నాన్న సామ్రాజ్యంలో.. నేనే రాణిని.. - నాన్నను రాజును చేసే రోజెప్పుడో !

by Sujitha Rachapalli |

నాన్న.. నా కథలో హీరో.. నేను పుట్టగానే మళ్లీ ఆడపిల్ల పుట్టింది.. ఎవరికైనా ఇచ్చేయమని అన్నారట. కానీ నాన్న.. భిక్షమెత్తుకునైనా బిడ్డను పెంచుకుంటా అని చెప్పాడట. అప్పటి నుంచి ఇప్పటి వరకు

నాన్న సామ్రాజ్యంలో.. నేనే రాణిని.. - నాన్నను రాజును చేసే రోజెప్పుడో !
X

దిశ, ఫీచర్స్ : నాన్న.. నా కథలో హీరో.. నేను పుట్టగానే మళ్లీ ఆడపిల్ల పుట్టింది.. ఎవరికైనా ఇచ్చేయమని అన్నారట. కానీ నాన్న.. భిక్షమెత్తుకునైనా బిడ్డను పెంచుకుంటా అని చెప్పాడట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అడిగిన ప్రతీది నాన్న.. ఇస్తూనే ఉన్నడు. ఓ మారుమూల పల్లె నుంచి పట్నం వరకు నా ప్రతీ ప్రయాణంలో నాన్న ఉన్నాడు. చిన్నప్పుడు హాస్టల్‌కు వెళ్లనని మారాం చేసినా.. ట్రంకు పెట్టె పట్టుకుని నాన్న నా వెంటే ఉన్నాడు. చదువు విలువ చెబుతూ జీవితపు పాఠాలు బోధిస్తూ ప్రయాణం కొనసాగించేవాళ్లం. అలాగని నాన్న గొప్ప చదువులు ఏం చదవలేదు. అప్పటికీ టెన్త్ కూడా పూర్తి చేయలేదు. కానీ పిల్లలు పీజీలు చేయాలని కలలు కన్నాడు. అక్కతో పాటు నాన్న ప్రైవేటుగా ఫీజు కట్టి.. టెన్త్ పరీక్ష రాశాడు. ఆయన సెకండ్ క్లాస్‌లో పాస్ అయినా.. అక్క మంచి మార్కులు తెచ్చుకోవడంతో మురిసిపోయాడు. ఊరంతా చెప్పుకుని పండుగ చేసుకున్నాడు.

ఇప్పటికీ గుర్తు..

టెన్త్ క్లాస్‌ చదువుతున్నప్పుడు స్కూల్‌లో నేను డిసిప్లెయిన్ లీడర్‌గా ఉన్నా. పేరెంట్స్ మీటింగ్‌లో మా క్లాస్ టీచర్ ‘మీ పాప ఉపాధ్యాయులను ఎదిరిస్తుంది’అని నాన్నకు కంప్లెయింట్ చేసింది. అలా చెప్తుందని నేను ముందే ఎక్స్‌పెక్ట్ చేశా. నాన్న ఏమంటాడో అని రెండు రోజులు భయపడ్డా. కానీ మా నాన్న ఇచ్చిన ఆన్సర్‌కు మా మేడమ్ షాక్ అయింది. డిసిప్లెయిన్ లీడర్‌గా తన బాధ్యతను తను నిర్వర్తిస్తుంది తప్పేంటని అడిగాడు మా నాన్న. ఈ విషయాన్ని స్వయంగా మా టీచర్ పిలిచి నాకు చెప్పింది. నేను అదే చేశా నాన్న అని వివరణ ఇద్దామనుకున్న నాకు.. మా నాన్న నన్ను అర్థం చేసుకున్న తీరు ఒకరకంగా ఆశ్చర్యకరమే అనిపించింది. ఆ తర్వాత కూడా మా నాన్న మీ టీచర్ ఇలా నాకు కంప్లెయింట్ ఇచ్చిందనే ప్రస్తావన తేనేలేదు.

సంపాదన మాటేలేదు..

ఉన్నత చదువులు చదివిన మేము.. ఎందుకో తెలీదు ఇంట్లోనే స్టక్ అయిపోయాం. అసలు జాబ్ చేయాలనే ఆలోచన లేకుండా ముప్పొద్దులా తింటూ హాయిగా ఎంజాయ్ చేశాం. కానీ నాన్న ఒక్కమాట కూడా అనలేదు. చదువు పూర్తయింది కదా ఏదైనా పని చూసుకోవచ్చు కదా అని మాట వరుసకు కూడా ప్రస్తావించలేదు. మరి ఆయన పెంపకం మీద నమ్మకమో.. లేదంటే మరేదైనా కావచ్చు.. కానీ మాకు మేము రియలైజ్ అయి జాబ్ చేసే వరకు కూడా నాన్న ఏమనలేదు.

నాడు అలా.. నేడు ఇలా..

ఎట్టకేలకు జాబ్ వచ్చింది. మళ్లీ ఊరు విడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు కూడా నాకు తోడుగా నాన్న ఉన్నాడు. చిన్నప్పుడు ట్రంకు పెట్టెతో హాస్టల్ లో వదిలిపెట్టినట్టు.. ఇప్పుడు కూడా చేతిలో బ్యాగ్ పట్టుకుని బస్టాండ్ వరకూ వచ్చి బస్సెక్కించారు. మేము ఉద్యోగాలు చేస్తుండగానే.. నాన్న ఉద్యోగవిరమణ చేశారు. ఇన్నాళ్లూ కష్టపడిన నాన్న.. కనీసం ఇప్పుడైనా హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు అని భావించాం. కానీ ఇంట్లో అమ్మకి.. ఇంటికెళ్లినపుడు మాకు సహాయంగా పనిచేస్తూనే ఉన్నారు. తన శక్తినంతగా కూడగట్టుకుని నిర్మించిన నాన్న సామ్రాజ్యంలో నన్ను ఇప్పటికీ రాణిలాగే చూసుకుంటున్నాడు. నాన్న మాత్రం ఇప్పటికీ బంటు మాదిరిగానే కష్టపడుతూనే ఉన్నాడు. నాన్నని రాజు ను చేసే రోజు ఎప్పుడు వస్తుందో .. చూడాలి మరి.

Next Story