- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైథిలి ఠాకూర్.. ఫోక్ సింగర్ to యంగెస్ట్ ఎమ్మెల్యే
అతి పిన్న వయస్కురాలు ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించింది

దిశ, ఫీచర్స్: యువత రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తోంది. బాగా చదువుకున్నవాళ్లు.. విదేశాల్లో మంచి ఉద్యోగం చేసినవాళ్లు.. సంగీత సాహిత్య రంగాల్లో రాణించి తమ ప్రతిభతో సత్తా చాటినవాళ్లు సైతం పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఎంట్రీ ఇచ్చి సక్సెసైన యువతి మైథిలి ఠాకూర్.
సంగీతమే ఆయుధంగా..
బీహార్ రాజకీయాల్లో ఓ కొత్త గాలి వీచింది. 25 ఏళ్ల ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ అలినగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి బీహార్‌లోనే అతి పిన్న వయస్కురాలు ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించింది. సీనియర్ లీడర్ మీద పోటీచేసి దాదాపు 85 వేల ఓట్లు సాధించి యువత ఆశలకు ప్రతిరూపంగా మారింది. మధుబని జిల్లాలోని ఉరేన్ గ్రామంలో జన్మించిన మైథిలిది సంగీత కుటుంబం. సా రే గ మ ప లిటిల్ చాంప్స్.. ఇండియన్ ఐడల్ జూనియర్ వంటి షోల్లో ఫోక్.. క్లాసికల్ పాటలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సంగీతమే తన రాజకీయ ఆయుధంగా మార్చుకుంది మైథిలి.
పాటలతో ప్రచారం..
రాజకీయాల్లో యువత.. ముఖ్యంగా మహిళల ప్రాముఖ్యత పెరుగుతోంది అనడానికి మైథిలి విజయం ఉదాహరణ. జానపద కళలను చాటిచెప్పడంలో ప్రావీణ్యురాలైన మైథిలి సాంప్రదాయ మూలాలతో పాటు ఆధునిక ఆశయాలను మేళవించి యువతకు ఆదర్శంగా నిలిచింది. తన కళా.. నైపుణ్యం జానపద రంగానికే పరిమితం కాకుండా రాజకీయ రంగ ప్రవేశంచేసి ప్రజా ప్రతినిధిగా నిలవాలనుకుంది. ఎన్నికల ప్రచారంలో కూడా ఇంటింటికి తిరిగి పాటలు పాడుతూ ఓటర్లతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుంది. మహిళల సాధికారత.. యువత అభివృద్ధి అంశాలను ప్రచారం చేసి ఓట్లు రాబట్టింది.
సాంస్కృతిక అభివృద్ధి..
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మైథిలి తన మద్దతుదారులతో సమావేశమైంది. చాలా సాదాసీదాగా జరిగిన మీటింగ్‌లో ఆమె "ఏ రాజా జీ" పాట పాడి ఆశ్చర్యపరిచింది. ఇది తన సంగీత.. రాజకీయ బాధ్యతల మధ్య అవిభాజ్య బంధాన్ని చూపిస్తోంది. గెలిచినంక మైథిలి తన బాధ్యతలను కూడా స్పష్టం చేసింది. బాలికల విద్య.. యువతకు ఉపాధి అవకాశాలు.. సాంస్కృతిక వారసత్వం పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చింది. పెయింటింగ్‌ను పాఠశాలల్లో ప్రోత్సహించాలని.. అలినగర్‌ను సీతానగర్‌గా పేరు మార్చాలని ప్రతిపాదించి సామాజిక.. సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేస్తానని మాటిచ్చింది.
సవాళ్లను అధిగమించి..
మైథిలి ఎమ్మెల్యేగా పోటీచేస్తుందనగానే రాజకీయంగానే కాకుండా సామాజికంగానూ ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. పాటలు పాడుకునే వాళ్లకు రాజకీయాలు అవసరమా అని ఎంతోమంది కామెంట్స్ చేశారు. ఆడపిల్ల చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకోకుండా ఈ సోకేంటి అని విమర్శించారు. పోలింగ్ బూత్‌కు వ్యక్తిగతంగా వెళ్లడం కూడా వివాదాస్పదమైంది. ఎవరెన్ని మాటలు అన్నా.. తక్కువచేసి చూపెట్టినా తను మాత్రం గెలిచింది. అన్ని విమర్శలకు గెలుపుతో సమాధానం చెప్పింది. తన ప్రయాణం యువతకు.. మహిళలకు ప్రేరణగా నిలుస్తోంది. రాజకీయాలకు కొత్త ఊపిరి పోసే అవకాశమూ ఉంది.






