Friendship Day : స్నేహమంటేనే ఒక నమ్మకం.. మమతానురాగాల అనుబంధం..

by Javid Pasha |   (  Updated:2025-08-03 00:15:35  IST  )

Friendship Day : స్నేహమంటేనే ఒక నమ్మకం.. మమతానురాగాల అనుబంధం..

Friendship Day : స్నేహమంటేనే ఒక నమ్మకం.. మమతానురాగాల అనుబంధం..
X

స్నేహం.. ఒక అనిర్వచనీయ ఆనందం..

స్నేహం.. మమతానురాగాల అనుబంధం..

స్నేహం.. దారిచూపే వెలుగు దీపం..

అందుకే అంటారు పెద్దలు.. మీకంటూ ఒక మంచి స్నేహితుడు తప్పక ఉండాలని..

- దిశ, ఫీచర్స్

లైఫ్‌లో పరిచయాలు అనేక మందితో ఉంటాయి. కానీ చొరవ కొందరితోనే ఉంటుంది. మీ గురించి ఆలోచించేవారు చాలా మందే ఉంటారు. కానీ నిస్వార్థంగా ఆలోచించేవారు కొందరే ఉంటారు.. వాళ్లే నిజమైన స్నేహితులని చెప్పొచ్చు. ఈ ప్రపంచమంతా ఒక్కటై మీ మీద యుద్ధం ప్రకటించినా సరే.. వారు మాత్రం మీ కోసమే.. మీ తరఫునే నిలబడతారు. నిరంతరం మీ మంచిని కోరుకుంటారు. ఇబ్బందుల నుంచి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఆలోచనల్లో, ఆచరణలో మీకు సహాయంగా ఉంటారు. అందుకే స్నేహం గొప్పదని, విలువైనదని అందరూ అంటారు.

ఉన్నారా అలాంటి వాళ్లు..

ఒకప్పటిలా ఇప్పుడెవరుంటున్నారు.. కాలం మారింది. స్నేహానికి వాల్యూ తగ్గింది అనే మాటలు తరచుగా వినబడుతుంటాయి. కొంత వరకు నిజం కూడా కావచ్చు. కానీ అంతా అలాగే ఉందని మాత్రం చెప్పలేం. సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లు.. స్నేహాల్లోనూ కొందరికి అలాంటి అనుభవాలు ఎదురు కావచ్చు. చెడు స్నేహాల వల్ల కొందరు నష్టపోయి ఉండవచ్చు. అంత మాత్రనా మిగతా వారందరకీ అదే వర్తించదు. ఫైనల్లీ.. స్నేహం ఒక భరోసా, స్నేహం ఒక ధైర్యం. స్నేహం ఒక ఆత్మస్థైర్యం.

భేద భావాలు లేనిది..

స్నేహమంటేనే అంత.. దానికి కుల మత భేదాలుండవ్. పేద ధనిక తేడాలు ఉండవ్.. ఆడా మగా అనే భేద భావాలుండవు.. వివక్షలు అస్సలుండవు. అందుకే స్నేహం చాలా గొప్పది. అలాంటి స్నేహాన్ని మరోసారి గుర్తు చేసుకొని, మనసు నిండా సంతోషాన్ని నింపుకొని, మనకు కూడా ఎంతో మంది స్నేహితులు ఉన్నందుకు కృతజ్ఞతను ప్రకటించుకునేందుకు ఓ ప్రత్యేక సందర్భం రానే వచ్చింది. అదే ఫ్రెండ్ షిప్ డే. సందర్భం కాబట్టి హెల్తీ ఫ్రెండ్‌షిప్ గురించి మీరు తప్పక తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. అలాంటప్పుడే టాక్సిక్ ఫ్రెండ్‌షిప్‌కు దూరంగా ఉండగలమని కూడా చెబుతున్నారు. మరి నిజమైన స్నేహితులంటే ఎవరు? లక్షణాలేమిటో వెల్లడిస్తున్నారు.

రహస్యాలు సేఫ్

అందరితోనూ అన్ని విషయాల్లోనూ ఓపెన్‌గా ఉండలేం. కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. అలాగనీ వాటిని మనసులోనే దాచుకొని ఉండలేం. ఎవరో ఒకరితో చెప్పుకోవాలనిపిస్తుంది. వాళ్లతో చెప్పుకున్నా తమ సీక్రెట్స్‌కు ఢోకాలేదని, ప్రైవైసీ ప్రాబ్లం ఉండదని భావిస్తారు. అలా ఎవరి గురించి అయితే అనుకుంటారో వాళ్లే నిజమైన స్నేహితులు. అలాగే మీరు మీలా ఉండాలని ప్రోత్సహిస్తారు. మీ అభిప్రాయాలను, సరిహద్దులను గౌరవిస్తారు. నో డౌట్.. ఇక ఇవన్నీ హెల్తీ ఫ్రెండ్‌షిప్ లక్షణాలే.

అసూయ, ద్వేషం లేనిది

నిజమైన స్నేహితులు అన్ని వేళల్లో మీ మేలే కోరుకుంటారు. ముఖ్యంగా మీ సక్సెస్‌ను కూడా అభినందిస్తారు. అలాకాకుండా మీరు ఏదైనా విజయం సాధించిన ప్రతీసారి మీరు స్నేహితుడని అనుకుంటున్న వ్యక్తి అసూయ చెందుతున్నట్లయితే.. ప్రవర్తనలో, మాటల్లో, చేతల్లో ఇలా ఏదో ఒక రూపంలో అసూయ, ద్వేషం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తే.. అప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు. అది నిజమైన స్నేహితుల లక్షణం కాదని. ఎందుకంటే.. రియల్ ఫ్రెండ్ ఎప్పుడూ మీ సక్సెస్‌ను చూసి అసూయ చెందరు. పైగా గర్వపడతారు. మిమ్మల్ని మరింత ప్రోత్సహిస్తారు. అంతేతప్ప అసూయ చెందమో, పోటీగా భావించడమో చేయరు. ఈ సంకేతాలను బట్టి మీ ఫ్రెండ్ ఎవరో గుర్తించవచ్చు.

అన్ని సమయాల్లో మద్దతుగా..

‘డోంట్ వర్రీ మీకు మేమున్నాం’ అని ఆయా సందర్భాల్లో చాలామంది అంటుంటారు. కానీ ఆచరణలో అలా ఉండేది ఎంతమంది? నిజానికి అలా నిలిచేవారే మీ నిజమైన స్నేహితులు అంటున్నారు నిపుణులు. అలా కాకుండా ఆనందంగా ఉన్నప్పుడో, అన్ని పరిస్థితులు సవ్యంగా ఉన్నప్పుడో మాత్రమే మీతో ఉండి, ఏదైనా ఆపదలో ఉన్నారని తెలియగానే పారిపోయేవారో, తప్పించుకునేవారో ఎప్పటికీ మంచి స్నేహితులు కాలేరు. అన్ని సందర్భాల్లో మీకు సపోర్టుగా నిలిచేవారే నిజమైన స్నేహితులు. అందుకే స్నేహమంటే ఓ నమ్మకం.. స్నేహమంటే ఓ భరోసా..

Next Story