పీపీఈ వ్యర్థాలతో కాంక్రీట్.. 22శాతం పెరిగిన సామర్థ్యం!

by Disha Web Desk 22 |
పీపీఈ వ్యర్థాలతో కాంక్రీట్.. 22శాతం పెరిగిన సామర్థ్యం!
X

దిశ, ఫీచర్స్ : మరింత మన్నికైన కాంక్రీట్ రూపొందించేందుకు పరిశోధకుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మహమ్మారి కాలం నుంచి ఉత్పన్నమవుతున్న పీపీఈ కిట్స్ వ్యర్థాలతో పర్యావరణానికి హాని కలుగుతున్న నేపథ్యంలో.. ఈ సమస్యకు పరిష్కారంగా మెల్‌బోర్న్‌‌కు చెందిన రాయల్ మెల్‌బోర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (RMIT)కి చెందిన ఇంజనీర్లు ఆ వేస్టేజ్‌తో కొత్తరకమైన కాంక్రీట్‌ను తయారుచేశారు.

రిటైరైన టైర్లు, ఎండ్రకాయల షెల్స్, స్టీల్ స్లాగ్, మెడికల్ వేస్టేజ్, ప్లాస్టిక్ వంటివన్నీ కూడా వ్యర్థపదార్థాలే కానీ శాస్త్రవేత్తలు అలాంటి వాటితోనే ఓ ఉపయోగకరమైన ప్రొడక్ట్ తయారుచేస్తున్న విషయం తెలిసిందే. ఉదాహరణకు.. డిస్పోజబుల్ ఫేస్ మాస్క్‌ల‌ను ఉపయోగించి రోడ్ లేయర్‌కు అవసరమయ్యే బలమైన రీసైకిల్ కాంక్రీట్ కంకరను గతేడాది తయారుచేశారు. ఇదే సమయంలో ఆర్‌ఎమ్‌ఐ‌టీ శాస్త్రవేత్తల బృందం మహమ్మారి కాలం నాటి ఇతర వ్యర్థ ఉత్పత్తులపై పరిశోధనలు చేపట్టగా, ప్రతీ రోజు ప్రపంచవ్యాప్తంగా సగటున 54,000 టన్నుల PPE ఉత్పత్తవుతుండగా, ప్రతి నెలా ప్రపంచవ్యాప్తంగా 129 బిలియన్ల డిస్పోజబుల్ ఫేస్ మాస్క్‌లు రూపొందుతున్నాయి. ఆయా పదార్థాల వల్ల పర్యావరణం పాడవుతుండటంతో సమస్యను పరిష్కరించేందుకు కొత్త మార్గాన్ని అన్వేషించారు. 0.1 నుంచి 0.25% వరకు వివిధ సాంద్రతతో కూడిన గౌన్లు, హ్యాండ్ గ్లోవ్స్, ఫేస్ మాస్క్‌లను కాంక్రీటులో చేర్చగా.. ఇవన్నీ కూడా కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్‌ను 22% వరకు పెంచినట్లు గుర్తించారు. కాగా ఇందులో ఫేస్ మాస్క్‌లు17% వరకు మెరుగుపరిస్తే, గౌన్లు 15%, ఎలాస్టిసిటీ 12% పెంచడం విశేషం.

'మన వీధుల్లో డిస్పోజబుల్ మాస్క్‌ల వ్యర్థాలతో మెరుగైన ఉత్పత్తులను రూపొందించడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. నిజానికి మా పరిశోధన ప్రారంభ దశలో ఉంది. వాడి పారేసే PPE వ్యర్థాలను ల్యాండ్‌ఫిల్‌లో ఉంచకుండా సమర్థవంతమైన రీసైక్లింగ్ సిస్టమ్ అభివృద్ధికి ఈ సానుకూల ప్రారంభ ఫలితాలు ఒక ముఖ్యమైన అడుగు' - శాస్త్రవేత్త రాజీవ్ రాయ్‌చంద్


Next Story

Most Viewed