- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : ‘‘ఏం ముద్దు అంటే పని ముద్దు అన్నారట ఎనకటికి పెద్దలు’’ ఇప్పటికీ ప్రజలు తరచుగా వాడుతున్న పాతకాలం సామెత ఇది. ఇంట్లో పిల్లలు చెప్పినట్టు వినకపోతేనో, యువతీ యువకులు పని ఎగ్గొట్టి ఖాళీగా తిరుగుతుంటేనో దీనిని యూజ్ చేస్తుంటారు. పట్టణాల్లో తక్కువ కానీ.. గ్రామాల్లో చాలా మంది పని చేసుకొని బతకాలన్న కోణంలో ఈ సామెతను చమత్కారంగా వాడుతూ యువతకు చురకలంటిస్తుంటారు. సామెత పాతది కావచ్చు. ఆధునిక జీవితానికది సరిగ్గా వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే మనిషి బతుకంతా పనీ పద్ధుతలపైనే ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత జీవితానికైనా, వృత్తి జీవితంలో ఎదగాలన్నా శ్రమ కీలకం. అందుకే పనితనమే అసలైన నైపుణ్యం అంటారు పెద్దలు. అయితే ఇటీవల కొందరిలో ఆ నైపుణ్యం లోపిస్తోంది. వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ తప్పుతోంది. అందుకు గల అనేక కారణాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పని అంటే.. మరో అర్థం శ్రమ. చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంటి పనిలో.. ఇలా ఎక్కడైనా మనం చేసే శ్రమను బట్టే ఫలితాలు ఉంటాయి. అయితే కొన్నిసార్లు రకరకాల ఆలోచనలు, ఆందోళనలు, పరిస్థితులు, అనాసక్తులు పనిలో నాణ్యతపై ప్రభావం చూపుతుంటాయి. ఇందుకు కారణం ప్రతికూల వాతావరణం, ప్రతికూల ఆలోచనలు ఒకటైతే, పని భారం పెరగడం, చేసే పని లేదా ఉద్యోగంపట్ల అనాసక్తి, ఉద్దేశ పూర్వకంగా పని ఎగ్గొట్టాలనుకోవడం వంటివి కూడా మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సిచువేషన్‌ను ఒక వ్యక్తి దీర్ఘకాలంపాటు కొనసాగిస్తే అది అతని/ఆమెలో అసమర్థత భావాలకు దారితీసే రుగ్మతగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనినే సైకాలజీ పరిభాషలో ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’గా పేర్కొంటున్నారు.
ఆందోళ అధికమైతే..
కొందరు సరిగ్గానే వర్క్ చేసినప్పటికీ.. తాము బాగా చేయలేకపోయామనే బాధ, అసంతృప్తి లేదా ఆందోళతో ఇబ్బంది పడితే.. మరికొందరు ఏమాత్రం సరిగ్గా పనిచేయకుండానే సంతృప్తి చెందుతుంటారు. ఇవి రెండు కూడా ఇంపోస్టర్ సిండ్రోమ్ లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఈ స్థితిలో ఉన్న వ్యక్తులు తమను తాము అసమర్థులుగా భావించుకుంటూ కృంగిపోతుంటారు. తమలో తగిన సామర్థ్యం, ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించడంలో ఇబ్బంది పడతారు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి, సామాజికంగా ఎదుర్కొనే పలు రకాల ఇబ్బందులు, వివక్షలు కూడా ఇందుకు కారణం కావచ్చునని సైకాలజిస్టులు అంటున్నారు. అయితే బాగా చేయలేకపోయామనే ఆందోళనకు సంబంధించిన భావన ప్రజల్లో ఉన్నట్లు మొట్ట మొదటిసారిగా పౌలిన్ రోస్ క్లాన్స్, సుజానే ఈమ్స్ అనే పేరుగల ఇద్దరు సైకాలజిస్టులు 1978లో గుర్తించారు. పని ప్రదేశాల్లో, సమాజంలో లింగ భేదాలు, వివక్ష, విద్యా వ్యవస్థలో లోపాలు, పక్షపాత ధోరణి, అలాగే వ్యక్తుల ఉద్దేశ పూర్వక నిర్ణయాలు, పనిని ఎగ్గొట్టాలనే ఆలోచనలతో ఎక్కువకాలం గడపడం వంటివి ఇందుకు కారణం అవుతుంటాయని కూడా గుర్తించారు.
గత విజయాలను గుర్తు చేసుకోండి
మీరు సమర్థులైనప్పటికీ మిమ్మల్ని మీరు నమ్మలేకపోవడం, మీరు చేసిన పనిపట్ల మీరు సంతృప్తి చెందకపోవడం లేదా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళనకు గురవుతుంటారు. ఈ రుగ్మత నుంచి బయట పడాలంటే.. ముందుగా దానికి గల మూలాలను గుర్తించాలంటున్నారు సైకాలజిస్టులు. మిమ్మల్ని మీరు మెచ్చుకోవడం, సంతృప్తిగా ఫీలవడం, మీపట్ల మీకు ప్రేమ, గౌరవం, కృతజ్ఞతా భావం వంటివి లేకపోవడం కూడా వర్క్‌లో అసంతృప్తికి, అనుమానానికి, ఆందోళనకు, అసమర్థ భావనకు దారితీస్తుంటాయి. అసలు లోపాన్ని గుర్తించి సెట్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం క్లియర్ అవుతుందంటున్నారు నిపుణలు. దీంతోపాటు మీరు గతంలో చేసిన మంచి పనులను, సాధించిన విజయాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ప్రతీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోండి. మీ పనిని మెరుగు పర్చుకోవడంపైనే ఫోకస్ చేస్తూ ఉండాలని, ఇతరుల వైపు నుంచి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పని విషయంలో మీకంటూ ఒక క్లారిటీ ఉంటే.. ఎవరు ఏం అనుకున్నా మీరు సక్సెస్ సాధిస్తారు. అసమర్థత భావాలకు కారణమయ్యే ఇంపోస్టర్ సిండ్రోమ్ నుంచి త్వరగా బయటపడతారు. పని.. జీవితం బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోగలుగుతారు.






