Baby food : ఏడాదిలోపు పిల్లలకు తినిపించకూడని 5 ఆహారాలు.. ఎందుకంటే..

by Javid Pasha |

Baby food : ఏడాదిలోపు పిల్లలకు తినిపించకూడని 5 ఆహారాలు.. ఎందుకంటే..

Baby food : ఏడాదిలోపు పిల్లలకు తినిపించకూడని 5 ఆహారాలు.. ఎందుకంటే..
X

దిశ, ఫీచర్స్ : ఏడాది లోపు పిల్లల జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. వారి ఆరోగ్య అవసరాలు పెద్దల కంటే భిన్నంగా ఉంటాయి. కాబట్టి కొన్ని ఆహార పదార్థాలు జీర్ణ సమస్యలు, అలెర్జీలు, లేదా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగించవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణుల. అలాంటి కొన్ని పదార్థాలేవో తెలుసుకుందాం.

* తేనె : తేనెలో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇది శిశువులలో బోటులిజం అనే అరుదైన, ప్రాణాంతక వ్యాధిని కలిగిస్తుంది. శిశువుల జీర్ణవ్యవస్థ ఈ బ్యాక్టీరియాతో పోరాడేంత పరిపక్వం కాదు. కాబట్టి తేనెను తినిపిస్తే ఇది కండరాల బలహీనత, శ్వాస సమస్యలు, కొన్నిపరిస్థితుల్లో మరణానికి కూడా దారితీయవచ్చు. అందుకే ఒక సంవత్సరం లోపు పిల్లలకు తేనె లేదా తేనెతో తయారైన ఆహారాలను ఇవ్వకూడదు.

* ఆవు పాలు : ఆవు పాలు శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన విటమిన్ E, ఐరన్, జింక్ వంటి పోషకాలను సరిపడా అందించవు. ఇవి శిశువులలో జీర్ణ సమస్యలు, ఐరన్ లోపం, లేదా అలెర్జీలను కలిగించవచ్చు. అదనంగా, ఆవు పాలలోని అధిక ప్రోటీన్, ఖనిజాలు శిశువుల మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. తల్లి పాలు లేదా ఫార్ములా మిల్క్ మాత్రమే ఏడాది లోపు శిశువులకు వైద్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు.

* పండ్ల రసాలు : పండ్ల రసాలు శిశువులకు ఎటువంటి పోషక ప్రయోజనాన్ని అందించవు. పైగా హై షుగరింగ్ కంటెంట్ కలిగి ఉంటాయి. ఇవి దంతాల అభివృద్ధిని దెబ్బతీస్తాయి. ఊబకాయం లేదా జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. ఇవి శిశువుల ఆకలిని తగ్గించి, తల్లి పాలు లేదా ఫార్ములా వినియోగాన్ని తగ్గిస్తాయి. బదులుగా, తాజా పండ్లను మెత్తగా చేసి లేదా చిన్న ముక్కలుగా కోసి తినిపించడం ఉత్తమం.

* ఉప్పు : శిశువుల మూత్రపిండాలు అధిక సోడియంను మేనేజ్ చేయలేవు. కాబట్టి ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు (చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటివి) ఇవ్వకూడదు. పైగా అధిక ఉప్పు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. డీహైడ్రేషన్ లేదా రక్తపోటు సమస్యలకు దారితీయవచ్చు. శిశువుల ఆహారంలో ఉప్పు అవసరం లేదు, ఎందుకంటే తల్లి పాలు లేదా ఫార్ములా సహజంగా సరిపడా సోడియం అందిస్తాయి.

* పచ్చి గుడ్లు లేదా ఉడకని మాంసం/చేపలు : పచ్చి గుడ్లు, ఉడకని మాంసం, లేదా చేపలలో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శిశువులలో ఫుడ్ పాయిజనింగ్‌కు లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. శిశువుల రోగనిరోధక వ్యవస్థ ఈ బ్యాక్టీరియాతో పోరాడలేదు. పైగా ఇది డయేరియా, జ్వరం, లేదా మరింత తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అలాగే క్యారెట్, యాపిల్ వంటి పచ్చిగా ఉండే పండ్లు, ఆహారాలు శిశువులకు తినిపించకూడదు. వారికి ఇచ్చే ఏ ఆహారమైనా పూర్తిగా ఉడికించినది. సురక్షితమైనది అయి ఉండాలి అంటున్నారు నిపుణులు. పిల్లలకు ఆహారం విషయంలో అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story