Anti-Aging Secrets : ఈ సీక్రెట్స్ ఫాలో అయితే చాలు.. మీ వయసెంతో ఎవరూ చెప్పలేరు !

by Javid Pasha |   (  Updated:2025-05-15 07:54:32  IST  )

Anti-Aging Secrets : ఈ సీక్రెట్స్ ఫాలో అయితే చాలు.. మీ వయసెంతో ఎవరూ చెప్పలేరు !

Anti-Aging Secrets : ఈ సీక్రెట్స్ ఫాలో అయితే చాలు.. మీ వయసెంతో ఎవరూ చెప్పలేరు !
X

దిశ, ఫీచర్స్ : వయసు మీదపడే కొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం. కానీ ఇటీవల చాలా మంది చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలకు సంబంధించిన శారీరక లక్షణాలను ఎదుర్కొంటున్నారు. 40 ఏండ్లలోపే ముఖంపై ముడతలు, నుదుటిపై గీతలు, జుట్టు రాలడం, బట్టతల రావడం, పొట్ట పెరగడం వంటి సమస్యలతో ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఇలా జరగకూడదంటే ఏం చేయాలి? వృద్ధాప్యాన్ని దూరం చేసే యాంటీ ఏజింగ్ సీక్రెట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహార నియమాలు

సాధారణంగా ఉన్న వయసుకంటే ఎక్కువ ఏజ్ వ్యక్తుల్లా శారీరక మార్పులు సంభవించడానికి ఆహారపు అలవాట్లు కూడా కారణం అవుతుంటాయని నిపుణులు అంటున్నారు. హెల్తీ ఫుడ్స్ కాకుండా జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తినేవారిలో యవ్వన ఛాయలు త్వరగా కనుమరుగవుతాయి. అలా జరగకూడదంటే పోషకాలతో కూడిన సమతుల్య ఆహార నియమాలు(A balanced diet) పాటించాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి తాజా కూరగాయలు, గింజలు, బెర్రీలు, ఆకు కూరలు, లీన్ ప్రొటీన్లు, చేపలు, పరిమిత స్థాయిలో మాంసాహారం వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి కాబట్టి వయసుకంటే ముందే వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. అధిక చక్కెరలు కలిగిన ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ నివారించాలి.

నీళ్లు ఎక్కువగా తాగాలి

వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడానికి గల కారణాల్లో నీరు తక్కువ తాగడం కూడా ఒకటి. కొందరు కేవలం తిన్నప్పుడు మాత్రమే తాగుతుంటారు. ఇది ప్రమాదకరం. శరీరంలో నీటిశాతం తగ్గడంవల్ల డ్రైగా మారుతుంది. విష పదార్థాలు బయటకు పంపడంలో నీరు చాలా ముఖ్యం. తక్కువ నీరు తాగడంవల్ల శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయంటున్నారు నిపుణులు. దీంతో తక్కువ ఏజ్‌లో వృద్ధాప్యాన్ని సూచించేలా శరీర ఆకృతి మారవచ్చు. అలా జరగకూడదంటే ప్రతిరోజూ శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. 8 నుంచి 10 గ్లాసులు తాగడం ఆరోగ్య దాయకమని నిపుణులు సూచిస్తున్నారు.

ఫిజికల్ యాక్టివిటీస్

ఎంత పోషకాహారం తీసుకున్నా, ఎన్ని బ్యూటీ టిప్స్ పాటించినా శారీరక శ్రమ లేకపోతే క్రమంగా వృద్ధాప్య ఛాయలకు దారితీస్తుంది. దీంతో శరీరంలో ప్రతికూల మార్పులు సంభవిస్తుంటాయి. తగిన ఆహార నియమాలు పాటిస్తూ, రోజూ వ్యాయామాలు లేదా తిన్న ఆహారాన్ని బర్న్ చేయగలిగే విధంగా ఏదో ఒక శారీరక శ్రమ కలిగి ఉండటంవల్ల బాడీలో వృద్ధాప్య ఛాయలకు సంబంధించిన మార్పులు రాకుండా ఉంటాయి. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు. పైగా వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్ ఇలా ఎక్సైర్ సైజ్‌లు ఏవైనా సరే శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. స్ట్రెస్ హార్మోన్లు తగ్గితాయి. వృద్ధాప్య ఛాయలు నెమ్మదిస్తాయి.

క్వాలిటీ స్లీప్

వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడానికి మరో ప్రధాన కారణం నిద్రలేమి. తరుచుగా ఈ సమస్యను ఎదుర్కోవడం లేదా నాణ్యమైన నిద్రలేకపోవడం మీలోని యవ్వనాన్ని దూరం చేస్తుంది. వృద్ధాప్య ఛాయలకు కారణం అవుతుంది. నిజానికి నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో శరీరం కణాలను రిపేర్ చేస్తుంది. జీవక్రియలను సమతుల్యం చేస్తుంది. స్కిన్ రీజనరేట్ అవుతుంది. దీంతో చర్మంలో నిగారింపు పెరుగుతుంది. ముఖంపై ముడతలు రాకుండా ఉంటాయి. స్ట్రెస్, యాంగ్జైటీస్ వంటివి దూరం అవుతాయి. మొత్తానికి యాంటీ ఏజింగ్ ప్రాసెస్‌లో నిద్ర కీ రోల్ పోషిస్తుంది.

స్ట్రెస్ మేనేజ్‌మెంట్

వృద్ధాప్య లక్షణాలను వేగవంతం చేసే ప్రధాన శత్రువు మానసిక ఒత్తిడి అంటుంటారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువ రోజులు ఈ సమస్యను ఎదుర్కొనే వారి శరీరంలో యవ్వన ఛాయలు త్వరగా కనుమరుగవుతాయి. చిన్న వయసులోనే పెద్ద వయసు వ్యక్తుల్లా కనిపిస్తారు. ఇలా జరగకూడదంటే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. అలా అని ఒత్తిడిలేని జీవితం ఉండదు. కాకపోతే మీరు ఒత్తిడిని ఎలా నిర్వహిస్తన్నారనేది కూడా ఇక్కడ కీలకం. ప్రతిదీ ఒత్తిడిగానే ఫీలయ్యే అతి ఆలోచనా ధోరణిని కూడా మానసిక ఒత్తిడిగానే నిపుణులు పేర్కొంటున్నారు. ఇది వృద్ధాప్యానికి దగ్గర చేస్తుంది. కాబట్టి మీలో ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే దూరం చేసుకోండి అంటున్నారు నిపుణులు.

ఎండ నుంచి చర్మ సంరక్షణ

శరీరం భరించగలిగినంత ఎండ తగలడం ఆరోగ్యానికి హానికరం కాదు. పైగా మార్నింగ్ పూట లేలేత ఎండకు గురికావడం శరీరంలో విటమిన్ ‘డి’ని పెంచుతుంది. కానీ శరీరానికి ఇబ్బంది కలిగించేంత అధిక ఎండకు ఎక్కువసేపు గురికావడం అనేది త్వరగా వృద్ధాప్యానికి దారితీస్తుంది. కాబట్టి సన్‌ఎక్స్‌పోజర్ నుంచి మీ శరీరాన్ని కాపాడుకోడానికి బయటకు వెళ్లినప్పుడు టోపీలు, గొడుగులు వంటివి వాడటం, సన్ స్ర్కీన్ యూజ్ చేయడం, వీలైనంత మేరకు ఎండలో ఎక్కువసేపు గడపకపోవడం వంటివి చేయాలి. అట్లనే ప్రొటీన్లు, విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ సి ఉండే పండ్లు, ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి. ఇవన్నీ యాంటీ ఏజింగ్ లక్షణాలను ప్రేరేపించడం ద్వారా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story