- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి ఆలోచనలతో నిద్రలేమి..! కామన్ రీజన్ ఇదే..
పైకి కనిపించదు కానీ.. ఆ ఒత్తిడి మనిషిని నిలువెల్లా దహించేస్తుంది. అర్ధరాత్రిళ్లు దాడిచేస్తూ నిద్రను దూరం చేస్తుంది.

దిశ, ఫీచర్స్ : పొద్దస్తమానం ఏ వర్క్‌లోనో బిజీ అయిపోతారు. కాబట్టి.. సమస్యలు, ప్రతికూల ఆలోచనలను ఏవున్నా మైండ్ నుంచి డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ రాత్రి పూట.. ముఖ్యంగా అర్ధరాత్రిపూట మీరు ఎంత కాదన్నా మీరు ఎదుర్కొనే అనుభవాల తాలూకు ఆలోచనలు వస్తుంటాయి. అవి మంచివో, మీలో ఆనందాన్ని కలిగించేవో అయితే పర్లేదు. కానీ తీవ్రమైన ఇబ్బందులో, ఆర్థిక పరిస్థితులో అయితే మాత్రం మిమ్మల్ని హెల్త్ పరంగా ప్రభావితం చేసే చాన్స్ ఉందంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. అలాంటివాటిలో ఆర్థికపరమైన ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. ఇవి తరచుగా అర్ధరాత్రి మీ తలపుల తలుపులను తడుతూ మేల్కొల్పుతాయని, ఒత్తిడికి గురిచేస్తాయని చెబుతున్నారు. ఇంకా ఏయే సమస్యలకు కారణం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పరిధి దాటితే అంతే..
ఒత్తిళ్లు అనేక రూపాలు.. ముఖ్యంగా మానసిక ఒత్తిడి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఆర్థిక ఒత్తిడి మాత్రం మరింత ప్రమాదకరమని ‘జర్నల్ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ (Journal of Consumer Affairs) నుంచి వచ్చిన ఒక అధ్యయనం పేర్కొన్నది. ఇది కేవలం ఆర్థిక స్థితిని మాత్రమే కాకుండా, నిద్రలేమి సమస్యను 2 రెట్లు పెంచుతుందని వెల్లడించింది. ఫైనాన్షియల్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి. అయితే అవి పరిష్కరించుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పుడు సమస్య కాదు. కానీ ఆ పరిధి దాటితేనే మనిషిని కృంగదీస్తాయి అంటున్నారు నిపుణులు.
కనిపించదు కానీ..
పైకి కనిపించదు కానీ.. ఆర్థిక ఒత్తిడి మనిషిని నిలువెల్లా దహించే అగ్ని వంటిది. తీర్చాల్సిన అప్పులు, కట్టాల్సిన బిల్లులు, కుటుంబ ఆర్థిక అవసరాలు వంటి ఆలోచనలు అర్ధరాత్రిళ్లు దాడిచేస్తూ నిద్రను దూరం చేస్తుంటాయి. ప్రతికూల ఆలోచనలను ప్రేరేపిస్తుంటాయి. ఇలాంటప్పుడే ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి బాధిత వ్యక్తి పోరాటం లేదా పలాయనం (Fight or flight) స్థితిలో ఉండిపోవడంవల్ల నిద్ర పట్టదు. ఇది కూడా తీవ్రమైన నిద్రలేమికి, తద్వారా ఇతర అనారోగ్యాలకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు పెద్దల్లోనే ఉండే ఆర్థిక ఒత్తిళ్లు ఇటీవలి కాలంలో యువతలోనూ పెరిగిపోతున్నాయి.
ఏం చేయాలి?
ఆర్థిక ఒత్తిళ్లు (Financial stress) కేవలం అధిక ఆదాయంలేకపోవడం వల్ల మాత్రమే తలెత్తుతాయని అనుకోవడానికి లేదు. ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల, తమ ఫైనాన్షియల్ స్టేటస్‌ను పరిగణనలోకి తీసుకోకుండా, అవసరాలను పట్టించుకోకుండా, ఇతరుల మాదిరి జీవించాలనే భ్రమ వల్ల, విచ్చల విడి ఖర్చువల్ల, ఖర్చు చేసిన తర్వాత తరచుగా బ్యాలెన్స్ చెక్ చేసి బాధపడే అలవాట్లవల్ల, క్రిడిట్ కార్డులను దుర్వినియోగం చేయడంవల్ల కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీ ఆర్థిక ఒత్తిడికి కారణమైన పరిస్థితులను, పరిశీలించి నివారించుకోవడమే చక్కటి పరిష్కారమని చెబుతున్నారు. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.






