ఆర్థిక స్వాతంత్ర్యం vs వైవాహిక బంధం.. భర్తకు జాబ్ లేకుంటే విడాకులే!

by Javid Pasha |   (  Updated:2026-04-29 10:14:59  IST  )

భర్త ఉద్యోగం చేయకపోయినా, తక్కువ సంపాదించినా భార్య విడాకులు కోరే అవకాశం పెరుగుతున్నదని ఒక అధ్యయనం పేర్కొన్నది

ఆర్థిక స్వాతంత్ర్యం vs వైవాహిక బంధం.. భర్తకు జాబ్ లేకుంటే విడాకులే!
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల మహిళల్లో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఏంటంటే.. భర్త/పార్ట్‌నర్ ఉద్యోగం చేయకపోతే.. లేదా తమకంటే తక్కువ సంపాదిస్తుంటే ఆ సంబంధంలో ఎక్కువ రోజులు ఉండేందుకు వారు ఇష్టపడటం లేదని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీంతో విడాకుల రెట్లు పెరుగుతున్నాయని తేలింది. అనేక విషయాల్లో తాము నాయకత్వ స్థాయిలో ఉండాలని, స్త్రీల అజమాయిషి కూడా అవసరమని భావించే మహిళలు సైతం ఆర్థిక విషయాల్లో మాత్రం సమానత్వ ధోరణికి భిన్నంగా, పాత సామాజిక ఆలోచనా ధోరణిపై ఆసక్తి చూపుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. సాంప్రదాయకంగా పురుషుడు కుటుంబ పోషకుడిగా ఉండే విధానం మారి, మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడం మంచి పరిణామమే అయినప్పటికీ, సంబంధాలలో కొత్త సవాళ్లు సైతం క్రియేట్ అవడానికి ఇది దారితీస్తున్నదని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు పేర్కొంటున్నారు.

ఆ విధంగా ఆధారపడితే..

హార్వర్డ్ అధ్యయనంతో పాటు యూనివర్సిటీ ఆఫ్ చిగాకో పలు ఇతర పరిశోధనల ప్రకారం కూడా.. భార్య తన భర్తకంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు విడాకులు తీసుకునే అవకాశం దాదాపు 50% పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా పురుషులు ఉద్యోగంలో లేనప్పుడు లేదా వారు ఆర్థికంగా బలహీనులైనప్పుడు భార్య సంపాదనపై ఎక్కువగా ఆధారపడినప్పుడు ఈ ముప్పు 32-33% ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు పేర్కొన్నారు. ఎందుకిలా అంటే.. ఆర్థిక స్వాత్రంత్ర్యం మహిళలకు తమ వైవాహిక జీవితంలో మెరుగైన నిర్ణయాధికారాన్ని, నచ్చినట్లు జీవించే అవకాశాన్ని అందిస్తోంది. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడగలిగే స్థితిలో ఉన్నప్పుడు అసంతృప్తికరమైన సంబంధాల నుంచి బయటకు రావడానికి మహిళలు వెనుకాడటం లేదు. పైగా ఈ తరహా విడాకులలో ఎక్కువ శాతం మహిళలే చొరవ తీసుకోవడం లేదా పరస్పర అంగీకారంతో విడిపోవడం గమనించవచ్చునని నిపుణులు అంటున్నారు.

అభద్రతా భావానికి దారి..

ఆదాయంలో వచ్చే మార్పులు కేవలం డబ్బుకు సంబంధించినవి మాత్రమే కాకుండా దంపతులు మధ్య ఉండే పవర్ డైనమిక్స్(Power Dynamics)‌ను కూడా మారుస్తున్నాయని అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా భార్య తనకంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు లేదా ఉన్నత హోదాలో ఉన్నప్పుడు, పురుషులు తరచుగా అభద్రతా భావానికి (Insecurity) లోనవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అభద్రత వారి ప్రవర్తనలో మార్పులకు, అసహనానికి దారితీసి, చివరికి అది విడాకులకు ఒక ప్రధాన కారణమవుతోంది. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రకారం.. కొందరు మహిళలు తమ భర్త తక్కువ హోదాలో ఉన్నప్పుడు సామాజికంగా తమ గౌరవం తగ్గుతుందని భావించే అవకాశం ఉంది. అంతేకాకుండా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండటంవల్ల ఇబ్బందికరమైన లేదా అసంతృప్తికరమైన సంబంధాల్లో రాజీపడకుండా విడిపోవడానికి ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. మొత్తానికి పురుషుడు మాత్రమే సంపాదించే పాత పద్ధతి నుంచి ఇద్దరూ సమానంగా లేదా మహిళ అధికంగా సంపాదించే స్థితికి మారడంవల్ల, ఆధునిక సంబంధాలలో పరస్పర గౌరవం, సర్దుబాటు ధోరణి మరింత ఆవశ్యకం అవుతోందని, ఈ మారుతున్న సామాజిక పోకడలను అర్థం చేసుకోవడం నేటి తరం జంటకు చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

ఇండియాలో పరిస్థితి

భారత దేశానికి సంబంధించి ఈ అధ్యయనం నేరుగా జరగకపోయినా, ఇక్కడి పరిస్థితులకు కొంత వర్తిస్తుందని, మెట్రో నగరాల్లో మహిళా ఉద్యోగినుల సంఖ్య పెరగడంతో ఇక్కడ కూడా కొంత వరకు విడాకుల రెట్లు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ పురుషుడే ఇంటికి యజమాని అనే భావన ఇంకా బలంగా ఉంది. దీంతో భార్య ఎక్కువ సంపాదించినప్పుడు అది తన అహాన్ని (Ego) దెబ్బతీసే అవకాశం ఉంటుందని భర్త ఫీలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటోంది. ఇది వివాదాలకు, విడాకులకు దారితీస్తుంది. అయితే సామాజిక ఒత్తిడివల్ల, ఆర్థిక కారణాలవల్ల విడాకులు తీసుకోవడమనేది పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇండియాలో చాలా తక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ మారుతున్న ఆధునిక జీవనశైలిలో ఈ ప్రభావం క్రమంగా పెరుగుతోందని కూడా పేర్కొంటున్నారు.

Next Story