మొటిమలు మాట్లాడుతాయ్.. లోపలి సమస్యలు బయటపెతాయ్..!

by Javid Pasha |   (  Updated:2025-11-15 11:35:50  IST  )

నుదుటి భాగంపై మొటిమలు ఎక్కువగా, తరచుగా వస్తుంటే గనుక జీర్ణక్రియ సమస్యలు(Gut Health) ఎదుర్కొంటున్నారని అర్థం.

మొటిమలు మాట్లాడుతాయ్.. లోపలి సమస్యలు బయటపెతాయ్..!
X

దిశ, ఫీచర్స్ : మీకు జ్వరం వచ్చిందా? జలుబు చేసిందా? ఇలా ఏదైనా ఒక అనారోగ్య సమస్యను వెంటనే గుర్తించడానికి ల్యాబ్‌కి వెళ్లి టెస్టులే చేయించుకోవాల్సిన అవసరం లేదు. శరీరంలో జరిగే మార్పులు, బయటకు కనిపించే లక్షణాలు లేదా ఇబ్బందులను బట్టి కూడా తెలిసిపోతుంది. అలాగే చర్మంపై వివిధ భాగాల్లో ఏర్పడే మొటిమలను బట్టి కూడా మీ శరీరంలో ఏ సమస్య ఏర్పడిందో, ఏ అవయవాల్లో ఎటువంటి లోపం తలెత్తిందో గుర్తింవచ్చునని ఆయుర్వేదం చెబుతోంది. వాటికి పరిష్కారాలను సైతం చూపుతోంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కనుబొమ్మల మధ్య..

కనుబొమ్మల మధ్య తరచుగా మొటిమలు వేధిస్తుంటే.. ఆ పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే లివర్ సంబంధిత సమస్యలు ప్రారంభం అయినట్టు అనుమానించాలి. అలాంటప్పుడు లివర్ డిటాక్స్ అవసరం అంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. అందుకోసం జంక్ ఫుడ్, ఆల్కహాల్, ధూమపానం వంటివి తగ్గించాలి. ఆకుకూరలు, బీట్‌రూట్, పసుపు వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి.

నుదుటిమీద..

నుదుటి భాగంపై మొటిమలు ఎక్కువగా, తరచుగా వస్తుంటే గనుక జీర్ణక్రియ సమస్యలు(Gut Health) ఎదుర్కొంటున్నారని అర్థం. అలాంటప్పుడు మీరు మజ్జిగ, ఇడ్లీ, ఫైబర్ రిచ్ వంటి ఆహారాలు తీసుకుంటూ జంక్ ఫుడ్స్ తగ్గించాలి. అప్పుడు ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది.

ముక్కు చుట్టూ ఉంటే..

ముక్కు చుట్టూ తరచుగా మొటిమలు వస్తూ మీరు ఇబ్బంది పడుతుంటే అది గుండె ఆరోగ్యం బాగోలేకపోవడంవల్ల కూడా కావచ్చు. అంటే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ఇలాంటప్పుడు ఆయిలీ ఫుడ్‌ను తగ్గించాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. అవసె గింజలు ఆహారంలో భాగంగా ఉపయోగించడం బెటర్. పరిస్థితిని బట్టి వైద్య నిపుణులను సంప్రదించాలి.

చిన్‌పై భాగంలో..

గడ్డం లేదా గదువ(chin) భాగంపై మొటిమలు తరచుగా వస్తుంటే మీలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కావచ్చు. ముఖ్యంగా పీసీఓఎస్(PCOS), మెన్సెస్ సైకిల్, థైరాయిడ్ హార్మోన్లలో హెచ్చు తగ్గులు ఇందుకు దారితీస్తుంటాయి. కాబట్టి ఇలాంటప్పుడు జింక్ అధికంగా లభించే ఆహారాలు తీసుకోవాలి.

చెవుల చుట్టూ ఉన్నప్పుడు

చెవుల చుట్టూ మొటిమల సమస్య వేధిస్తుంటే కిడ్నీ రిలేటెడ్ సమస్యలు ప్రారంభమై ఉండవచ్చు. ముఖ్యంగా నీళ్లు తక్కువగా తాగడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వంటివి ఇందుకు కారణం అవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. కోకోనట్ వాటర్ కూడా తీసుకోవచ్చు. అయితే పైన పేర్కొన్నవని బయటి లక్షణాల ద్వారా శరీరంలోపలి సమస్యలను అంచనా వేసే ఫేస్ మ్యాపింగ్ పద్ధతి(Face mapping method) మాత్రమే. వైద్య నిపుణులను సంప్రదించడం ద్వారా దేనికైనా చక్కటి పరిష్కారం లభిస్తుందనేది గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link

Next Story