సమీరా రెడ్డి.. అత్తతో కలిసి ఏం చేస్తుందంటే..?

by Daayi Srishailam |

కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్న ఆధునిక అత్తా కోడళ్ల కథా కమామీషు.. లెట్స్ ఫాలో.!!

సమీరా రెడ్డి.. అత్తతో కలిసి ఏం చేస్తుందంటే..?
X

అత్తా కోడళ్లంటే ఎలా ఉంటారు.?

తెలుగు సీరియల్స్‌లో చూపించినట్లు

నిత్యం ఘర్షణలు.. కక్షలు.. పోటీతత్వమే గుర్తుకొస్తుంది కదా.?

కానీ బాలీవుడ్ నటి సమీరా రెడ్డి.. వాళ్లత్తమ్మ మంజ్రీ వార్దే..

ఈ స్టీరియోటైప్‌లను తుంగలో తొక్కి

ప్రేమ.. గౌరవం.. సహకారంతో నిండిన ఒక అద్భుతమైన బంధాన్ని నిర్మిస్తున్నారు.

ట్రెండ్‌ను ఫాలో అవడం కాదు..

కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్న ఆధునిక అత్తా కోడళ్ల కథా కమామీషు.. లెట్స్ ఫాలో.!!

- దిశ, ఫీచర్స్

"అత్తమీది కోపం దుత్తమీద చూపించే కోడలు".. "కోడలు గృహ ప్రవేశంతో గంగా ప్రవేశం చేసే అత్త".. వంటి సామెతలు ఎన్నో విన్నాం. కానీ.. ఇక్కడ చెప్పుకోబోయే అత్తా కోడళ్లు అలా కాదు. వాళ్లెవరో అనామకులు కూడా కాదు. బాలీవుడ్ హీరోయిన్.. టాలెస్ట్ ఉమన్ సమీరా రెడ్డి అత్తాకోడళ్ల ముచ్చట.

సాసీ సాసూ.. మెస్సీ మామా..

సమీరా వాళ్ల అత్త మంజ్రీ వార్దే వయసు 75 సంవత్సరాలు. ఆ వయసులో ఎలా ఉంటారో తెలుసు కదా? కానీ మంజ్రీ చాలా అప్డేటెడ్. ఈ తరం అమ్మాయిల్లా ఉంటుంది. చాలా యాక్టివ్ కూడా. ఒక రకంగా ఆమె ఒక మోడ్రన్ అత్త. సమీరా గురించయితే మనకు తెలిసిందే. వీళ్లిద్దరూ ఇన్‌స్టా‌గ్రామ్‌లో మంచి కంటెంట్‌తో సందడి చేస్తుంటారు. "సాసీ సాసూ.. మెస్సీ మామా"గా న్‌స్టా‌లో ఫేమస్ వీళ్లు. మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవడం నుంచి ఫుట్‌బాల్‌పై బాండింగ్ వరకు అత్తా కోడళ్లు అనేకన్నా ఫ్రెండ్స్ అనే విధంగా ఉంటాయి వీరి యాక్టివిటీస్. సమాజం మెప్పు కోసం కాకుండా వ్యూయర్స్ మొఖమ్మీద చిరునవ్వు కోసమే వీరి కంటెంట్ ఉంటుంది.

సమీరా సంతోషం

మంజ్రీ వార్దే పెద్దగా బయట కనిపించే వ్యక్తి కాదు. కానీ కొవిడ్-19 తనలోని కొత్త కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. సమీరాకు షూట్స్ లేవు. మంజ్రీకి వేరే పనులు లేవు. ఇంట్లో ఇద్దరూ ఖాళీగా టీవీలో సీరియల్స్ చూసుకుంటూ ఎన్నిరోజులు కూర్చుంటారు.? అందుకే అత్తను డ్యా్న్స్ చేయమని సమీరా కోరింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ వయసులో అద్భుతమైన డ్యాన్స్ చేసి అదరగొట్టింది మంజ్రీ. కొత్త అంశాల పట్ల ఆమెకు ఆసక్తి ఎక్కువట. అప్పట్లో ఈ వీడియోతో ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయింది. ఒక్క వీడియోతో 1,00,000 ఫాలోవర్లు వచ్చారు. సమీరా ఆనందంతో ఉప్పొంగిపోయింది.

వ్యక్తిత్వాలు వేరైనా..

సమీరా.. మంజ్రీ వ్యక్తిత్వాలు భిన్నమైనవి. మంజ్రీకి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం. సమీరాకు అది నచ్చదు. మంజ్రీ లౌడ్ సంగీతాన్ని ఇష్టపడుతుంది. సమీరా శాంతమైన రాగాలను కోరుకుంటుంది. మంజ్రీ రంగు రంగుల దుస్తులు ధరిస్తే.. సమీరా మోనోక్రోమ్‌ను ఎంచుకుంటుంది. కానీ ఈ వ్యతిరేకతలను అధిగమించి వారి బంధం కొనసాగుతుంది. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తారు. 60 ఏళ్ల వయసులో మోడలింగ్ ప్రారంభించిన మంజ్రీ.. స్త్రీ స్వాతంత్ర్యం.. ప్రసావనంతర డిప్రెషన్ వంటి అంశాలపై గట్టిగా నిలబడ్డ సమీరా.. ఒకరికొకరు ధైర్యంగా ఉంటూ ఐక్యతను చాటుతున్నారు.

నీకు నేను.. నాకు నువ్వూ..

ఇంటికొచ్చిన అతిథులకు సమీరా వంట చేసిపెట్టదు. చాక్లెట్.. ఆల్మండ్ ప్రాలిన్ డిసర్ట్‌ను మాత్రం వడ్డిస్తుంది. ఎందుకంటే ఆమెకు వంట చేయడం పెద్దగా రాదు. మంజ్రీ తనను అర్థం చేసుకొని అన్నీ తానే చేసిపెడుతుంది. "పెళ్లయ్యాక వంట రాదా.. అమ్మాయిలు వంట చేయపోతే ఎలా" అని ఎప్పుడూ అనలేదు. "ఇష్టమైతే చేయొచ్చు.. లేకపోతే లేదు" అని అంటుంది మంజ్రీ. ఒకరికొకరు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నారు. ఒకరి బలహీనతను మరొకరు అర్థం చేసుకుంటారు. "స్త్రీ జననోద్దరణ అనేది స్పీచులిస్తే జరగదనీ.. అది ముందు మన ఇంటి నుంచే మొదలవ్వాలని" ఇద్దరూ అంటున్నారు.

మనం మనలా ఉండాలి..

ప్రసవానంతరం సమీరా ఆత్మ విశ్వాసం కోల్పోయింది. బరువు విపరీతంగా పెరిగింది. సమాజం ఆమె గురించి రకరకాలుగా మాట్లాడింది. ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. అప్పుడు మంజ్రీయే సమీరాకు ధైర్యం చెప్పింది. "ఇది తాత్కాలికం. మనం సమాజం ఆశించే రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ఆత్మ విశ్వాసం ఒక్కటే మనల్ని ముందుకు నడిపిస్తుంది" అని వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ గోవాలోని తమ ఇంట్లో ప్రకృతి మధ్యన ఒకరికొకరు సలహాలిస్తూ గడుపుతున్నారు. కొత్త కొత్త కంటెంట్ ఇస్తూ స్త్రీ స్వత్రంత్ర్యం.. ఆత్మవిశ్వాసం సందేశాన్నిస్తూ అత్తా కోడళ్లకు సరికొత్త అర్థాన్ని చెప్తున్నారు.

Next Story