- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టుదల ముందు ఓడిన వైకల్యం.. ఎందరికో స్ఫూర్తినిస్తున్న ఓ మహిళ సక్సెస్ జర్నీ..
జ్యోతి గడేరియా ఆసియా పారా-సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల C2 రోడ్ రేస్ అండ్ ఇండివిజ్యువల్ టైమ్ ట్రయల్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది.

దిశ, ఫీచర్స్ : అన్ని అవయవాలు బాగనే ఉన్నా.. లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలం అవుతుంటారు కొందరు. పరిస్థితులు అనుకూలించినా నిర్లక్ష్యం చేస్తుంటారు మరికొందరు. అవకాశాలు ఎదురు చూసినా సద్వినియోగం చేసుకోలేకపోతుంటారు ఇంకొందరు. కానీ అందరూ అట్లనే ఉండరు కదా.. ప్రతికూల పరిస్థితులకు సైతం ఎదురీదే ధైర్యాన్ని ప్రదర్శించేవారు సైతం కొందరుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే ఇండియన్ పారా సైక్లిస్ట్ రాధేశ్యామ్ జ్యోతి గడేరియా.. వికలాంగురాలైనప్పటకీ.. తను పడిన బాధనే బలంగా మార్చుకుని, పారా సైక్లిస్ట్‌గా సక్సెస్ సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచి, ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
బాధను బలంగా మల్చుకుని..
జ్యోతి గడేరియా(Jyoti Radheshyam Gaderiya) ఇప్పుడు ప్రపంచం మెచ్చిన ప్రముఖ ఇండియన్ పారా సైక్లిస్ట్. 1998లో మహారాష్ట్రలోని దొంగర్గావ్ (Dongargaon)లో జన్మించిన ఆమె, 2016లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో కాలిని కోల్పోయింది. అయినప్పటికీ.. ఆమె ఈ బాధను బలంగా మల్చుకుంది. పారా-సైక్లింగ్ రంగంలో అడుగు పెట్టి అసాధారణ విజయాలు సాధించింది. మహిళల C2 కేటగిరీలో పోటీపడుతూ.. భారతదేశానికి చెందిన మొదటి పారా-సైక్లిస్ట్‌గా 2024 పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొన్నది. పారా-సైక్లిస్టులు అంటే శారీరక లోపం (డిసేబిలిటీ) ఉన్నవారు సైకిల్ రేసుల్లో పాల్గొనే క్రీడాకారులు అన్న విషయం తెలిసిందే. వీరు పారాలింపిక్స్ లేదా పారా-ఛాంపియన్‌షిప్‌లలో C1 నుండి C5 వరకు కేటగిరీల్లో పోటీపడతారు.
కుటుంబ నేపథ్యం
జ్యోతి గడేరియా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టింది. మహారాష్ట్రలోని దొంగర్గావ్‌కు చెందిన ఆమె కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంది. తల్లిదండ్రులు రైతులు, ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, సాధారణ జీవన పరిస్థితుల నడుమ ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నది. అయినప్పటికీ క్రీడల మీద మక్కువతో చదువుకునే రోజుల్లో చిన్నప్పటి నుంచే కబడ్డీలో మంచి గుర్తింపు పొందింది. కాగా 2016 ప్రమాదం తర్వాత ఆమె జీవితం మారిపోయింది. ఈ ప్రమాదంలో కాలు విరిగిపోవడంతో ఆమె పారా-అథ్లెట్‌గా మారారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని అదిత్య మెహతా ఫౌండేషన్ (Aditya Mehta Foundation)లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ పారా-అథ్లెట్లకు స్పెషల్ ట్రైనింగ్, కౌన్సెలింగ్ ఇవ్వబడుతుంది. ఈ ఫౌండేషన్ ఆమెకు టెక్నికల్, మెంటల్ సపోర్ట్ అందిస్తోంది.
ప్రొఫెషన్, సాధించిన విజయాలు
*జ్యోతి గడేరియా ప్రొఫెషనల్ పారా-సైక్లిస్ట్. మహారాష్ట్రకు చెందిన ఆమె, మహిళల ఎలైట్ C2 కేటగిరీలో (Moderate disability category in para-cycling) పోటీపడుతుంది. 2016 ప్రమాదం తర్వాత కబడ్డీ నుండి సైక్లింగ్‌కు మారి, అదిత్య మెహతా ఫౌండేషన్‌లో ట్రైనింగ్ తీసుకుని ప్రొఫెషనల్ అథ్లెట్‌గా ఎదిగారు. ఆమె భారత పారా-సైక్లింగ్ ఫెడరేషన్‌కు చెందిన అథ్లెట్‌గా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతుంది. ఎంతో కృషి, పట్టుదల కలిగిన జ్యోతి అంచలంచెలుగా ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది.
*పారా-సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ : జ్యోతి గడేరియా పారా సైక్లింగ్‌లో జాతీయ స్థాయిలో పలు పతకాలు గెలుచుకుంది. అంతర్జాతీయంగా 2024 ఆసియా పారా-సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల C2 రోడ్ రేస్ అండ్ ఇండివిజ్యువల్ టైమ్ ట్రయల్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది.
*పారాలింపిక్స్ 2024: ఇండియా తరపున మొదటి పారా-సైక్లిస్ట్‌గా పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొన్నది. 2024, ఆగస్టు 29న విమెన్స్ 3000 మీటర్స్ ఇండివిజ్యువల్ పర్స్యూట్ C1-3లో 4:53.929 సెకన్ల సమయంతో 10వ స్థానం సాధించింది. (మెడల్ రౌండ్‌కు అర్హత పొందలేదు కానీ, భారత పారా-సైక్లింగ్‌కు ఇది గొప్ప మైలురాయి).
*ఇతర విజయాలు: 2024 రియో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న జ్యోతి గడేరియా అదిత్య మెహతా ఫౌండేషన్‌తో కలిసి, భారత పారా-సైక్లింగ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఒక సాధారణ రైతు కుటుంబం నుండి ప్రపంచ స్థాయి అథ్లెట్‌గా ఎదగడం, 2016 ప్రమాదంలో కాలిని కోల్పోయినా వెనుదిరగకుండా ముందుకు సాగడం ఆమె కృషి, పట్టుదల సంకల్ప బలానికి నిదర్శనమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా, ప్రేరణగా నిలుస్తోంది. అంగవైకల్యం ఉన్నా నిరాశ చెందకుండా, బాధపడుతూ కూర్చోకుండా ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో ప్రయత్నిస్తే అనుకున్నది సాధిస్తామనే సందేశం జ్యోతి గడేరియా సక్సెస్ జర్నీలో కనిపిస్తుంది.






