక పట్టణానికో పరిమితమై లేదు. భారతదేశమంతటా విస్తరిస్తోంది. ఇదొక శక్తివంతమైన మూమెంట్‌గా( powerful movement)మారుతూ ఆధునిక యువతను ఆకట్టుకుంటోంది. లింగ ఆధారిత దుస్తులు మాత్రమే ధరించాలన్న అడ్డంకులను, సామాజిక ఒత్తిళ్లను ఛేదిస్తూ.. ఈ తరం స్వేచ్ఛను, చాయిస్‌ను, సెల్ఫ్‌ఎక్స్ ప్రెషన్‌ను(Choice and self-expression) దుస్తుల ద్వారా ప్రదర్శిస్తోంది. అందుకనుగుణంగా ఫ్యాషన్ బ్రాండ్‌లు సైతం తమ ప్రొడక్ట్ శైలిని మార్చుకుంటున్నాయి. థ్రిఫ్ట్ షాప్‌లు మొదలుకొని యూనిసెక్స్ వార్డ్‌రోబ్‌ల వరకు, జెన్ జెడ్ ఫ్యాషన్‌ను సమగ్రంగా, సమానత్వంతో కూడిన ఒక కళారూపంగా మార్చేస్తున్నాయి. ఏదేమైనా జెండర్ న్యూట్రల్ ఫ్యాషన్ పోకడలు సామాజిక నిబంధనలను సవాలు చేస్తూ, స్వేచ్ఛను, వ్యక్తిగత ఆసక్తులను, అభిరుచులను, శైలిని హైలెట్ చేస్తున్నాయి.

మార్పు మంచిదే..

ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్లు, వివిధ బ్రాండ్‌లు సైతం యువత పోకడలను స్వీకరిస్తూ, సమర్థిస్తూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరుకాయలుగా మల్చుకుంటున్నాయి. షెర్వాణీలు, కుర్తాలు, జాకెట్లు వంటి సాంప్రదాయ దుస్తులను ఇప్పుడు జెండర్ న్యూట్రల్ శైలులుగా (Gender-neutral styles) రీడిజైన్ చేస్తున్నారు. లిల్లీ సింగ్ వంటి స్టైల్ ఐకాన్‌లు సైతం షెర్వాణీలను లెహంగాలకు బదులుగా ఎంచుకోవడం ద్వారా ఈ మార్పును ప్రోత్సహిస్తున్నారు. మొత్తానికి ఈ ఫ్యాషన్ విప్లవం భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని స్వీకరిస్తూనే.. ఖాదీ నుండి ఇండో-వెస్ట్రన్ స్టైల్స్ వరకు బ్యాలెన్స్‌ను క్రియేట్ చేస్తోంది. అంతేకాకుండా ఈ సరొత్త ట్రెండ్ స్థిరత్వాన్ని(Sustainability), సమగ్రతను కూడా ప్రోత్సహిస్తున్నది. స్థానిక చేనేతలను, బ్రాండ్లను ఉపయోగించడం ద్వారా పొదుపును, పర్యావరణ బాధ్యతను సైతం ప్రోత్సహిస్తోంది.

Next Story