సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'ఫార్ట్ వాక్' గురించి మీకు తెలుసా?

by Yella Dhawani Reddy |

ఆరోగ్యం ఉండాలంటే శరీరానికి వ్యాయామం తప్పనిసరి అవసరం అని వైద్యులు చెబుతుంటారు.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫార్ట్ వాక్ గురించి మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యం ఉండాలంటే శరీరానికి వ్యాయామం తప్పనిసరి అవసరం అని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా ప్రతి రోజు కనీసం అరగంట సేపైనా వాకింగ్, జాకింగ్ చేయాలని సూచిస్తుంటారు. ఇక సోషల్ మీడియా (Social media) అందుబాటులో వచ్చాక అభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీ లాగే.. రోజు రోజుకు కొత్త కొత్త వెల్‌నెస్ ట్రెండ్‌లు (Wellness Trend) పుట్టుకొస్తున్నాయి. ఈ డైట్‌ మంచిది, ఈ సమయంలో ఇలా చేస్తే ఆరోగ్యానికి బెటర్ అంటూ ఎన్నెన్నో హెల్త్ చిట్కాలు పుష్కలంగా నెట్టింట అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో 'ఫార్ట్ వాక్ (Fart walk)' అనే కొత్త వెల్నెస్ ట్రెండ్‌ సందడి చేస్తోంది. మరీ దీని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి భోజనం చేసిన తర్వాత తేలికపాటి నడకనే 'ఫార్ట్ వాక్' అని అంటున్నారు. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వాకింగ్‌ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్ సంబంధిత సమస్యలు దరిచేరవు. అంతేకాదు, ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి ఈ వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ ఫార్ట్ వాక్ అనే పదాన్ని తొలిసారిగా కెనడియన్ కుక్‌బుక్ రచయిత్రి మైర్లిన్ స్మిత్ (Mairlysmith) రూపొందించారు. ఇదే చాలామంది వ్యక్తుల దీర్ఘాయువు రహస్యం అని ఆమె తెలిపారు. పదేళ్ల నుంచి రాత్రి భోజనం అనంతరం భర్తతో కలిసి 20 నిమిషాల పాటు వాకింగ్ చేస్తోందామె. భాగస్వామితో సంతోషంగా కబుర్లు చెప్పుకొంటూ వాకింగ్ చేయటం తమ దీర్ఘాయుష్షుకి కారణమైందని పోస్టులో స్మిత్ తెలిపారు. దీని వల్ల ఇటు ఆరోగ్యంతో పాటు అటు వైవాహిక బంధం కూడా బలపడుతోందంటన్నారు.

ఇక భోజనం తర్వాత నడవడం వల్ల పేగు చలనశీలత లేదా మన ప్రేగుల కదలిక అనేది గ్యాస్‌ను వదిలించుకోవడమే గాక మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందని స్మిత్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చెప్పారు. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నివారించడంలో సాయపడుతుందని అన్నారు. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడ తగ్గుతాయట. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫిట్‌నెస్ ట్రెండ్‌కి వైద్య నిపుణులు సైతం మద్దతిస్తున్నారు. భోజనం తర్వాత నడక అనేది తిన్న గంటలోపు చేస్తేనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారు. అయితే వేగంగా కాకుండా నెమ్మదిగా నడవాలి. వాకింగ్ చేసిన తర్వాత నీరు తాగాలి. దీనివల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది.

Next Story