ఎడారిని అడవిగా మార్చిన.. జంగిల్ మాన్.!

by Daayi Srishailam |

ఆ మార్పుకు కారణం భువనేష్ ఓఝా. అందరూ "జంగిల్ మాన్"గా పిలుస్తారు

ఎడారిని అడవిగా మార్చిన.. జంగిల్ మాన్.!
X

దిశ, ఫీచర్స్: ఎడారులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. కానీ రాజస్థాన్ ఎడారి మాత్రం ఎప్పుడూ చల్లగా.. ఒక అడవిని తలపించేలా ఉంటుంది. అవును.. నిజంగా అదొక అడవే. ఎడారి నుంచి అడవిగా మారింది. ఆ మార్పుకు కారణం భువనేష్ ఓఝా. అందరూ "జంగిల్ మాన్"గా పిలుస్తారు.

తాగడానికి నీళ్లు లేవు..

అడవిని సృష్టించాలనే ఆలోచన వెనక పెద్ద కథే ఉంది. నిజంగా అది చిన్న కథ కాదు. భువనేష్ వాళ్లింట్లో ఒకప్పుడు కనీసం తాగుదామన్నా నీళ్లు ఉండేవి కావు. దినాం యుద్ధమే నడిచేది. వాళ్ల అమ్మ రోజూ 5 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి నీళ్లు తెచ్చేది. చలిలేదు.. ఎండలేదు.. వానలేదు. సంవత్సరం పొడవునా ఇదే పరిస్థితి. బిందెమీద బిందె పెట్టుకొని.. చేతిలో నిండు బకెట్ పట్టుకొని ఐదు కిలోమీటర్లు నడిస్తే ఆమె కాళ్లు.. చేతులకు పగుళ్లు వచ్చేవి. ఆ పరిస్థితిని చూసి మస్తు బాధపడేవాడు భువనేష్. అమ్మ కష్టంతోపాటు ఒక తరం భవిష్యత్‌ను మార్చాలనుకున్నాడు.

2010లో ఒక మొక్క..

భూమి భవిష్యత్తును మార్చాలనే తపనతో 2010లో ఒక మొక్క పెట్టాడు. ఇక అప్పటినుంచి మొక్కలను నాటడం ఒక దినచర్యగా పెట్టుకున్నాడు. రోజుకు ఒక చెట్టు కాస్తా రెండుగా మారింది. అదే ఇప్పుడు వేల చెట్లకు విస్తరించి ఎడారిలో ఆకుపచ్చ రంగు కనిపించేలా చేస్తున్నాయి. ఒక చిన్న ప్రయత్నం క్రమంగా ఒక ఉద్యమంగా మారింది. రాజస్థాన్ కఠిన వాతావరణాన్ని తట్టుకునే స్థానిక జాతి చెట్లను ఎంచుకుని.. ఇప్పటివరకు 30 వేలకు పైగా మొక్కలను నాటాడు. ఇవి చెట్లయి.. ఏపుగా పెరిగి ఇసుకనేలలో భూమిని ఆలింగనం చేసుకొని ఆకుపచ్చని నేలగా కనిపిస్తోంది.

పుకార్ ఫౌండేషన్..

రాజస్థాన్ ఎడారి భూముల్లో భగభగ మండే భానుడి సెగలు.. కాలుతున్న ఇసుకను చూస్తే ఎవరికైనా నీళ్లమీద.. ఆకుపచ్చని చెట్లమీద ఆశలు ఆవిరైపోతాయి. అలాంటి తీవ్రమైన ప్రభావమున్న ఎడారి అది. అలాంటి నిప్పుల అగ్గిలో భువనేష్ ఓఝా జీవం పోసి చూపించాడు. రాజస్థాన్ "జంగిల్ మాన్"గా పిలుచుకునే భువనేష్.. పొడిగా ఉండే ఎడారి నేలను సజీవ అడవులుగా మారుస్తున్నాడు. 2013లో పుకార్ ఫౌండేషన్‌ను స్థాపించి దాని ద్వారా చెట్లు నాటడం.. నీటిని కాపాడుకోవడం.. ప్రజల్లో అవగాహన కల్పించడం.. సామాజిక మార్పుకు కార్యచరణ ప్రిపేర్ చేయడం ఇతని దినచర్య.

30 వేలకు పైగా చెట్లు..

పుకార్ సంస్థ ముఖ్య ఉద్దేశం.. ఎడారి ప్రాంతాలను సజీవ వ్యవస్థలుగా మార్చడం. నేలను పునరుజ్జీవం చేయడం.. గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం. కేవలం 12 ఏళ్లలోనే ఈ బృందం ఆశ్చర్యపరిచే సక్సెస్ సాధించింది. 30 వేలకు పైగా చెట్లు నాటడంతో పాటు మియావాకీ పద్ధతిలో ఎనిమిది దట్టమైన అడవులు సృష్టించాడు. 3500 స్థానిక జాతి మొక్కలతో రెండు కోట్ల లీటర్ల వర్షనీటిని సంరక్షించగలిగాడు. 600 మంది రైతులకు సహజ వ్యవసాయం.. పర్మాకల్చర్ శిక్షణ ఇచ్చాడు. 800 మంది అంకితభావం కలిగిన వాలంటీర్ల బృందాన్ని నిర్మించగలిగాడు.

Next Story