అన్న కావాలి.. చెల్లి రావాలి.. ప్రేమానుబంధాల గ్రేట్ ఫెస్టివల్ రక్షాబంధన్..

by Javid Pasha |   (  Updated:2025-08-08 06:30:26  IST  )

ప్రతీ చెల్లి గుండెలో, అన్న మనసులో పదిలంగా అల్లుకుపోయిన ప్రేమానురాగాల సంబురమే మన రాఖీ పండుగ. ఇదొక సంప్రదాయ పండుగగా పేర్కొంటారు. అయితే ఇప్పుడది కేవలం కొందరు మాత్రమే జరుపుకునే సాంప్రదాయమనే పరిధిని దాటింది. కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ అన్నపై, చెల్లిపై ప్రేమను, అనుబంధాన్ని ప్రకటిస్తూ జరుపుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం.

అన్న కావాలి.. చెల్లి రావాలి.. ప్రేమానుబంధాల గ్రేట్ ఫెస్టివల్ రక్షాబంధన్..
X

దిశ, ఫీచర్స్ : ‘‘ఉరుకులూ పరుగుల జీవితంలో.. బతుకు దెరువు ఆరాటంలో.. ఏడ తానున్నాడో అన్న.. ఏ ఊరిలో ఉంటేనేం.. ఏ సిటీలో ఉంటేనేం.. ఏడాదికోసారి పోయి రాఖీ కట్టి రావాల్సిందే.. నా కోసం నా అన్న ఎంత చేయలేదు. నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడో.. ఎంతైనా అన్న అన్నే’’ రక్షా బంధన్ నేపథ్యంలో ప్రతీ చెల్లి మనసును తట్టిలేపుతున్న జ్ఞాపకాలివి. ‘‘తీరిక లేని జీవితాలు.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఎక్కడుంటేనేం.. రాఖీ పండుగకి మాత్రం మా చెల్లి తప్పక వస్తుంది.. అన్నంటే అంత ప్రేమ.. మొండి పిల్ల.. అత్త, భర్త వద్దన్నా వినదు అన్నకోసం పట్టు బట్టి వస్తుంది..’’ ప్రతీ అన్న గర్వంగా చెప్పుకునే మాటలివి. నిజమే కదూ.. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్‌లో ఏదో విడదీయలేని ఫీల్ ఉంది బ్రో..! -

ప్రతీ చెల్లి గుండెలో, అన్న మనసులో పదిలంగా అల్లుకుపోయిన ప్రేమానురాగాల సంబురమే మన రాఖీ పండుగ. ఇదొక సాంప్రదాయ పండుగగా పేర్కొంటారు. అయితే ఇప్పుడది కేవలం కొందరు మాత్రమే జరుపుకునే సాంప్రదాయమనే పరిధిని దాటింది. కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ అన్నపై, చెల్లిపై ప్రేమను, అనుబంధాన్ని ప్రకటిస్తూ జరుపుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అసలు ఉద్దేశం అన్నా చెల్లెళ్ల అనుబంధమే. అందుకే ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అన్నకోసం వచ్చి రాఖీ కడుతుంది చెల్లి. అన్ని పనులూ, ప్రయాణాలు, ఆఫీసులూ మానుకొని చెల్లి కోసం ఎదురు చూస్తుంటాడు అన్న. అదే రాఖీ పండుగ అసలు ఉద్దేశం అంటారు పెద్దలు. అన్నా చెల్లెళ్ల ప్రేమాను బంధాలు జీవితాంతం కొనసాగాలి. పరస్పర ప్రేమతో, పరస్పర గౌరవంతో అన్నా చెల్లెళ్లు కలకాలం సంతోషంగా వర్ధిల్లాలి.

సాంప్రదాయం, ఆచారం ప్రకారం చూసినా రాఖీ పండుగకు గొప్ప విశిష్టతే ఉంది. ఇక్కడ అన్న తన చెల్లికి రక్షణగా, మార్గదర్శిగా ఉంటాడు. అదే సమయంలో చెల్లెలు తన అన్నపై అపారమైన ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటుంది. రక్షా బంధన్ రోజు.. చెల్లెలు అన్న కోసం ప్రార్థనలు చేస్తూ రాఖీ కడుతుంది. అన్న తన చెల్లి శ్రేయస్సుకోసం హామీ ఇస్తాడు. నాకంటూ ఒక అన్న ఉన్నాడనే ఆలోచన చెల్లిలో గొప్ప ధైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని నింపుతుంది. ఆపదల వేళ అన్న అండగా ఉంటాడన్న భరోసా ఆమెను జీవితాంతం నడిపిస్తుంది. అన్న కూడా అంతే.. ఏమీ తోచనప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోలేని విషయాలు కూడా చెప్పుకునే నమ్మకమైన వ్యక్తి ఎవరా అని చూసినప్పుడు అన్నకు ఠక్కున గుర్తొచ్చేది తన చెల్లినే. బుజ్జీ.. ఇది రా సంగతి అంటూ మనసులోని మాటలను చెప్పుకొని బోరు మంటాడు అన్న. ఎంతైనా చెల్లి కదా మరి!

రక్షా బంధన్ అనేది సాంప్రదాయం లేదా ఆచారం ప్రకారం చూస్తే.. హిందూ సంస్కృతిలో లోతైన చారిత్రక, పౌరాణిక నేపథ్యం కలిగి ఉన్న పండుగ. చరిత్రలో.. రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమాయున్‌కు రాఖీ పంపి రక్షణ కోరిన సంఘటన, అలాగే మహాభారతంలో ద్రౌపది కృష్ణునికి కట్టిన రాఖీ కథ వంటివి ఈ పండుగ, సాంప్రదాయం, ఆచారాలకు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ కేవలం కుటుంబ బంధాలనే కాకుండా, సామాజిక ఐక్యతను కూడా ప్రోత్సహిస్తుంది. అన్న చెల్లెళ్ల మధ్య ప్రేమను మరింత బలోపేతం చేస్తుంది. అందుకే.. అన్న కావాలని ప్రతీ చెల్లి కోరుకునే సమయం.. చెల్లి రావాలని ప్రతీ అన్న ఎదురు చూసే సందర్భం కూడా ఈ రాఖీ పండుగ. హ్యాపీ రక్షా బంధన్.. బ్రో అండ్ సిస్టర్స్..!

Next Story