- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్: ఆషాఢం రాగానే ఆడవాళ్ల చేతులన్నీ మైదాకుతో కలర్‌ఫుల్‌గా మారతాయి. మునివేళ్లకో డిజైన్, అరచేతికో డిజైన్, అంచులకో డిజైన్ మైదాకు పెట్టుకొని మురిసిపోతుంటారు. ఇప్పుడంటే కోన్లు వచ్చి అరగంటలో అయిపోతుందిగానీ, ఒకప్పుడు మైదాకంటే మూడ్రోజుల కథ.
ప్రతీ డిజైనొక జ్ఞాపకం..
ఆషాఢంలో మైదాకు మధురానుభూతులు మామూలుగా ఉండవు. కానీ ఒకప్పటి మైదాకు సంతోషాలకు, ఇప్పటి గోరింటాకు సంప్రదాయాలకు చాలా తేడా ఉంది. ఇప్పుడిది కొత్త రూపం సంతరించుకుంది. రెడీమేడ్ కోన్స్, రకరకాల డిజైన్స్ వచ్చాయి. ఇంకా వాటిని అలంకరించడానికి స్పెషల్ డిజైనర్లు కూడా ఉంటున్నారు. వివాహాల్లో మెహెందీ వేడుకలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. గోరింటాకు సంప్రదాయం గ్రామీణ సౌందర్యాన్ని, సామాజిక బంధాలను, ఆధ్యాత్మిక భావనలను, ఆరోగ్య విలువలను కలిగి ఉంది. ప్రతీ డిజైన్‌కొక నేపథ్యం, జ్ఞాపకం ఉంటాయి.
మైదాకు మహా ప్రియం..
ఒకప్పుడు మైదాకు పెట్టుకోవడమంటే పెద్ద తతంగం. ఇప్పటిలా అర్ధగంటలో అయ్యే పనికాదు. ముఖ్యంగా మైదాకు చెట్లు ఇండ్లలో కంటే వ్యవసాయ బావుల దగ్గరే ఎక్కువగా ఉండేవి. ఆషాఢం మాసం వచ్చేసరికి మైదాకు చెట్టు ఆకులతో వీరబోసుకున్నట్లు కనిపించేది. స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రంపూట అమ్మాయిలు ఆ చెట్లను వెతుక్కుంటూ వెళ్లేవాళ్లు. కొందరేమో తమ్ముడికో, అన్నకో చెప్పి మైదాకు తెంపుకురమ్మని చెప్తుండె. తల్లిదండ్రులు కూడా పనులు ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో పిల్లలకు మైదాకు తెంపుకెళ్లేవాళ్లు.
రోట్లో వేసి దంచేది..
మైదాకు చెట్టున్నవాళ్లు ఎవరూ రాకుండా దాని దగ్గరే కావలి ఉండేవాళ్లు. ఇంకా కొందరైతే ఎవరూ తెంపుకపోవద్దని చుట్టూ కంప వేస్తుండె. కానీ అందరూ అలా ఉండరు కదా.? మైదాకు చెట్టున్నొళ్లు కొందరు తెంపి వాళ్లకింత, వీళ్లకింత పంపిస్తుండె. అదికూడా రెండు మూడు రోజుల ముందుగానే. దానికి ఏవేవో కలిపి మిశ్రమాన్ని చేసేవాళ్లు. ఇప్పుడవన్నీ తలుచుకంటే గమ్మతనిపిస్తుంది. అప్పట్లో ఆడవాళ్లు తమలపాకు నమిలేది కదా.? వాళ్ల దగ్గరికి వెళ్లి కాసు, సున్నం అడుక్కునేది. కొంత ఊరవిష్కె రెట్ట తీసుకునేది. దీన్నంతా రోట్లో వేసి దంచి మిశ్రమంగా చేసేది.
ఎర్రటి మైదాకును చూసి..
రాత్రి పడుకునేటప్పుడు మైదాకు పెట్టుకొని, అది ఊడిపోకుండా బట్టలు చుట్టుకునేది. నెత్తికింద చెయ్యి పెట్టుకునే అలవాటున్నొళ్లకయితే ఎప్పుుడు తెల్లారుతుందిరా దేవుడా అనిపించేది. అటూ మర్లీ, ఇటు మర్లీ తెల్లారంగనే మొఖం కంటే ముందు మైదాకు చేతులను కడుక్కొని మురిసిపోయేది. కొందరు కాళ్లకు కూడా పెట్టుకుంటుండె. అప్పుడివన్నీ తెలియవుగానీ గోరింటాకు పెట్టుకోవడం మన సంస్కృతిలో భాగం. దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక నేపథ్యం కూడా ఉందని అంటున్నారు. మైదాకు ఎవరికి ఎక్కువ పండితే వాళ్లకు అంత మంచి మొగుడొస్తడని పెండ్లికాని ఆడపిల్లలను ఆటపట్టించేవాళ్లు.






