స్నేహబంధాలు కనుమరుగు.. జెన్ Zలో పెరిగిపోతున్న ఆ ఫీలింగ్స్!

by Javid Pasha |

ఈ రోజుల్లో అంత నమ్మకమైన స్నేహాలు లేవని 80% మంది జెన్‌జీలు భావిస్తున్నారు.

స్నేహబంధాలు కనుమరుగు.. జెన్ Zలో పెరిగిపోతున్న ఆ ఫీలింగ్స్!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఫ్రెండ్‌షిప్ అంటే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. పరస్పర గౌరవం. సందర్భం ఏదైనా, సమస్య ఏమున్నా అవతలి వ్యక్తికి నా ఫ్రెండ్స్ ఉన్నారనే భరోసా.. ఉండేది. కానీ ఇప్పుడలాంటి స్నేహాలు చాలా అరుదని, చాలా వరకు కనుమరుగైపోతున్నాయని సోషల్ మీడియా వేదికల్లో పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యంగా జెన్ Zలో ఫ్రెండ్‌షిప్ వాల్యూస్ తగ్గుతున్నాయని చెబుతున్నారు? ఇది నిజమేనా? ఎందుకలా జరుగుతోంది? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సోషల్ మీడియా ప్రభావం?

కాలం తెచ్చిన మార్పులో, ఆధునిక పోకడలో కానీ.. సోషల్ మీడియా జీవితంలో భాగమైపోయాక నిజమైన స్నేహబంధాలు తగ్గుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీలి కొన్ని అధ్యయనాలు సైతం ఇదే పేర్కొంటున్నాయి. ముఖ్యంగా జెన్ Zలో (1997-2012 మధ్య జన్మించిన వారు) సాధారణ పరిచయాలు, సాధారణ స్నేహాలు తప్ప, పరస్పరం సహకరించుకోవడం, అన్ని సందర్భాల్లో ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం వంటివి ఉండట్లేదని, లోన్లీనెస్ పెరుగుదలకు ఇది కారణం అవుతున్నదని ‘హ్యూమన్ 8 రీసెర్చ్ 2025’ పేరుతో జెన్ Z స్నేహాలు, సోషల్ కనెక్షన్స్ గురించి నిర్వహించిన అధ్యయనం పేర్కొన్నది. హార్వర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదిక సైతం దీనిని ప్రస్తావించింది.

27% మందికి ఫ్రెండ్స్ లేరు!

అధ్యయన నివేదికల ప్రకారం.. 80% మంది జెన్‌జీలు ఈ రోజుల్లో అంత నమ్మకమైన స్నేహాలు లేవని, చాలా విషయాల్లో తమను తాము ఒంటరిగా భావిస్తున్నామని గత సంవత్సరంలో పేర్కొన్నారు. ఇక 27% మందికి కుటుంబం మినహా బయట క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. అయితే దీనికి ప్రధాన కారణం వీరు రోజుకు 7-10 గంటలు స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. తల్లిదండ్రుల తరం కంటే సంవత్సరానికి 1,000 గంటలు తక్కువ వ్యక్తిగతంగా (in-person) మనుషులతో కలిసి గడుపుతున్నారు. అంటే ఇది వ్యక్తిగత వైఫల్యం కాదు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా సామాజిక నిర్మాణంలో వచ్చిన మార్పుల వల్ల సృష్టించబడిన సమస్యగా నిపుణులు పేర్కొంటున్నారు.

21% జెన్ Zలో ప్రాబ్లం ఇదే..

ఉరుకులూ.. పరుగుల జీవితంలో ఒకప్పటిలా గాఢమైన స్నేహాలు ఏర్పడే పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. పట్టణీకరణ జీవితాల్లో పార్కులు, మాల్స్, క్లబ్స్, ఆర్కేడ్స్, లోకల్ హ్యాంగౌట్స్ వంటివి ఉంటున్నా తాత్కాలిక పరిచయాలకే పరిమితం అవుతున్నాయి. ఇక 2017-2022 మధ్య సంవత్సరానికి సగటున 1,170 షాపింగ్ మాల్స్ మూసివేయబడ్డాయి. దీంతో ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియా వల్ల భౌతిక సమావేశాలు తగ్గాయి. ఫలితంగా 21% జెన్ Z తాము కొత్త స్నేహాలు ఎలా ఎక్కడ చేసుకోవాలో తెలియడం లేదని చెబుతున్నారు.

నిశ్శబ్ద నిష్క్రమణ..

ఏది ఏమైనా ఈ సమస్య స్ట్రక్చరల్‌గా మారిపోయింది. అంటే.. స్నేహబంధాలు పుట్టుకొచ్చే సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిశ్శబ్దంగా కనుమరుగైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి ప్రత్యామ్నాయం ఎవరూ నిర్మించలేరేమో కూడా! ఎందుకంటే.. ఆన్‌లైన్ కనెక్షన్స్ నిజమైన స్నేహాలుగా మారడం కష్టమని, ఫలితంగా లోన్లీనెస్, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే సమాజంలో స్నేహాలను, ఆరోగ్య కరమైన మానవ సంబంధాలను పెంపొందించే ‘థర్డ్ ప్లేసెస్’ను క్రియేట్ చేయడం, ఆఫ్‌లైన్ ఇంటరాక్షన్స్‌ను ప్రోత్సహించడం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story