యుక్త వయసులో మానసిక కల్లోలం.. యువతలో పెరిగిపోతున్న ఆ సమస్యలు..!

by Javid Pasha |

యుక్త వయసులో మానసిక కల్లోలం.. యువతలో పెరిగిపోతున్న ఆ సమస్యలు..!

యుక్త వయసులో మానసిక కల్లోలం.. యువతలో పెరిగిపోతున్న ఆ సమస్యలు..!
X

దిశ ఫీచర్స్ : ఒకప్పుడు మనసును ప్రభావితం చేసే సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు పెద్దలకు మాత్రమే ఉంటాయనుకునే వాళ్లం. కానీ ఇప్పుడలా కాదు. చాలామందిలో యుక్త వయసులోనే అవి ప్రారంభం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మారిన సామాజిక పరిస్థితులు, స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావడం, ఒత్తిడితో కూడిన చదువులు, పోటీ ప్రపంచంలో ముందుండాలనే ఆలోచనలు, టీనేజ్‌లో జరిగే శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావం వంటివన్నీ కలిసి ప్రస్తుతం 13 నుంచి 24 ఏండ్లలోపు యువతను కలవర పెట్టేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఒకప్పుడు టీనేజ్ కూడా బాల్యం లెక్కనే సరదాగా గడిచిపోయేది. కానీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ అందరికీ అందుబాటులోకి రావడం, సోషల్ మీడియా స్క్రోలింగ్, నాలెడ్జ్ షేరింగ్ పెరిగిపోవడం వంటి పరిస్థితులు యుక్త వయసు పిల్లల్లో రోజువారీ అలవాట్లను, ఆలోచనలను మార్చేస్తున్నాయి. ఒకప్పటిలా కేవలం చదువు, కుటుంబం, ఆరు బయట ఆటల్లో నిమగ్నమయ్యే పరిస్థితులు పోయాయి. ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోవడం సోషల్ మీడియాలో రకరకాల కంటెంట్ చూసి అడిక్ట్ అవ్వడం వంటివి ఆధునిక యువత ఆలోచనలను మారుస్తున్నాయి. కొందరిలో ప్రతికూల ఆలోచనలకు, ఒత్తిడి ఆందోళనలకు కారణం అవుతున్నాయి.

మూడింట ఒకవంతు అదే సమస్య

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిపుణుల ప్రకారం..13 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకుల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది యాంగ్జైటీ డిజార్డర్‌ను ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వడం, హార్మోన్ల ప్రభావం, అపోజిట్ సెక్స్ పట్ల అధిక ఆకర్షణతో కూడిన అతి ఆలోచనలు యువతలో మానసిక కల్లోలానికి దారితీస్తున్నాయి. దీంతో చదువుపై, ఇతర విషయాలపై ఏకాగ్రతను కోల్పోతున్నారు. ఇదంతా ఒకప్పుడు కూడా ఉండేది కానీ, మరీ ఇంతలా, యువత దారితప్పేంతలా ఉండేది కాదని, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వంటివి వచ్చాక ఈ పరిస్థితి పెరిగిపోయిందని నిపుణులు అంటున్నారు. సాంకేతికతను దుర్వినియోగం చేయడం లేదా అతిగా వాడటం, అవగాహనా రాహిత్యంతో వాడటం, తప్పుగా అర్థం చేసుకోవడం వంటివి యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలను పెంచుతున్నాయని చెబుతున్నారు. అందుకే ఫోన్లు, సోషల్ మీడియాను లిమిట్‌గా వాడటం, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్‌ను మేనేజ్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. వీటితోపాటు ఆహారపు అలవాట్లలో, జీవన శైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకున్నప్పుడు యుక్త వయసు ఆందోళనల నుంచి బయటపడే చాన్స్ ఉంటుంది.

పరిష్కారం ఏమిటి?

ఆందోళనను రేకెత్తిచే కార్యకలాపాలకు, అతి ఆలోచనలకు, ఒత్తిడికి గురిచేసే పరిస్థితులకు, సోషల్ మీడియా కంటెంట్‌కు యువత దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం అది పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఞానం, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగని యువత ఒకేసారి ఎక్కువ ఛాలెంజింగ్ విషయాల జోలికి వెళ్లవద్దు. మీ కాన్ఫిడెన్స్‌నుపెంపొందించుకోవడానికి, సాధించగల గోల్స్ ఏర్పర్చుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇలా యాంగ్జైటీ - ప్రేరేపిత పరిస్థితులకు ఎదురీదడమనేది నేటి యువతకు మానసిక కల్లోలాన్ని, భవిష్యత్తులో ఎదురయ్యే ఆందోళనకర పరిస్థితులను మేనేజ్ చేయడానికి, వాటిని దీటుగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. దీంతోపాటు ఆనందం కలిగించే ఆరోగ్యకరమైన కార్యకలాపాలలో పాల్గొనడం, ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవ్వడం, ఇష్టమైన సంగీతం వినడం, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం, సామాజిక పరస్పర చర్యలు వంటివి కూడా యుక్త వయసులో పెరుగుతున్న స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్‌ను తగ్గిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Next Story