Health : యూరిన్‌లో దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు!

by Javid Pasha |

Health : మూత్రంలో దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు!

Health : యూరిన్‌లో దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు!
X

దిశ, ఫీచర్స్ : ప్రతి రోజూ యూరినేషన్ ప్రాసెస్ సక్రమంగా జరుగుతుంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. అయితే అప్పుడప్పుడూ ఈ విషయంలో సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. ముఖ్యంగా యూరిన్ కలర్ మారడం, మంటగా అనిపించడం, ఒక రకమైన దుర్వాసన రావడం సంభవిస్తుంటాయి. మళ్లీ తగ్గిపోతుంటాయి. ఇలా అప్పుడప్పుడూ జరుగుతుంటే శరీరంలో జరిగే సాధారణ ప్రక్రియలవల్ల కావచ్చు. కానీ తరచుగా అదే కంటిన్యూ అయితే మాత్రం అనుమానించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే మూత్రంలో దుర్వాసన ఎక్కువ రోజులు కొనసాగడం వ్యాధి లక్షణం కూడాను. అయితే ఎలాంటి వ్యాధులు ఉన్నప్పుడు ఈ సంకేతాలు కనిపిస్తాయో చూద్దాం.

కిడ్నీ వ్యాధులు

యూరిన్‌లో ఒక విధమైన బ్యాడ్‌ స్మెల్ రావడం కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంకేతం కావచ్చు. ఎందుకంటే మూత్ర పిండాల పనితీరు మందగించినప్పుడు మలినాల వడబోతలో కిడ్నీలు విఫలం అవుతుంటాయి. దీంతో విష పదార్థాలు పేరుకుపోతుంటాయని, మూత్ర విసర్జన సమయంలో దుర్వాసనకు అవి కారణం అవుతుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేస్తే క్రమంగా దుర్వాసనతోపాటు చర్మం పసుపు రంగులోకి మారుతుంది. ఆకస్మికంగా బరువు కోల్పోవడం, చర్మంలో వాపు, దురద, మూత్ర విసర్జన సమయంలో మంట వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి యూరిన్ వెళ్తున్న సమయంలో దుర్వాసన వస్తున్నట్లు గమనిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.

మధుమేహం వల్ల కూడా..

మూత్రం దుర్వాసన శరీరంలో మధుమేహం ప్రారంభ సూచికగా కూడా కావచ్చు. అప్పటికే డయాబెటిస్ బాధితులైన వారిలో ఇలా జరిగితే షుగర్ లెవెల్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నాయనే సంకేతం కూడా కావచ్చు. ఎందుకంటే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగే అవకాశం ఉన్నప్పుడు దుర్వాసన అధికంగా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే యూరినేషన్ ప్రాసెస్‌లో దుర్వాసన వస్తుంటే శరీరంలో డయాబెటిస్ డెవలప్ అయిందేమో చెక్ చేయించుకోవాలి. అప్పటికే డయాబెటిస్ బాధితులైతే రక్తంలో చక్కెరస్థాయిలు చెక్ చేసుకొని వైద్య నిపుణుల సలహాలు పాటించడం బెటర్. కాలేయంలో సమస్యలు ఉన్నప్పుడు కూడా మూత్రంలో దుర్వాసన వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు.

యూటీఐ ఇన్‌ఫెక్షన్

మూత్రంలో దుర్వాసన అనేది కిడ్నీ వ్యాధులు, డయాబెటిస్ వ్యాధులకు సంకేతమే కాకుండా, మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ ప్రాథమిక లక్షణం కూడా కావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. వాస్తవానికి ఇదొక బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్. మూత్ర మార్గంలో దాని ప్రభావంవల్ల అలా జరుగుతుంది. అయితే బ్యాక్టీరియాలో అమ్మోనియం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు దుర్వాసన ఎక్కువగా వస్తుంది. దీంతోపాటు మంట, దురద, కొద్దిపాటి నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే యోనిలో ఇన్‌ఫెక్షన్ (బ్యాక్టీరియల్ వాజినోసిస్) వల్ల కూడా దుర్వాన, యోనిలో మంట, దురద వంటివి వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించగానే గైనకాలజిస్టులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story