డిజిటల్ లేబర్ చౌక్.. కూలీలకూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం.!

by Daayi Srishailam |

అందరికీ ఉన్నప్పుడు లేబర్‌కు మాత్రం ఎందుకు ఉండొద్దని ఆలోచించాడు

డిజిటల్ లేబర్ చౌక్.. కూలీలకూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం.!
X

దిశ, ఫీచర్స్: అర్జెంటుగా మనకు స్పెషలిస్ట్ డాక్టర్ అవసరముంటుంది ఏం చేస్తాం.? ఆన్‌లైన్లో సెర్చ్ చేస్తాం. లింక్డిన్ లాంటి ప్లాట్‌ఫాంలో మనక్కావాల్సిన డాక్టర్, ఎక్స్ పీరియెన్స్‌తో పాటు సాధించిన విజయాలు, కస్టమర్ల రివ్యూస్, రేటింగ్, ఫీజు వివరాలు ఉంటాయి. ఒక్క వైద్య రంగంలోనే కాదు.. ఈ రోజుల్లో ఇలాంటి ఫెసిలిటీ దాదాపు అన్ని రంగాల్లో ఉంది. అందరికీ ఉన్నప్పుడు లేబర్‌కు మాత్రం ఎందుకు ఉండొద్దని ఆలోచించాడు బీహార్ యువకుడు చంద్రశేఖర్ మండల్.

లేబర్ కష్టాలు చూసి..

ఢిల్లీలో ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు చంద్రశేఖర్. రెండో అంతస్తులో కాఫీ తాగుతూ ఆస్వాదిస్తున్నాడు. ఆఫీస్ ఎదురుగా ఉన్న లేబర్ చౌక్‌లో వందల మంది కూలీలు వర్షం నుంచి తప్పించుకునేందుకు చెట్టు కిందికో, ఫుడ్‌స్టాల్ దగ్గరికో పరుగులు తీస్తున్నారు. పని దొరుకుతుందనే ఆశతో వచ్చి వర్షంలో తడుస్తూ ఎదురు చూస్తున్నారు. ఈ దృశ్యం చంద్రశేఖర్‌కు తన బాల్యాన్ని గుర్తు చేసింది. ఊర్లో తమ కుటుంబ సభ్యులు పని కోసం ఇలా కష్టపడటం చూశాడు. అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది అనుకున్నాడు. ప్రపంచమంతా డిజిటల్ అవుతుంటే లేబర్ చౌక్‌లను ఎందుకు డిజిటల్ చేయకూడదు? అని ఆలోచించాడు.

బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఉండొద్దా.?

అది లాక్‌డౌన్ సమయం. వలస కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు, వేల కిలోమీటర్లు నడిచి సొంతూర్లకు వెళ్లిన దృశ్యాలు అతడిని మరింత ప్రేరేపించాయి. లేబర్ సమస్యలు అర్థం చేసుకునేందుకు చంద్రశేఖర్ బీహార్, నోయిడా, ఢిల్లీలలోని లేబర్ చౌక్‌లలో నాలుగు నెలలు గడిపాడు. మన దగ్గర వ్యవసాయం తర్వాత నిర్మాణ రంగమే అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించే రంగం. 2023 లెక్కల ప్రకారం 71 మిలియన్ల మంది కార్మికులు ఈ రంగంలో ఉన్నారు. వీళ్లలో 80 శాతం అన్‌స్కిల్డ్. వైట్ కాలర్ ఉద్యోగాలకు లింక్డిన్, నౌక్రి లాంటి ప్లాట్‌ఫామ్‌లు ఉంటే.. బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఎందుకు లేవని ఆలోచించాడు.

డిజిటల్ లేబర్ చౌక్ రిజిస్టర్..

ఉద్యోగం మానేసి ''డిజిటల్ లేబర్ చౌక్ ప్రైవేట్ లిమిటెడ్'' రిజిస్టర్ చేసి పుణెలోని ఇంక్యుబేటర్ నుంచి రూ.10 లక్షలు పెట్టుబడి పొందాడు. వెబ్‌సైట్, యాప్ తయారు చేసి లీగల్, టెక్నికల్ అంశాలు పూర్తి చేశాడు. ఏడుగురు టీమ్ సభ్యులను నియమించాడు. కార్మికులను ఆకర్షించడం పెద్ద సవాలు. లేబర్ చౌక్‌ల దగ్గర మొబైల్ షాపులు, కిరాణా దుకాణాల యజమానులను బిజినెస్ అసోసియేట్లుగా చేసి వారి సాయంతో కార్మికులను యాప్‌లో రిజిస్టర్ చేశాడు. కాంట్రాక్టర్లు, కంపెనీలను ఆకర్షించేందుకు బిల్డర్ల అసోసియేషన్లు, రెరాతో భాగస్వామ్యం చేశాడు. ఫేస్‌బుక్‌లో 100కు పైగా నిర్మాణ గ్రూపులలో చేరి కాంటాక్టులు పెంచాడు.

స్కిల్ డెవలప్‌మెంట్ కోసం..

''డిజిటల్ లేబర్ చౌక్'' ప్లాట్‌ఫాం నిర్మాణ కంపెనీలు, మేస్త్రీలు, పెయింటర్లు, కార్పెంటర్లు లాంటి కార్మికుల కోసం రూపొందించబడింది. కాంట్రాక్టర్లు లొకేషన్, జాబ్ రకం, రోజువారీ వేతనం, రోజుల సంఖ్య, భోజనం, వసతి వివరాలు పోస్ట్ చేస్తారు. కార్మికులు ఆ వివరాలు చూసి నేరుగా కాల్ చేసి ఆసక్తి తెలుపుతారు. కార్మికులు తమ స్కిల్స్, అనుభవం, కనీస వేతనం వివరాలు జోడిస్తారు. డిజిటల్ లేబర్ కార్డులు తయారుచేసి, వారికి గుర్తింపు ఇస్తున్నారు. పనితీరు ఆధారంగా ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఇన్‌స్టిట్యూట్లతో భాగస్వామ్యం చేస్తూ కార్మికలోకాన్ని సంఘటితం చేస్తున్నాడు.

Next Story