Are you 90s kid.? ఐతే ఇది మీ గురించే.!

by Daayi Srishailam |

గతమొక మొమరీ కార్డులా మనసులో పదిలం.

Are you 90s kid.? ఐతే ఇది మీ గురించే.!
X

కాలం వేగంగా పరుగులు తీస్తోంది.

ఆ లెక్కన అన్నీ మారాయి.

ఆటలు మారాయి..

పాటలు మారాయి..

చదువు మారింది..

జీవితం మారింది..

అప్పటికీ ఇప్పటికీ పోల్చుకుంటే..

ఇది మన లైఫేనా అనిపించేంతగా మారింది.

అందుకే.. గతమొక మొమరీ కార్డులా మనసులో పదిలంగా ఉంది.!

- దిశ, ఫీచర్స్

స్పోర్ట్స్ కోటా పిల్లోడు

ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్‌రామ్ రెడ్డి వీడియో అది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు "గుడ్ మార్నింగ్ ధర్మవరం" ప్రోగ్రామ్ చేస్తుండేదిగా కేతిరెడ్డి. ఒకరోజు ఏదో వార్డులో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేస్తుంటే ఒక స్కూల్ పిల్లోడు కనిపిస్తాడు. "ఏరా స్కూల్‌కి వెళ్లలేదా" అని అడిగితే "వెళ్తున్నా సార్" అంటాడు ఆ అబ్బాయి. "ఇంత లావయ్యావేంట్రా.. స్పోర్ట్స్ ఆడటం లేదా" అని మరోసారి అడిగాడు కేతిరెడ్డి. "లే సార్.. అమ్మ ఫోన్ ఇవ్వడం లేదు" అంటాడు ఆ పిల్లోడు. షాక్ అయిన కేతిరెడ్డి.. "స్పోర్ట్స్ అంటే సెల్‌ఫోన్లో ఆడే గేమ్స్ కాదురా.. గ్రౌండ్‌కి వెళ్లాలి" అని ఏదో చెప్పాడు.

గిల్లిదండ ఫేమస్..

నిజంగా ఎంత మారిపోయింది చూడండీ. ఆటలంటే సెల్‌ఫోన్లో ఆడే వీడియో గేమ్స్.. పబ్జీ గేమ్స్ అనుకుంటున్నారు పిల్లలు. సెల్‌ఫోన్లో గేమ్స్ ఆడితే లావు తగ్గుతారో.. గ్రౌండ్‌కెళ్లి ఆటలాడితే లావు తగ్గుతారో కూడా తెలియనంత అనాలోచిత ధోరణి ఈ జనరేషన్‌ది. మేం చదువుకునే రోజుల్లో ఆటలంటే గ్రౌండ్. ఆఖరికి గోటీలాటను కూడా గ్రౌండ్‌లోని ఏ చెట్టు నీడకో "కోర్ట్" గీసుకొని ఆడుతుండేవాళ్లం. అప్పుడు ఈ టెక్నాలజీ.. ఈ స్మార్ట్‌ఫోన్‌‌లు.. ఈ కథలెక్కడివీ. మీడియం సైజ్ వాయిలికట్టెను తీసుకొచ్చి ఆఫ్‌ఫీట్ కట్‌చేసి రెండు వైపులా కొశ్శెగా పెన్సిల్ చెక్కినట్లు చెక్కితే అది "గిల్లి".. రెండు ఫీట్లున్న కట్టెను ఒకవైపు మాత్రమే చెక్కితే అదే "దండ". "గిల్లిదండ"కు మించిన ఆట ఆ రోజుల్లో లేకుండె. తర్వాత్తర్వాత క్రికెట్‌ వెంట పరుగులు తీసి "గిల్లిదండ"ను కొంత దూరం చేసుకున్నామనుకోండి.

జామాకు.. చింతపండు

ఇప్పటి పిల్లలకు తినేటప్పుడు ఫోనే.. చదివేటప్పుడు ఫోనే.. పడుకునేటప్పుడు ఫోనే. అది లేకపోతే ఏ పనీ చేయలేనంత లేజీగా మారిపోతున్నారు. ఇంకా.. తిండికూడా ఇంట్లో వండింది కాకుండా బయటి జంక్ ఫుడ్స్.. ఫాస్ట్ ఫుడ్స్.. మసాలా ఫుడ్స్ తింటున్నారు. అప్పట్లో ఇవన్నీ లేవు. ఇప్పటిలా ఆర్డర్లు పెట్టుకోవడం ఎక్కడిది.? చేతిలో పావలో.. అర్ధ రూపాయో ఉంటే ఐస్ క్రీమ్ కొనుక్కునేవాళ్లం. పది పైసల బిస్కెట్లు తింటే అదే చాలా ఎక్కువ. కొబ్బరి గోలీలు.. పుదీన గోలీలు తిని అణువణువూ ఆస్వాదించేవాళ్లం. జామాకు తెంపుకొని.. దాంట్లో ఇంత చింతపండు పెట్టుకొని తింటే "అబ్బా.. ఆ టేస్టును ఊహించుకుంటే మళ్లోసారి బాల్యంలోకి" వెళ్లాలనిపిస్తోంది. ఎండాకాలం వచ్చిందంటే మామిడి తోటలకాడ చాటుగా వెళ్లి రాయితో మామిడి కాయలు తెంపుకొని.. వాటిలో ఇంత ఉప్పేసుకొని తినేది. ఇంట్లో అమ్మచేత వండిందే తినేవాళ్లం. ఇప్పుడు అమ్మలు బిజీనే.. పిల్లలూ బిజీనే. వండి వడ్డించే ఓపిక తల్లులకు లేదు.. అమ్మ యూట్యూబ్‌లో చూసి వండిన తిండి తినాలనే ఆసక్తి పిల్లలకూ ఉండటం లేదు.

కొత్త పెట్టుకునేది

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో తిరుగుతోంది. మదర్ అడుగుతోంది "పాపా.. రైస్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు నువ్వు తినే అన్నం ఎలా తయారైంది" అనీ. "రైస్ సూపర్ మార్కెట్లో నుంచి వస్తాయి. అన్నం గ్యాస్ మీద తయారవుతుంది" పాప ఆన్సర్. నిజంగా నేచర్‌తో ఎంత డిటాచ్‌మెంట్ ఇప్పటి పిల్లలకు.? చిన్నప్పుడు వ్యవసాయం.. రైతు.. పంట అన్నీ తెలిసేవి. అప్పుడు ఇంటింటికీ కొత్త పెట్టుకునేవాళ్లు. కొత్త పెట్టుకుంటే బర్కత్ ఉంటుందని నమ్మకం. అట్లా ఒకరు "సల్లగుంజ" కాడ.. ఒకరు "కుదురు" కాడ తినేవాళ్లు. కొత్త పెట్టుకోవడమనే పంట పండుగతో పెనవేసుకున్న ఆ రోజులు మళ్లీ రావు.

సైకిలెక్కి వస్తుంటే

ఇప్పుడంటే కట్నం కింద కార్లు పెడుతున్నారు. కానీ ఒకప్పుడు సైకిల్, గడియారమే పెద్ద కట్నం. "అట్లాస్ సైకిల్ పెడితేనే లగ్గం చేసుకుంటా" మొండికేసేవాళ్లు కూడా ఉండేవాళ్లు. ఇక పిల్లలు స్కూల్‌కి వెళ్లాలంటే కచ్చితంగా సైకిల్ ఉండాల్సిందే. ఇప్పుడైతే నర్సరీ నుంచి ఇంజినీరింగ్ దాక బస్సుల్లోనే వెళ్లి.. బస్సుల్లోనే వస్తుంటారు. "గిల్లిదండ" ఆట నుంచి "సైకిల్" దాక అప్పటికీ ఇప్పటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. కాలం.. టెక్నాలజీ మార్పుతో మొత్తం జీవనశైలే మారిపోయింది. ఇప్పుడంతా అప్డేట్ వెర్షన్. అప్పుడేమో ఉండీ ఉండక నడిచేది. కాలంతో పాటు మనమూ అప్డేట్ అయితేనే మనుగడ సాధ్యం. కాకపోతే.. గతమొక గమ్మత్తయిన యాదిలోకి తీసుకెళ్లి మళ్లీ వస్తే బాగుండు అని ఇలా మెమరీస్‌ను పంచుకునేలా చేస్తుంది.

Next Story