- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పౌతి’ అంటే.. ‘విరాసత్’తో వారసత్వపు ఆస్తి దక్కుతుందా?
తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిని ఎలా మన పేరున మార్చుకోవాలి? దీనికి ఎలాంటి పేరు వాడుతారు? పిల్లలందరికీ సమాన హక్కు ఉంటుందా? కూతుళ్లు కూడా రాయించుకోవచ్చా?

దిశ, తెలంగాణ బ్యూరో: మా తండ్రి మరణించారు. ఆయన పేరిట పది ఎకరాల భూమి ఉంది. వారసులుగా అమ్మ, నేను, మా అన్న, తమ్ముడు, అక్క ఉన్నాం. మేం పాసు పుస్తకాలు ఎలా పొందాలి? మా పేరిట మార్చమని తహశీల్దార్ కార్యాలయంలో అడిగితే పౌతి చేయించుకోండని అన్నారు. తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తిని వారసుల పేరిట ఎలా చేసుకోవాలి? మిగతా ఇల్లు, ప్లాట్లను ఎలా మార్చుకోవాలి? రెవెన్యూ పరిభాషలో తల్లిదండ్రుల ఆస్తిని మార్చుకునేందుకు వాడే పదమే ‘పౌతి’. కొన్ని చోట్ల ‘విరాసత్’ అని కూడా అంటారు. ‘విరాసత్’ అంటే వారసత్వపు ఆస్తి. రెండు పదాలు దాదాపు సమానమే. ఈ రెండింటిని తెలంగాణలో ఎక్కువగా వాడుతారు. ఇవి ఉర్దూ పదాలు. సక్సెషన్ అని ఇంగ్లిషులో అంటారు. ఈ రెండు పద్ధతుల ద్వారానే ఆస్తికి వారసులు హక్కు పత్రాలను పొందడానికి వీలవుతుంది.
పౌతి అంటే మరణం
రెవెన్యూ భాషలో ‘పౌతి’ అంటే మరణం. భూ యజమాని చనిపోయిన తర్వాత రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమిని చట్టబద్ధమైన వారసుల పేరు మీదకు బదిలీ చేసే చట్టపరమైన ప్రక్రియనే ‘పౌతి మార్పు (Mutation by Succession)’ అంటారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో తల్లికి, కొడుకులకు, కూతుర్లకు సమాన హక్కు ఉంటుంది. భూమి హక్కు పొందే పద్ధతుల్లో సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టిషన్ డీడ్ ఉంటాయి. వీటన్నింటిలో డబ్బులు చెల్లించినట్లుగా నమోదవుతుంది. ‘పౌతి’లో మాత్రం అలాంటిది ఉండదు. కేవలం వారసులు వీరేనని రిమార్కుల కాలమ్‌లో నమోదు చేసి హక్కుదారులుగా నమోదు చేస్తారు.
పాసు పుస్తకాలు ఎలా పొందాలి?
ఆస్తి బదలాయింపు విడివిడిగా చేసుకోవచ్చు. లేదంటే వారసులందరూ కలిసి జాయింట్ పట్టాదారు పుస్తకం కూడా పొందొచ్చు. అంటే తల్లి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉంటే ఐదుగురు వారసులు. పది ఎకరాలను అందరి పేర్లతో కలిపి ఉమ్మడిగా అంటే జాయింట్‌గా పట్టాదారు పాసు పుస్తకం పొందే వీలుంది. అయితే అందరూ అంగీకారానికి వస్తే సాధ్యం. లేదంటే రెండెకరాల వంతున ఐదుగురు విడివిడిగానూ చేసుకోవచ్చు. భూమిని పంచుకోకుండా విడివిడిగా చేసుకోవడం వల్ల హద్దులు సరిగ్గా ఉండడం లేదు. ఎవరు ఎటు వైపు భూమిని తీసుకుంటారన్నది క్లారిటీ లేకుండానే పంపకాలు పూర్తవుతున్నాయి. ఇది భవిష్యత్తులో వివాదాలకు దారి తీస్తుంది. అంటే రికార్డుల్లో ఒక భూమి ఉంటే, పంపకాల ద్వారా అనుభవించేది మరో భూమిగా ఉంటుంది. ఇది క్రమేణా వివాదాస్పదం అవుతుంది. అందుకే ఎవరు ఎటు వైపు, ఏయే సర్వే నంబర్లు అనేది పక్కాగా తెలుసుకున్న తర్వాతే పౌతి చేయించుకోవడం మంచిది.
అమ్మ కూడా వారసురాలే..
తండ్రి చనిపోతే తల్లి కూడా వారసురాలే. ఆమెకు కూడా హక్కు ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో కొడుకులు, కూతుర్లు తమ పేరిట కాకుండా తల్లి పేరిటే ఆస్తిని రాయిస్తున్నారు. తమ వాటాపై హక్కును వదులుకుంటూ తల్లి పేరిట రాయమని లిఖితపూర్వకంగా రాసిస్తున్నారు. నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ లాంటిది లేదా హక్కు విడుదల పత్రం(Relinquishment Deed) ఇస్తే మొత్తం 10 ఎకరాలు తల్లి పేరిట రాస్తారు. ఆమె పేరిటే పట్టాదారు పాసు పుస్తకం పొందొచ్చు.
దరఖాస్తు చేయాలి?
తండ్రి మరణ ధృవీకరణ పత్రం (Death Certificate), కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం (Family Member Certificate), పాత పాసు పుస్తకం, అందరి ఆధార్ కార్డు కాపీలను జత చేసి సమీపంలోని గ్రామ సచివాలయం, మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలోనైతే అంతా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. డెత్ సర్టిఫికేట్, వారసులెవరెవరు అనేది పేర్కొంటే సరిపోతుంది. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విచారణ చేసి హక్కుదారులు వీరేనా? ఇంకెవరైనా ఉన్నారా? అనేది తెలుసుకొని రిపోర్ట్ ఇస్తారు. దరఖాస్తుకు, రిపోర్టుకు ఎలాంటి తేడా లేకపోతే వెంటనే పౌతి చేస్తారు.
గ్రామాల్లో చెల్లెండ్ల చిచ్చు
పౌతి అంటే వారసులందరిని పరిగణనలోకి తీసుకుంటారు. పెళ్లయి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లకు ఆస్తిని ఇవ్వకుండానే సోదరుల పేరిటే మార్చుకోవడం సహజంగా జరిగింది. ఐతే ఈ మధ్య బిడ్డలకు కూడా కొడుకులతో సమానంగా వాటా వస్తుందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దాంతో తమకు తెలియకుండానే పౌతి చేయించుకున్నారని, అమ్మేశారని కేసులు వేస్తున్న సంఘటనలు తీవ్రమయ్యాయి. చర్చల ద్వారా లేదా సామరస్యపూర్వకంగా తేల్చుకోవాల్సిన కుటుంబ తగదాను కోర్టుకెక్కిస్తుండడం వల్ల బంధాలు ప్రశ్నార్ధకమవుతున్నాయి. చట్టపరంగా తమకు వాటా ఉందని బిడ్డలు, తల్లిదండ్రులను తామే చూశామని, చూస్తున్నామని కొడుకులు వాదిస్తుండడం సహజం. ఇన్నాళ్లుగా తల్లిదండ్రుల బాగోగులను తామే చూసుకుంటున్నప్పుడు, ఎప్పుడో పెళ్లయి వెళ్లిపోయిన బిడ్డలకు సమానంగా వాటా ఇవ్వడం ఏమిటన్న వాదనలు ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యులంతా ఒక్క దగ్గర కూర్చొని ఓ నిర్ణయానికి రావడమే మంచిదని న్యాయవాదులు సూచిస్తున్నారు. వాటాల కంటే బంధాలు కూడా ముఖ్యమేనన్న విషయాన్ని మర్చిపోవద్దని కొడుకులు, బిడ్డలకు సలహా ఇస్తున్నారు.






