Lithium Mining తో పర్యావరణానికి నష్టం : నిపుణులు

by Disha Web Desk 6 |
Lithium Mining తో పర్యావరణానికి నష్టం : నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : పెట్రోల్, డీజిల్ ఇంధనాల ద్వారా నడుస్తున్న వాహనాల కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ డిమాండ్ పెరిగిపోతుంది. దీంతో ఎన్విరాన్మెంట్‌కు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నిపుణుల అభిప్రాయం. కానీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వెనుకున్న చీకటి కోణం.. అంతకు మించిన ముప్పును కలిగిస్తుందని హెచ్చరిస్తున్నాడు ఓ ఏరియల్ ఫొటోగ్రాఫర్. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉపయోగించే లిథియం నిల్వలు తవ్వడం ద్వారా ప్రకృతికి దారుణమైన నష్టం వాటిల్లుతుందని, ఇందుకు సాక్ష్యంగా హెచ్‌డీ ఫొటో సిరీస్‌ను రిలీజ్ చేశాడు. దీంతో లిథియం మైనింగ్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోగా.. అసలు ఏ విధంగా నష్టం కలుగుతుంది? ఇంతకీ లిథియం హాట్ స్పాట్స్ ఎక్కడున్నాయి? లిథియంపై ప్రపంచ దేశాల ఆధిపత్య పోరు తప్పదా? తెలుసుకుందాం.

జర్మన్ ఏరియల్ ఫోటోగ్రాఫర్ టామ్ హెగెన్ దక్షిణ అమెరికాలోని లిథియం వెలికితీత క్షేత్రాలను అద్భుతమైన హై డెఫినిషన్‌లో క్యాప్చర్ చేశాడు. ఫొటోలు చూడటానికి అమేజింగ్‌గా ఉన్నప్పటికీ.. ఈ ఫొటోల వెనుకున్న చీకటి కోణం గురించి ఆలోచిస్తే మాత్రం వెన్నులో వణుకుపుడుతుంది అంటున్నారు ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు. సహజ నిక్షేపాలతో సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతం చిలీ, అర్జెంటీనా, బొలీవియా సరిహద్దులు కలిసే చోట ఉండగా.. ఉత్తర చిలీలోని సలార్ డి అటకామా సాల్ట్ ఫ్లాట్లలో దాదాపు నాలుగింట ఒక వంతు నిల్వ చేయబడుతుంది. భూమిపై తేలికైన లోహంగా పరిగణించబడే లిథియం.. మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, కార్లు, విమానాలు ఇలా దాదాపు అన్ని ఎలక్ట్రిక్ పరికరాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాలకు శక్తినందించేందుకు ప్రసిద్ధి చెందిన లిథియం-అయాన్ బ్యాటరీల డిమాండ్ ఆటోమేటిక్‌గా పెరిగిపోగా.. లిథియం ఎక్స్‌ట్రాక్షన్ కోసం చేపడుతున్న తవ్వకాలు పర్యావరణానికి హానికరంగా మారాయి.

లిథియం వెలికితీత పర్యావరణానికి హానికరమా?

ఏ రకమైన వనరుల వెలికితీత అయినా గ్రహానికి హానికరమే. ఈ ముడి పదార్థాలను తొలగించడం వల్ల నేల క్షీణత, నీటి కొరత, జీవవైవిధ్య నష్టం, పర్యావరణ వ్యవస్థ పనితీరు దెబ్బతినడం, గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతుంది. అలాగే తదుపరి చమురుగా పరిగణించబడుతున్న పునరుత్పాదక ఖనిజం లిథియం వెలికితీత తప్పనిసరిగా భూమి, గాలి కలుషితానికి కారణమవుతుంది. నీటి ప్రాప్యతను దెబ్బతీస్తూ.. స్థానిక కమ్యూనిటీలపై అధిక ప్రభావం చూపుతుంది.

ఇక లిథియం లభించే దక్షిణ అమెరికాలోని సాల్ట్ ఫ్లాట్స్ శుష్క ప్రాంతాలలో ఉండగా.. స్థానికుల జీవనోపాధి, వృక్ష మరియు జంతుజాలానికి నీటి ప్రాప్యత కీలకంగా మారనుంది. అలాగే చిలీలోని అటాకామా సాల్ట్ ఫ్లాట్స్‌లో లిథియం మైనింగ్.. స్థానిక కమ్యూనిటీల నుంచి అరుదైన నీటి వనరులను మళ్లిస్తుంది. బాష్పీభవన చెరువుల ద్వారా లిథియం ఉత్పత్తి దాదాపు రోజుకు సుమారు 21 మిలియన్ లీటర్ల నీటిని వినియోగిస్తుంది. అంటే ఒక టన్ను లిథియం ఉత్పత్తి చేయడానికి దాదాపు 2.2 మిలియన్ లీటర్ల నీరు అవసరం. అంతేకాదు లిథియం వెలికితీత చిలీకి ఉత్తరాన ఉన్న టోకోనావో కమ్యూనిటీలో నీటి-సంబంధిత వివాదాలకు కారణమైంది.

ప్రపంచ వ్యాప్తంగా లిథియం హాట్‌స్పాట్స్ :

లిథియంపై పెరుగుతున్న ఆసక్తి ప్రపంచంలోని అతిపెద్ద నిల్వలను గుర్తించడంలో కీలకమైంది. US జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ టన్నుల నిల్వలు గుర్తించబడ్డాయి. దక్షిణ అమెరికా తర్వాత అతిపెద్ద లిథియం-ఉత్పత్తి దేశాలుగా యునైటెడ్ స్టేట్స్ పరిగణించబడుతుండగా.. ఆస్ట్రేలియా, చైనా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక కొద్ది మొత్తంలో లిథియం నిల్వలున్న దేశాలుగా జింబాబ్వే, బ్రెజిల్, పోర్చుగల్ గుర్తించబడ్డాయి.

కాగా లిథియం మైనింగ్ ఇటీవల పోర్చుగల్‌లో వివాదాస్పదంగా మారింది. ఈ అరుదైన లోహం మైనింగ్ ఆపేందుకు పోర్చుగీస్ నివాసితులు నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. వెలికితీత వల్ల స్థానికులకు దాదాపు 800 ఉద్యోగాలు లభిస్తాయని మైనింగ్ కంపెనీ వాగ్దానం చేసినప్పటికీ, స్థానిక జనాభాలో 95 శాతం మంది దీన్ని తిరస్కరించారు. మొత్తానికి బంగారం, చమురుపై చారిత్రక యుద్ధాలు జరిగినట్లుగానే.. ప్రభుత్వాలు లిథియం ఖనిజాలపై ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. ఇది రాబోయే దశాబ్దాలపాటు ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది.


Also Read: ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించిన 'చుకుడు'.. బ‌తుకుల్ని బెట‌ర్ చేసిన బండి! (వీడియో)

Next Story

Most Viewed