Health : బయో ప్రింటెడ్ ఆర్గాన్స్.. అవయవాల డ్యామేజ్‌ను నిజంగానే రీప్లేస్ చేస్తాయా?

by Javid Pasha |   (  Updated:2025-08-28 08:13:32  IST  )

బయోప్రింటెడ్ సాంకేతికత ద్వారా అవయవాలను తయారు చేయడం, అవసరమైన రోగులకు నిజమైన అవయవ మార్పిడి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Health : బయో ప్రింటెడ్ ఆర్గాన్స్.. అవయవాల డ్యామేజ్‌ను నిజంగానే రీప్లేస్ చేస్తాయా?
X

దిశ, ఫీచర్స్ : ఒక వ్యక్తి గుండె డ్యామేజ్ అయితే.. మరో వ్యక్తి గుండెను అమర్చవచ్చు. ఒక వ్యక్తి కాలేయం పాడైతే.. మరో వ్యక్తి కాలేయాన్ని రీప్లేస్ చేయవచ్చు. ఇలాంటి శస్త్ర చికిత్సల ద్వారా పోయే ప్రాణాలను కాపాడిన దాఖలాలు ప్రపంచ వైద్య చరిత్రలో చాలానే ఉన్నాయి. అయితే వ్యక్తుల ద్వారా స్వీకరించిన నిజమైన అవయవాలు కాకుండా, బయో ప్రింటెడ్ ఆర్గాన్స్ ద్వారా కూడా ఇలా చేయవచ్చా? అంటే.. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సాధ్యం కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికత ద్వారా ఆ దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.

బయో‌ ప్రింటెండ్ అవయవాల నుంచి న్యూరల్ ఇంటర్ ఫేస్‌ల వరకు శాస్త్రవేత్తలు ఇటీవల జీవశాస్త్ర పరిమితులను అధిగమిస్తున్నారు. కొందరైతే 2050 నాటికి డిజిటల్ మొబిలిటీ, అలాగే బ్రెయిన్ కేర్ (digital mobility and brain care) పరిణామాలు అందుకు దారితీయడం ద్వారా మరణాలను నివారించే అవకాశం ఉందని కూడా వాదిస్తున్నారు. ‘బయోప్రింటెడ్’ సాంకేతికత ద్వారా అవయవాలను తయారు చేయడం, అవసరమైన రోగులకు నిజమైన అవయవ మార్పిడి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

అదే విధంగా న్యూరల్ ఇంటర్‌ఫేస్‌లు మెదడు, యంత్రాల మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి వైద్యం నుండి కమ్యూనికేషన్ వరకు సహాయపడతాయని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ బయో ప్రింటెడ్ ఈ సాంకేతికతలు మానవ జీవితాన్ని శాశ్వతంగా పొడిగించగలవని చెప్పడం ఇంకా సమస్యాత్మకంగానే ఉందంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఇందుకు సంబంధించిన నైతిక, సామాజిక సాంకేతిక సవాళ్లు చాలానే ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితి

ప్రస్తుతం బయోప్రింటింగ్ ద్వారా పూర్తిస్థాయి ఫంక్షనల్ అవయవాలను సృష్టించడంంలో పరిశోధనలు ఇంకా పురోగతి సాధించలేదు. కానీ కొన్ని కణజాలాలు, చిన్న అవయవ భాగాలను విజయవంతంగా బయోప్రింట్ చేశారు. అవేమిటంటే..

1. స్కిన్ : చర్మ కణజాలాన్ని బయోప్రింట్ చేయడంలో శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. ఇది ప్రధానంగా ఔషధ పరీక్షలు, కాస్మెటిక్ పరిశోధనల కోసం ఉపయోగించ బడుతోంది. ఉదాహరణకు ఫ్రాన్స్‌లోని L‘Oreal కంపెనీ, Organovoతో కలిసి 3D బయోప్రింటెడ్ చర్మాన్ని ఉత్పత్తుల పరీక్ష కోసం ఉపయోగిస్తోంది. ఈ చర్మకణజాలం చర్మం కాలిన లేదా గాయాలకు చికిత్సలో రోగుల కోసం పరీక్షిస్తున్నారు.

2.మృదులాస్థి (కార్టిలేజ్) : 2018లో చైనా శాస్త్రవేత్తలు రోగుల సొంత కణాలను ఉపయోగించి, చెవుల పునర్నిర్మాణం కోసం మృదులాస్థిని బయోప్రింట్ చేశారు. ఇది పుట్టుకతో చెవి లోపాలతో బాధపడే ఐదుగురు పిల్లలకు విజయవంతంగా ఉపయోగించ బడింది. 2019లో కూడా దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక 40 ఏళ్ల వ్యక్తికి సంబంధించి దెబ్బతిన్న లోపలి చెవి ఎముకలను పునర్నిర్మించడానికి బయో ప్రింటింగ్‌ను ఉపయోగించారు.

3.కార్నియా : కార్నియా బయోప్రింటింగ్ దృష్టి లోపాల చికిత్సలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. రక్తనాళాలు లేని సరళమైన నిర్మాణం కారణంగా, కార్నియా బయో ప్రింటింగ్‌లో పురోగతి సాధించడం సులభం. నార్త్ కరోలినాలోని Precise Bio కంపెనీ ఒక దానం చేయబడిన కార్నియా నుండి 70 కార్నియాలను బయోప్రింట్ చేసేందుకు రెడీ అవుతోందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం జంతువులపై వీటికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి.

4.ఎముక : చైనాలోని హెఫీ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్‌లోని పరిశోధకులు బయో ఆక్టివ్ బోరాన్-ఆధారిత గ్లాస్, అండ్ పాలికా ప్రోలాక్టోన్‌తో కూడిన బయోప్రింటెడ్ మెటీరియల్స్‌ను అభివృద్ధి చేశారు. ఇవి ఎముక పునరుత్పత్తి కోసం ఉపయోగపడతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ఇది వైద్య రంగ నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link

Next Story