- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Success Tips : మీకు మీరే గైడ్.. స్వీయ ప్రేరణే సక్సెస్ మంత్ర!

దిశ, ఫీచర్స్ : ఒక స్టూడెంట్ మంచి మార్కులు తెచ్చుకుంటే అతను విజయం సాధించినట్టే.. ఒక ఉద్యోగి వృత్తిలో రాణిస్తే అతను సక్సెస్ వైపు అడుగేసినట్టే.. విద్యార్థులు, ఉద్యోగులే కాదు, ప్రతీ వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలనే ప్రయత్నం చేస్తారు. అయితే కొందరు సక్సెస్ అవడం వెనుక అనేక కారణాలు, ప్రేరణలు కూడా ఉంటాయి. అలాంటివాటిలో స్వీయ ప్రేరణ కూడా ఒకటి అంటున్నారు నిపుణులు. అంటే ఎవరు ఎంత ప్రోత్సహించినా మీకు మీరు సన్నద్ధం కాకపోతే.. మీకు మీరు మోటివేట్ చేసుకోకపోతే కూడా విజయం ఎన్నటికీ సాధ్యం కాదు. అందుకే సెల్ఫ్ మోటివేషన్ కొంతైనా ఉండాలంటారు పెద్దలు.
వాస్తవానికి మనుషులు పరస్పర ఆధారిత జీవులు. కాబట్టి సొంత నిర్ణయాలు, స్వీయ ప్రేరణ అంతగా ఉపయోగపడుతుందా? అనే సందేహాలు సైతం ఎవరికైనా కలగొచ్చు. కానీ అలాంటి డౌట్ అవసరం లేదంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో స్వీయ ప్రేరణ మాత్రమే మిమ్మల్ని గట్టెక్కించగలదని చెబుతున్నారు. సమస్యలు, అనారరోగ్యలు ఎదురైనప్పుడు, నిరాశా నిస్పృహలు వెంటాడుతున్నప్పుడు వాటి నుంచి రియలైజ్ అవడానికి బెస్ట్ వే ఏదైనా ఉందంటే.. అదే స్వీయ ప్రేరణ అంటున్నారు నిపుణులు. మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దడంతోపాటు విజయం వైపు నడిపించడంలో ఇది సహాయపడుతుంది. అందుకే అవసరమైనప్పుడు మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి. కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని మీకు మీరు కనుగొనాలి. దటీజ్ పవర్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్.
వైఫల్యాలకు భయపడకండి
విజయం సాధించాలనుకోవడంలో తప్పులేదు. కానీ అది మాత్రమే శాశ్వతం కాదు. నిజానికది వైఫల్యాల పునాదుల మీద నిర్మించబడినప్పుడు మరింత స్ట్రాంగ్‌గా ఉంటుంది. లేకుంటే మధ్యంతరంగానే కుప్పకూలి పోవచ్చు. కాబట్టి చదువులో, ఉద్యోగంలో, జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా.. సమస్యలు మిమ్మల్ని వెంటాడుతుంటే నిరాశ చెందకండి. ఎందుకంటే ఆ నిరాశే మిమ్మల్ని మరిన్ని సమస్యల్లోకి నెట్టేస్తుంది. అలాగే ఓటమి గురించి భయపడుతూ కూడా కూర్చోకండి. వాటికి గల కారణాలను విశ్లేషించుకోండి. జీవితంలో మీకు వచ్చిన మంచి అవకాశంగా భావించండి. ఎందుకంటే ఓటమి శాశ్వతం కాదు.. వస్తే రానీయండి. మీరు విజయం వైపు ఎలా నడవాలో అది నేర్పిస్తుందని నిపుణులు సైతం చెబుతుంటారు. అందుకే ఏ సందర్భంలోనూ నిరాశను, తాత్కాలిక ఒడిదుడుకులను వైఫల్యంగా భావించవద్దు. వాటిని సక్సెస్ సాధించడానికి గుణపాఠాలుగా స్వీకరిస్తే అదే సెల్ఫ్ మోటివేషన్‌కు నిలువెత్తు నిదర్శనం.
ఆలోచనల్లో స్పష్టత
మీ ఆలోచనలు ఏవైనా కావచ్చు. వాటిలో స్పష్టత చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఎవరో చెప్పినంత మాత్రాన, ఎక్కడో చదివినంత మాత్రాన మాత్రమే మీలో మార్పు రాదు. మీకూ కూడా మారాలనే లక్ష్యం, చిత్తశుద్ధి ఉన్నప్పుడే అది సాధ్యమని చెబుతున్నారు నిపుణులు. అందుకే మీరు సక్సెస్ కావాలంటే అందుకు అనుగుణంగా మీ ఆలోచనలు మార్చుకోవాలి. మీకు మీరే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. మీ లక్ష్యం ఏమిటి? మీకు ఇబ్బందికరమైన విషయాలేమిటి? ఏ విషయాల్లో మారాలనుకుంటున్నారు? ఇలా మిమ్మల్ని ప్రశ్నించుకోండి. వాటిని ఓ కాగితంపై రాయండి. సమాధానం కూడా మీ బుర్రలోనే ఉంటుంది. కాస్త ఆలోచించి దానిని కూడా రాయండి. సరైన మార్గంలో ఎలా వెళ్లాలో అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇదే స్వీయ ప్రేరణ.
ఆచరణకు ప్రేరణ
ఏదైనా అనుకోవడం, చెప్పడం, సలహాలు ఇవ్వడం ఎవరైనా చేయగలుగుతారు. ఆచరణకు వచ్చే సరికే చాలా మంది వెనుకడుగు వేస్తారు. కానీ అవసరమైన వాటిని కూడా ఆచరణలో పెట్టకపోతే నష్టపోతారు. మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలన్నా, వృత్తి నైపుణ్యాలు అలవర్చుకోవాలన్నా, లక్ష్యం సాధించాలన్నా మిమ్మల్ని ముందుకు నడిపించే ఆచరణ మార్గమంటూ ఒకటి ఉండాలి. అందకు చక్కటి ఉదాహరణే స్వీయ ప్రేరణ. విజయం వైపు నడిపించే ఆలోచనే కాదు.. అందుకోసం కష్టపడేలా మిమ్మల్ని సిద్ధం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతికూల ఆలోచనల నుంచి, ఇబ్బందికర పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తూ సక్సెస్ వైపు నడిపిస్తుంది కాబట్టి స్వీయ ప్రేరణే సక్సెస్ మార్గం అంటున్నారు నిపుణులు.