Kids and Parenting : జర సోచో !

by Javid Pasha |   (  Updated:2025-02-19 14:00:45  IST  )

Kids and Parenting : జర సోచో !

Kids and Parenting : జర సోచో !
X

చిన్న పిల్లల మనసు తెల్లకాగితం లాంటిది..

ఏ గీతలు గీస్తామో ఆ గీతలే ఉండిపోతాయ్

చిన్న పిల్లల మనసు సున్నితమైనది..

ఏ ఆలోచనలు ఎక్కువ ప్రభావం చూపుతాయో..

అవే వారి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి..

అందుకే జర జాగ్రత్త అంటున్నారు నిపుణులు..

పిల్లలముందు పేరెంట్స్ ఎలా మసలుకోవాలో చెబుతున్నారు.

- దిశ, ఫీచర్స్

పిల్లలు కాదు.. వాళ్లు పిడుగులు, అంటుంటాం. మాట వరుసకైనా, చమత్కారమైనా వాళ్లు చేసే అల్లరి అట్లుంటది మరి. ఈ జనరేషన్ పిల్లలైతే మరీ ఫాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే హైపర్ యాక్టివ్. అయితే పిల్లలు తమ పేరెంట్స్‌ను చూసే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారని మీకు తెలుసా? నిపుణులు అదే చెబుతున్నారు. తల్లిదండ్రుల బిహేవియర్‌ను బట్టి కూడా పిల్లల వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుందని అంటున్నారు. అందుకే మీ పిల్లలు మంచి ప్రవర్తన గల వారిగా, మంచి వ్యక్తులుగా, ప్రయోజకులుగా మారాలంటే తల్లిదండ్రులుగా కొన్ని మిస్టేక్స్ చేయవద్దంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా!

పిల్లల ముందు గొడవలొద్దు

భార్యా భర్తలన్నాక చిన్న తగాదాలో, అప్పుడప్పుడు గొడవలో ఉంటాయి. అయితే ఇందులోకి పిల్లలను మాత్రం లాగవద్దని, పిల్లల ముందు ఎప్పుడూ గొడవపడవద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, పెద్ద పెద్దగా అరవడం వంటివి చేయకూడదు. ఎందుకంటే బాల్యంలో ప్రతీ విషయాన్ని బయటి పరిస్థితుల నుంచి గ్రహించడం ద్వారా నేర్చుకుంటారు పిల్లలు. ఇక్కడా అదే జరుగుతుంది. పైగా పేరెంట్స్ తరచుగా పిల్లల ముందు గొడవ పడటం వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. బాధలకు, ఆందోళనలకు, ఒత్తిడికి గురవుతారు. ఇది పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

చెడుగా మాట్లాడకండి

కుటుంబం అన్నాక సవాలక్ష సమస్యలుంటాయి. వాటిని పెద్దలు లేదా దంపతులు కూర్చొని పరిష్కరించుకోవాలి. కానీ కొందరు పిల్లలను ఇన్వాల్వ్ చేస్తుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ముందు కుటుంబంలో ఇతర సభ్యుల గురించి గానీ, బంధువుల గురించి గానీ చెడుగా మాట్లాడటం చేయకూడదు. ఈ విషయాలు పిల్లలను గందరగోళానికి గురిచేస్తాయని, బంధువులతో, ఇతర వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యే విషయంలో భవిష్యత్తులో కూడా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొనే చాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్ అలా చెడుగా మాట్లాడం గ్రహించినప్పుడు పిల్లలు కూడా అలా మాట్లాడటంలో తప్పులేదని ఫిక్స్ అయితే అది వారి మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

రంగు, ఆకారంపై కామెంట్స్

కొన్నిసార్లు పిల్లలు, కుటుంబ సభ్యులు చిన్న పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వారి రంగు, శరీర ఆకారం, రూపం గురించి ప్రస్తావిస్తుంటారు. అయితే తరచుగా ఈ విషయాలు ప్రస్తావిస్తూ హేళనగానో, వెటకారంగానో మాట్లాడుతుంటే మాత్రం అది పిల్లల వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. చిన్నప్పుడు అసలే సెన్సిటివ్‌గా ఉంటారు. కాబట్టి హేళన, అవమానం వంటి అనుభవాలు వారి మనోఫలకంపై చెరగని ముద్ర వేస్తాయి. దీంతో నిరాశా భావాలు వృద్ధి చెందే చాన్స్ ఉంటుంది. అవే పిల్లల వ్యక్తిత్వంపై, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దీంతో ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థైర్యం వంటివి తగ్గుతాయి. అందుకే అలా మాట్లాడవద్దంటున్నారు నిపుణులు.

ఆస్తి గొడవలు, విడాకులు..

మీది పెద్ద కుటుంబం అయితే ఆస్తి తగాదాలకు అవకాశం ఉండవచ్చు. కొన్నిసార్లు ఏవో కారణాల వల్ల దంపతులు విడాలు తీసుకోవాలని భావించవచ్చు. ఇవన్నీ పెద్దల మధ్యనే జరగాల్సిన వ్యవహారాలని గుర్తుంచుకోండి. పిల్లల ముందు చర్చించడం, వాళ్ల ముందు వాదించుకోవడం గొడవపడటం వారి మనస్తత్వంపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. భార్య భార్తలు లేదా కుటుంబ సభ్యులు తమలో తాము పోట్లాడుకోవడం, ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడుకోవడం చూసిన పిల్లలు ఆందోళన చెందుతుంటారు. ఇది వారిలో మానసిక గందరగోళానికి, నిరాశ భావాలకు కారణం కావచ్చు. క్రమంగా ప్రతికూల ఆలోచనలకు దారితీయవచ్చు. ఇది పిల్లల వ్యక్తిత్వంపై ప్రభావం చూపడం వాళ్ల భవిష్యత్తును రిస్కులో పడేస్తుంది. సో అలాంటి విషయాలు పిల్లల ముందు అస్సలు ప్రస్తావించ కూడదు అంటున్నారు నిపుణులు.

ఒత్తిడికి గురిచేయకండి

పేరెంట్స్ పిల్లల గురించి ఆలోచించడం, వారి మేలు కోరి హెచ్చరించడం, కొన్ని విషయాలు పంచుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే అవి తమ పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా ఆలోచించాలి. వారిని గందర గోళానికి, ఒత్తిడికి, భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదు. ముఖ్యంగా హెచ్చరించడం, దండించడం, ప్రవర్తించడం వంటివి తీవ్రస్థాయిలో ఉండకూడదు. అలాగే అలాంటి విషయాలను పంచుకోవడం కూడా అస్సలు చేయకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలాంటి వాటికే వాళ్లు ఎక్కువ ప్రభావితం అయితే, ప్రతికూల భావాలు, ఆలోచనలే మనసులో నాటుకుపోతే.. మానసిక బలహీనులుగా మారవచ్చు. అందుకే పిల్లలు ఒత్తిడికి గురయ్యేలా ప్రవర్తించవద్దు అంటున్నారు నిపుణులు.

Next Story