నాన్న సెక్యురిటీ గార్డుగా పనిచేసిన హోటల్లోనే మరచిపోలేని డిన్నర్ ఏర్పాటుచేసిన కొడుకు.!

by Daayi Srishailam |   (  Updated:2025-05-01 06:28:54  IST  )

అలాంటి వ్యక్తికి మనమేం ఇవ్వగలం.. ఒక వెచ్చని కౌగిలింత తప్ప.

నాన్న సెక్యురిటీ గార్డుగా పనిచేసిన హోటల్లోనే మరచిపోలేని డిన్నర్ ఏర్పాటుచేసిన కొడుకు.!
X

నాన్న..

మనకెంతో చేస్తాడు.

జీవితమంతా ధారపోసి..

ఆశల దీపం వెలిగిస్తాడు.

మనకు ఏ సమస్యా రావద్దని..

తాను సమస్యల్లో చిక్కుకుంటాడు.

మనకు దెబ్బ తాకితే..

తను నొప్పి భరిస్తాడు.

మనం తింటే..

తన కడుపు నిండినట్లు ఫీలవుతాడు.

అలాంటి వ్యక్తికి మనమేం ఇవ్వగలం.. ఒక వెచ్చని కౌగిలింత తప్ప.

- దిశ, ఫీచర్స్

ఆర్యన్ మిశ్రా.. ఔత్సాహిక ఆస్ట్రోనాట్. "కౌన్ బనేగా కరోడ్ పతి" ద్వారా కూడా సుపరిచితుడు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవుళ్లు.. మన కోసం వాళ్లు సర్వం ధారపోస్తారు.. వారికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం అంటున్నాడు. వాళ్లతో గడపడమే మనమిచ్చే బహుమతిగా భావిస్తున్నాడు.

తినాలని ఉన్నా..

ఆర్యన్ మిశ్రా వాళ్ల నాన్న ఢిల్లీలోని ఐటీసీలో ఒకప్పుడు వాచ్‌మెన్‌గా పనిచేశాడు. తను అక్కడ వాచ్‌మెన్‌గా చేస్తూనే కుటుంబాన్ని పోషించాడు. పిల్లల్న బాగా చదివించాడు. భార్యకూ సమస్యల్లేకుండా చూసుకున్నాడు. పేరుకు అంతపెద్ద హోటల్లో పనిచేస్తున్నప్పటికీ.. అందులో సింగిల్ చాయ్ కూడా తాగే స్థోమత లేదు. రోజూ అనుకునేవాడు.. "ఎన్ని కష్టాలైనా రానీ.. నాలెక్క నా పిల్లలు ఇలా కష్టపడొద్దు" అని. అక్కడ దొరికే తిండిని చూస్తేనేమో నోరూరుతుండె. కానీ కొనుక్కోలేని పరిస్థితి. కనీసం తన పిల్లలకైనా తినిపించాలని ఉన్నా అదీ సాధ్యం కాలేదు.

నాన్నకు గుర్తిండిపోవాలి

ఇరవై ఐదు సంవత్సరాల క్రితం.. ఇదే అందమైన కారిడార్లో.. భోజనశాలలో "మా నాన్న తిరిగేవాడు. కానీ విలాసవంతమైన ఈ హోటల్‌లో ఏనాడూ బుక్కెడు బువ్వ తినలేదు. యూనిఫామ్ వేసుకొని గస్తీ కొడుతుంటే వాళ్లూ వీళ్లే ఏయ్ బాబూ" అని పిలిచేవాళ్లు అని నాన్న గురించి చెప్తున్నాడు ఆర్యన్. నిద్రపట్టని రాత్రుల్లో తన తండ్రి ఆకాశానికి మొఖంపెట్టి చూస్తుంటే పరిశీలించేవాడు. ఏమైంది నాన్నా అని అంటే ఏమీ చెప్పకపోయేవాడట. అలా కుటుంబ స్వప్నాలను నిశ్శబ్దంగా మోసిన తన తండ్రికి రిటైర్మెంట్ జీవితంలో మంచి అనుభవాలను ఇవ్వాలి అనుకున్నాడు ఆర్యన్.

డిన్నర్ కాదు.. గౌరవం

ఎక్కడయితే వాచ్‌మెన్‌గా పనిచేసి.. తమను పెంచి పెద్దచేశాడో.. అక్కడే నాన్నకొక అరుదైన ఆతిథ్యం ఇవ్వాలని డిసైడయ్యాడు ఆర్యన్. అమ్మానాన్నలిద్దర్నీ ఐటీసీకి తీసుకెళ్లాడు. ఇష్టమైన మెనూ తెప్పించి తండ్రి చిరకాల కోరికను నెరవేర్చాడు. నాన్నకు హోటల్లో భోజనం పెట్టించడం చిన్న విషయమే కావచ్చు. కానీ కుటుంబ సంబంధాలు విచ్చిన్నమవుతున్న ఈ రోజుల్లో ఇదొక సక్సెస్‌మీట్ లెక్కనే అనిపించిందని చెప్తున్నాడు ఆర్యన్. ఇదొక డిన్నర్ మాత్రమే కాదు. ఒక వ్యక్తి విలువ ఉద్యోగంతో కాకుండా.. వారి వ్యక్తిత్వం.. త్యాగాలతో నిర్ధారితమవుతుందని చాటే సందేశం అంటున్నాడు.

Next Story