క్యాన్సర్ చికిత్సలో కొత్త పద్ధతి.. కోతలేకుండానే ట్యూమర్ల తొలగింపు!

by Javid Pasha |

నాన్ -ఇన్వాసివ్ క్యాన్సర్ చికిత్సలో కత్తి అవసరం లేదు. శరీరంపైగానీ, ట్యూమర్లపై గానీ కోతలు ఉండవు.

క్యాన్సర్ చికిత్సలో కొత్త పద్ధతి.. కోతలేకుండానే ట్యూమర్ల తొలగింపు!
X

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్‌కు సంబంధించిన శస్త్ర చికిత్సలలో ఇప్పటి వరకు ఇన్వాసివ్ పద్ధతులు ప్రధానంగా అమలులో ఉంటున్నాయి. ఇందులో భాగంగా ట్యూమర్‌ను కత్తిలో తొలగించడం, శరీరంపై కోతలు పెట్టి, ట్యూమర్‌ను, దాని చుట్టు పక్కల లింఫ్ నోడ్స్‌ను తీసివేయడం వంటివి చేస్తారు. ఇక కీమో థెరపీ, రేడియేషన్ థెరపీలు నాన్-ఇన్వాసివ్ (Non-invasive method) అనిపించినా ఆరోగ్యకరమైన కణాలపై కొంత ప్రభావం చూపుతాయి. కానీ ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా కొత్త శస్త్ర చికిత్సా విధానం ఇప్పుడు అభివృద్ధి చెందుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని MRI-guided Focused Ultrasound (MRgFUS) లేదా High-Intensity Focused Ultrasound (HIFU) అని పిలుస్తున్నారు. ఇది కత్తి అవసరం లేని సరికొత్త నాన్ ఇన్వాసివ్ చికిత్సా విధానం. ఇంతకీ ఎలా పనిచేస్తుంది? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపరేషన్ లేకుండానే..

హైఇంటెన్సిటీ ఫోకస్డ్ ఆల్ట్రాసౌండ్ అనేది క్యాన్సర్ చికిత్సలలో ఒక ముఖ్యమైన నాన్-ఇన్వేసివ్ (కత్తిలేని) పద్ధతిగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో ఆపరేషన్ చేయకుండానే, కేవలం ఎంఆర్ఐ స్కానర్ సహాయంతో రియల్-టైమ్ ఇమేజ్‌లను ఉపయోగించి, అల్ట్రాసౌండ్ తరంగాలను ఖచ్చితంగా ట్యూమర్ మీద కేంద్రీకరిస్తారు. ఈ తరంగాలు ట్యూమర్ కణాలను వేడిచేసి నాశనం చేస్తాయి. ఇది శరీరంపై ఎటువంటి కోతలూ లేకుండా తక్కువ నొప్పి, మినిమల్ స్కారింగ్, వేగవంతమైన రికవరీని అందిస్తుంది. కాబట్టి చాలా సందర్భాల్లో రోగులు అదే రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఎలా ఉపయోపగపడుతుంది?

ప్రస్తుతం ఈ నాన్-ఇన్వాసివ్ మెథడ్ ప్రొస్టేట్ క్యాన్సర్ (localized, intermediate-risk)కు బాగా ఉపయోగపడుతోందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎముకల్లో వ్యాపించిన క్యాన్సర్ నొప్పి, గర్భాశయ ఫైబ్రాయిడ్స్, కొన్ని బ్రెయిన్ ప్రొసీజర్లు, అలాగే ఇతర సాలిడ్ ట్యూమర్లకు కూడా ఇది అప్లై అవుతోంది. అయితే వైద్య పరిశోధకుల ప్రకారం ఇది ఇంకా అన్ని రకాల ట్యూమర్లకు సరిపోదు. ట్యూమర్ స్థానం, పరిమాణం, రకం ఆధారంగా మాత్రమే డాక్టర్లు ఈ పద్ధతిని సూచిస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటికిప్పుడు ఇది సాంప్రదాయ శస్త్రచికిత్స, రేడియేషన్ లేదా కీమోథెరపీకి పూర్తి ప్రత్యామ్నాయం కాదు. కాకపోతే ట్యూమర్‌ను మాత్రమే టార్గెట్ చేసే ఫోకల్ థెరపీగా, ప్రభావవంతమైన మంచి ఆప్షన్‌గా అభివృద్ధి చెందుతోందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే అమెరికా, యూరప్ సహా పలు దేశాల్లో క్లినికల్ ఉపయోగంలో ఉంది. ప్రొస్టేట్ క్యాన్సర్‌కు ఇది ఎఫ్‌డీఏ అనుమతి పొందిన స్థాయిలో అందుబాటులో ఉంది. భారత దేశంలోనూ అందుబాటులో ఉంది. కొన్ని ప్రముఖ హాస్పిటల్స్‌లల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సలో దీనిని ఉపయోగిస్తు్న్నారు. అయితే అన్ని రకాల ట్యూమర్లకు అందుబాటులో లేదు.

ప్రయోజనాలు

నాన్ -ఇన్వాసివ్ క్యాన్సర్ చికిత్సలో కత్తి అవసరం లేదు. శరీరంపై కోతలు ఉండవు. చాలా తక్కువ నొప్పి, మినిమల్ స్కారింగ్, వేగవంతమైన రికవరీ, చాలా సందర్భాల్లో అదే రోజు డిశ్చార్జ్ అయ్యే చాన్స్ ఉంటుంది. రేడియేషన్ లేదు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్‌కు అవకాశం లేదు. సాంప్రదాయ క్యాన్సర్ చికిత్సలతో పోలిస్తే ఆరోగ్యకరమైన కణాలను ఎక్కువగా కాపాడుతుంది. ప్రొస్టేట్ క్యాన్సర్‌ వల్ల తలెత్తిన మూత్ర నాళ సంబంధిత సమస్యలు, లైంగిక సమస్యలు సైతం తగ్గుతాయి. రోగి జీవన నాణ్యత మెరుగు పడుతుంది. అయితే నాన్ ఇన్వేసిస్ క్యాన్సర్ చికిత్స అన్ని రకాల క్యాన్సర్లకు సరిపోదు. కాబట్టి ట్యూమర్ స్థానం, పరిమాణం, స్టేజ్ ఆధారంగా దీనిని ఆయా సందర్భాల్లో అమలు చేయాలా లేదా అనేది డాక్టర్లు మాత్రమే నిర్ణయిస్తారని నిపుణులు చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story