పటాన్‌చెరుకు పెరిగిన డిమాండ్.. పెట్టుబడులకు బెస్ట్ టైమ్

by Sujitha Rachapalli |

ఒకప్పుడు పట్టణాలు, గ్రామాల కలయికతో నెలవై ఉన్న పటాన్ చెరు నియోజకవర్గంలోని మేజర్ భాగం ఇప్పుడు నగరంలో అంతర్భాగమైంది. ఆ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది.

పటాన్‌చెరుకు పెరిగిన డిమాండ్.. పెట్టుబడులకు బెస్ట్ టైమ్
X

దిశ, పటాన్ చెరు : ఒకప్పుడు పట్టణాలు, గ్రామాల కలయికతో నెలవై ఉన్న పటాన్ చెరు నియోజకవర్గంలోని మేజర్ భాగం ఇప్పుడు నగరంలో అంతర్భాగమైంది. మహానగర పరిధి విస్తరించడంతో అమీన్‌పూర్, పటాన్‌ చెరు సర్కిళ్లతో పాటు డివిజన్ల సంఖ్య 9కి చేరింది. మున్సిపాలిటీ‌లుగా ఉన్న అమీన్‌పూర్, బొల్లారం, తెల్లాపూర్‌లు డివిజన్‌లుగా రూపాంతరం చెంది, పరిపాలనా పగ్గాలు జీహెచ్ఎంసీ మారాయి.

హైరైజ్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్లతోపాటు లగ్జరీ లైఫ్‌స్టైల్ విల్లాల‌కు కేరాఫ్‌గా ఉన్న అమీన్‌ పూర్, తెల్లాపూర్ ప్రాంతాలకు భవిష్యత్తు‌లో మరింత డిమాండ్ పెరగనుంది. గ్రేటర్‌లో విలీనంతో మౌలిక వసతుల కల్పన వేగవంతం కానుండడంతో ధరలు పెరగనున్నాయి. పటాన్‌ చెరు ప్రాంతంలో విస్తరించి ఉన్న ఔటర్ రింగ్‌ రోడ్డు‌లో తెల్లాపూర్, కొల్లూరు‌లో మాత్రమే బహుళ అంతస్థుల నిర్మాణాల జోరుగా కొనసాగుతుండగా.. పాటి, కర్ధనూర్, ముత్తంగి, పోచారం‌లో అనుకున్న స్థాయిలో నిర్మాణాలు మొదలు కాలేదు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాలన్నీ గ్రేటర్‌లో విలీనం కావడంతో అన్ని ఏరియాలు సమాంతరంగా ఎదగడానికి ఆస్కారం ఉంది.

పెట్టుబడులకు అనుకూల సమయం

హై‌రైజ్ అపార్ట్‌మెంట్లకు నెలవైన తెల్లాపూర్, నిర్మాణ రంగంలో జోరు మీదున్న అమీన్‌పూర్‌తో పాటు గ్రేటర్‌లో విలీనమైన రెండు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ఏరియాలు పెట్టుబడులకు అనుకూలమని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. నూతన డివిజన్‌గా ఏర్పడిన ముత్తంగి, పాటి, ఘనపూర్, కర్ధనూర్, పోచారం ప్రాంతాలతోపాటు బీరంగూడ డివిజన్‌లోని కిష్టారెడ్డి పేట, పటేల్ గూడ, వడకపల్లి ప్రాంతాలలో ఇన్వెస్ట్‌మెంట్లకు మంచి తరుణంగా అభివర్ణిస్తున్నారు. రాకపోకలకు ఔటర్ అనుసంధానంగా ఉండటం.. ఈ ప్రాంతం మహానగరంలో అంతర్భాగం కావడంతో నిర్మాణరంగ భవిష్యత్తు భేషుగ్గా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఔత్సాహికులైన కొనుగోలు దారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసే సమయంలో భూమి స్వరూపాన్ని నిర్ధారించుకోవడంతోపాటు సదరు సంస్థ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల అనుమతులను సరిచూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

పెరగనున్న సదుపాయాలు

గ్రేటర్‌లో విలీనం కావడంతో ఈ ప్రాంతంలో రోడ్లకు మహర్దశ పట్టనుంది. హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా ఉన్న రేడియల్ రోడ్ల నిర్మాణాలు కార్యరూపం దాల్చనున్నాయి. దీంతో రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. మౌలిక వసతులతోపాటు శాంతి భద్రతల పరిరక్షణ‌కు సైతం ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. గ్రేటర్‌లో విలీనమైన 9 డివిజన్లను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చి ఆర్సీపురం కేంద్రంగా ఏసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. పటాన్ చెరు, అమీన్‌పూర్‌తో పాటు బీడీఎల్ భానూర్‌లో కొన్ని గ్రామాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విలీనం కావడంతో శాంతి భద్రతలు మరింత కట్టుదిట్టం కానున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని పెట్టుబడులకు సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story