హైదరాబాద్‌లో 50 అంతస్థుల భవనాలకు క్రేజ్

by Sujitha Rachapalli |

హైదరాబాద్‌లో పెరిగిపోతున్న ఆకాశహర్మ్యాలు.. 40 నుండి 50 అంతస్థుల భవనాలకు క్రేజ్.. ధరలకు బ్రేక్ లేకుండానే కొనసాగింపు.. వార్షికంగా ఐదు నుంచి ఆరు శాతం పెరుగుదల

హైదరాబాద్‌లో  50 అంతస్థుల భవనాలకు క్రేజ్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: నగరంలో రియల్ ఎస్టేట్ రంగం సరికొత్త ప్రాజెక్టులతో.. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. తెల్లాపూర్, ప్రిస్టేజ్ సిటీ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట్, శంషాబాద్, తుక్కుగూడ తదితర ప్రాంతాలలో పేరుపొందిన నిర్మాణ సంస్థలు భారీ నివాస సముదాయాలను చేపడుతున్నాయి. కొంతకాలం పాటు మార్కెట్ కొంతమేర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ ఇటీవల పుంజుకున్నట్లు రియల్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఐటీ రంగంలో నియామకాలు తగ్గడం, లేఆఫ్స్ కారణంగా మధ్యతరగతి బడ్జెట్ ఇళ్ల విక్రయాల్లో కొంత మందగమనం కనిపిస్తోంది. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం 2026 మొదటి త్రైమాసికంలో రిజిస్ట్రేషన్లు కొంత తగ్గినప్పటికి తిరిగి పెరిగే అవకాశాలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఈ ఏడాదిలో రియల్ రంగంలో ఆశించిన క్రయ, విక్రయాలు లేనప్పటికీ ఆస్తుల విలువ మాత్రం వార్షికంగా సుమారు 5 నుండి 6 శాతం పెరుగుతూనే ఉండడం గమనార్హం. ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్‌లో కోటికి పైగా ఉండడంతో మార్కెట్ వాటా బలపడింది.

పెరుగుతున్న ఆకాశహర్మ్యాలు...

హైదరాబాద్‌ మహానగరంలో ప్రస్తుతం ఆకాశహర్మ్యాల సంస్కృతి విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో 40 నుండి 50 అంతస్తులకు పైగా ఉండే భవనాలు సర్వసాధారణం అయ్యాయి. రూ కోటి అంతకంటే ఎక్కువ ధర కలిగిన లగ్జరీ ఇళ్లకు డిమాండ్ స్థిరంగా ఉంది. ఓ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ 1.08 లక్షల కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఈ భవనాల్లో క్లబ్ హౌస్‌లు, ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్, జిమ్, రూఫ్ టాప్ గార్డెన్స్ వంటి ప్రపంచ స్థాయి వసతులు కల్పిస్తున్నారు.

తగ్గిన మద్య తరగతి ఇండ్ల విక్రయాలు...

దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్‌లో మద్య తరగతి ఇండ్లు సుమారు రూ. 50 లక్షల నుండి రూ. 80 లక్షల లోపు బడ్జెట్ ఉన్న వాటి అమ్మకాలు కొంతమేర తగ్గాయి. ఐటీ రంగంలో నియామకాలు తగ్గి ఉద్యోగ భద్రత లేకపోవడం కారణంగా వీటి అమ్మకాలు తగ్గడం అనిశ్చితికి కారణంగా మారింది. ఇదే సమయంలో నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం వల్ల అపార్ట్‌మెంట్ల ధరలు వార్షికంగా 5.7 శాతం మేర పెరిగాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కోకాపేట ప్రాంతాల్లో ధరలు పెరిగినా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మూసాపేటలో చదరపు అడుగు ధర రూ.9 వేలు ఉండగా బాచుపల్లిలో రూ. 6 నుండి రూ 7 వేల మద్య స్థిరంగా ఉంది. ప్రస్తుతం శంషాబాద్, తుక్కుగూడ వంటి దక్షిణ ప్రాంతాల్లో కూడా బహుళ అంతస్తుల ప్రాజెక్టులు వేగంగా వస్తున్నాయి. అక్కడ ధరలు పశ్చిమ ప్రాంతం కంటే కొంత తక్కువగా ఉన్నాయి. మొత్తం మీద నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలు మందగించినా పలు కారణాలతో ధరలు పెరగడం మాత్రం కొనసాగుతోంది.

Next Story