ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు వాడుతున్నారా? డేంజర్‌లో పడ్డట్లే..!

by Javid Pasha |

ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు వాడుతున్నారా? డేంజర్‌లో పడ్డట్లే..!

ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు వాడుతున్నారా? డేంజర్‌లో పడ్డట్లే..!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం వంటగదిలో ఉండే ముఖ్యమైన వస్తువులలో చాపింగ్ బోర్డ్ కూడా ఒకటి. కూరగాయలు, మాంసం, పండ్లు కట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. కొందరు ప్లాస్టిక్ బోర్డులు వాడితే, మరికొందరు వుడెన్‌(Wooden)వి వాడుతుంటారు. అయితే ప్లాస్టిక్‌వి వాడటం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌లోని మైక్రోబయాలజిస్ట్‌ల పరిశీలనలో కూడా ఇదే వెల్లడైంది.

*వాస్తవానికి చాపింగ్ బోర్డుల మీద బ్యాక్టీరియాలు పేరుకుపోతుంటాయి. అయితే చెక్క చాపింగ్ బోర్డు మీద ఉండే 99% బ్యాక్టీరియా కేవలం 3 నిమిషాల్లో చనిపోతుంది. దీంతో కూరగాయలను కట్ చేయడానికి వీటిని వాడితే బ్యాక్టీరియా వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డుల అలా కాదు, వీటిపై బ్యాక్టీరియా ఎక్కువ కాలం జీవించి ఉంటుంది. పైగా తరచూ వృద్ధి చెందుతుంది. ఇది హానికారక బ్యాక్టీరియా అయినప్పుడు, దానిపై కట్ చేసి వండిన కూరగాయలవల్ల ఫుడ్ పాయిజనింగ్, ఇతర అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

*ప్లాస్టిక్ బోర్డులు వాడేటప్పుడు దానిపై ఏర్పడే కత్తితో గాట్లలో బ్యాక్టీరియా దాక్కుని, ఆహార కణాలతో కలిసి వృద్ధి చెందుతుంది. బ్లీచ్‌తో శుభ్రం చేయడం సులభమైనప్పటికీ, ఈ గాట్లను పూర్తిగా శుభ్రం చేయడం కష్టం. బదులుగా చెక్క చాపింగ్ బోర్డు వాడటం బెటర్. ఇది అధిక నాణ్యతతోపాటు సహజమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో కూడిన స్థిరమైన ఎంపికగా నిపుణులు పేర్కొంటున్నారు.

ఆరోగ్యపరమైన నష్టాలు

*యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ వంటి సంస్థల అధ్యయనాల ప్రకారం ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డులపై కత్తి గాట్లు ఏర్పడతాయి. ఈ గాట్లలో సాల్మొనెల్లా, ఇ.కోలి వంటి బ్యాక్టీరియా దాక్కుని, తేమ, అలాగే ఆహార కణాల సహాయంతో వృద్ధి చెందుతుంది. బోర్డును శుభ్రం చేసినప్పటికీ పూర్తిగా తొలగిపోదు. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తవచ్చు.

*ప్లాస్టిక్ బోర్డులు కాలక్రమేణా గీతలు పడి, చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలను (మైక్రోప్లాస్టిక్స్) విడుదల చేస్తాయి. ఈ కణాలు ఆహారంలో కలిసి, శరీరంలో చేరవచ్చు. మైక్రోప్లాస్టిక్స్ జీర్ణవ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థపై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి.

* కొన్ని తక్కువ నాణ్యత కలిగిన ప్లాస్టిక్ బోర్డులు బిస్ఫెనాల్-ఎ (BPA) వంటి రసాయనాలను విడుదల చేయవచ్చు. ముఖ్యంగా వేడి ఆహారాలు లేదా ఆమ్ల స్వభావం(Acidic in nature) గల పదార్థాలతో (నిమ్మ, టమాటో) సంబంధం ఉన్నప్పుడు. ఈ కెమికల్స్ హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతాయి.

*వంట చేయడానికి ముందు పచ్చి మాంసం, చేపలు కట్ చేసినప్పుడు, వాటికి ఉండే బ్యాక్టీరియా చాపింగ్ బోర్డు గాట్లలో చిక్కుకుని, తర్వాత కూరగాయలు లేదా ఇతర ఆహారాలను కట్ చేసినప్పుడు క్రాస్-కంటామినేషన్ సంభవించవచ్చు. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు వాడకపోవడం మంచిదని, బదులుగా చెక్క చాపింగ్ బోర్డులు వాడటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story