- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల్లో మానసిక వేదనలు.. ఓపెన్‌గా ఎందుకు మాట్లాడలేరంటే..
మహిళల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మానసిక ఆరోగ్యం ఒకటి.

దిశ, ఫీచర్స్ : ఒకే సమస్య.. కానీ ఒకరు ఓపెన్‌గా మాట్లాడతారు. మరొకరు మాట్లాడలేకపోతారు. కారణం సామాజిక అంచనాలు, అవగాహనా రాహిత్యం, పరిస్థితుల ప్రభావం ఇందులో కీ రోల్ పోషిస్తాయి. కొన్ని అంశాల్లో స్త్రీ, పురుషుల విషయానికి వస్తే ఈ ఆధునిక కాలంలోనూ అదే జరుగుతోందని నిపుణులు అంటన్నారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు స్త్రీ, పురుషుల సమానత్వ భావనకు సంబంధించి సానుకూల మార్పులు చాలానే వచ్చాయి. మహిళలు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇష్టమైన కెరీర్‌లో ప్రవేశించడానికి, నచ్చిన విధంగా జీవించడానికి రాజ్యాంగపరమైన హక్కులను కూడా కలిగి ఉన్నారు. అయినప్పటికీ పురుషాధిక్య భావజాలమే ఏదో ఒక రూపంలో నేటికీ డామినేట్ చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు స్త్రీ వాదులు. ఇలాంటి పరిస్థితులే నేటికీ కొన్ని విషయాల్లో మహిళలు ఓపెన్‌గా మాట్లాడే పరిస్థితికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా మెంటల్ హెల్త్ విషయంలో మహిళలు పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
బయటకు చెప్పలేని పరిస్థితులు
మహిళల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మానసిక ఆరోగ్యం ఒకటి. ఇప్పటికీ విదేశాలతో పోలిస్తే ఇండియాలో స్త్రీల మనోభావాలు, మనసులో మాటలు, మానసిక ఆరోగ్యం వంటి విషయాలు అంత ప్రయారిటీ గల అంశంగా పరగణించని వారే చాలా మంది ఉంటున్నారు. పురుషులు తమ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడినంత, ఓపెన్‌గా స్త్రీలు మాట్లాడుకునే పరిస్థితి కుటుంబాల్లో ఇప్పటికీ లేదు. ఎందుకంటే మహిళలు ఏది చెప్పినా తప్పుగా అర్థం చేసుకునే పురుషాధిక్య భావజాలమే అధికం కాబట్టి. ముఖ్యంగా ప్రేమ, కోరికలు, రుతుస్రావం, ఇష్టాయిష్టాలు, సెక్స్ వంటి విషయాలైతే ఇప్పటికీ వాటిని స్త్రీలు లేదా అమ్మాయిలు బయటకు మాట్లాడకూడనివిగా భావిస్తుంటారు చాలా మంది. దీంతో ఇలాంటి విషయాల్లో సమస్యలు వచ్చినా, సందేహాలు ఏర్పడినా బయటకు చెప్పుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు ఇప్పటికీ ఉంటున్నారు. తమ సమస్యను చెబితే ఇతరులు ఏమనుకుంటారోననే ఫీలింగ్ ఆధునిక మహిళలను పైతం వెంటాడుతోంది.
ఒత్తిడి, ఆందోళనలతో సతమతం
ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఈటింగ్ డిజార్డర్ వంటివి ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుషులందరూ ఎదుర్కొనే కామన్ సమస్యలే. అయితే పురుషులు వీటిని ఎదుర్కొంటున్నప్పుడు అవి కుటుంబాల్లో చర్మనీయాంశం అవుతాయి. వెంటనే ట్రీట్మెంట్, ఎమోషనల్ సపోర్ట్ వంటివి లభిస్తాయి. కానీ పురుషులు బయటకు చెప్పుకోగలిగినంత ఈజీగా మహిళలు ఈ సమస్యలను చెప్పుకోవడం లేదు. అలాగే ఇప్పటికీ చాలా వరకు అమ్మాయిలు, అబ్బాయిల ద్వారా వేధింపులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ విషయాన్ని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, వర్క్ ప్లేస్‌లో కొలీగ్స్‌తో పంచుకోలేరు. అత్యంత సన్నిహితులతో కూడా వెంటనే చెప్పే ధైర్యం చేయని వారే చాలామంది ఉంటారు. ఏదైనా పెద్ద సమస్యగా మారుతుందనుకొని భయపడినప్పుడు మాత్రమే చెప్పగలుగుతున్నారు. కారణం.. పురుషాధిక్య భావజాలం. బయటకు చెప్తే చుట్టు పక్కల జనాలు, సమాజం తమను హేళన చేస్తుందని, అవమానాలు, అనుమానాలు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఆధునిక మహిళలను కూడా ఎటూ తోచనివ్వట్లేదు.
హార్మోన్లలో మార్పులు
మహిళలు ఎదుర్కొనే సాధారణ రుగ్మతలకు హార్మోన్లలో మార్పులు కూడా కారణం అవుతున్నాయి. పెరినాటల్ డిప్రెషన్, పెరి-మెనోపాసల్(Peri-menopausal) డిప్రెషన్, ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) వంటివి కూడా అందులో భాగమే. ఇవి స్త్రీలలో శారీరక, మానసిక సమస్యలకు, మార్పులకు కారణం అవుతుంటాయి. యంగ్ ఏజ్ మూడ్ స్వింగ్స్, పీరియడ్స్, ఏజ్ రిలేటెడ్ ఫీలింగ్స్, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, ప్రసవం వంటి అంశాల్లో హార్మోన్లు కీ రోల్ పోషిస్తాయి. అలాగే రుతుక్రమం ఆగిపోయే ముందు, ఆగిపోయిన తర్వాత కూడా మహిళల్లో మెంటల్ డిజార్డర్లు పెరుగుతుంటాయి. ఇవన్నీ మానసిక అల్లకల్లోలానికి దారితీస్తుంటాయి. అనుభవించే మహిళలకు, ఆస్పత్రులకు వెళ్లినప్పుడు వైద్య నిపుణులకు అర్థం అవుతుంటాయే తప్ప.. కుటుంబంలోని పురుషులు, ఇతర వ్యక్తులు ఈ పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా అరుదు. అందుకే స్త్రీలు వీటిని బయటకు మాట్లాడలేకపోతుంటారు.
సంబంధాలు - సవాళ్లు
సమాజంలో, సంబంధాల్లో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు కొన్నిసార్లు మానసిక సంఘర్షణలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇవి పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అధికంగా ఉంటున్నాయి. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, పిల్లల్ని కనడం, పెంచడం, ఫ్యామిలీని చూసుకోవడం వంటివి మహిళల్లో మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తున్నాయి. పైగా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభించకపోవడం, చివరికి సాటి మహిళలు, ఫ్రెండ్స్ ద్వారా కూడా ఎమోషనల్ సపోర్ట్‌లేక పోవడం వంటి కారణాలతో లోన్లీనెస్‌ను ఎదుర్కొంటున్న మహిళలు చాలామందే ఉంటున్నారు. అయినా బయటకు చెప్పుకోలేకపోతుంటారు.
వేధింపులు, ఆర్థిక పరిస్థితులు
మహిళలను మానసికంగా కృంగదీసే ప్రధాన వాటిలో ఇంటా బయటా సమస్యలు, లైంగి వేధింపులు కూడా ఉంటున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సూటిపోటి మాటలను చాలామంది ఎదుర్కొంటున్నప్పటికీ బయటకు చెప్పుకోలేకపోతారు. చెప్పుకున్నా తగిన సపోర్ట్ లభించకపోగా మహిళలనే బాధితులుగా చేసే పరిస్థితుల కారణంగా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇవేకాకుండా కొన్నిసార్లు మానసిక ఆందోళనలు స్త్రీలలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి రుగ్మతలకు దారితీస్తున్నాయి. డిప్రెషన్‌లో కూరుకుపోయి ఏదైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించిన కూడా అమ్మాయిలను అర్థం చేసుకునే పరిస్థితి చాలా అరుదు. పైగా వారిపై చెడ్డవారు అనే ముద్ర వేయడం పరిపాటిగా మారిపోయింది.
పరిష్కారం ఏమిటి?
మహిళలు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం లేదని నిపుణులు, స్త్రీ వాదులు అంటున్నారు. మహిళల మానసిక ఇబ్బందులను అసలు ఆరోగ్య సమస్యగా పరిగణించకపోవడం, సమాజంలో నాటుకుపోయిన మూఢ నమ్మకాలు, పురుషాధిక్య భావజాలం వంటివి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్త్రీలలో మానసిక సమస్యలకు దారితీస్తు్న్నాయి. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడంలో, ఎదుర్కోవడంలో స్త్రీలకు సహకారం సమాజం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సాటి మహిళల నుంచి సమపోర్ట్ అందాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. సపోర్టివ్ సిస్టం బిల్డ్ చేయడం, ట్రీట్మెంట్ పొందడంలో సహకరించడం, సమస్య నుంచి బయటపడే వరకు మద్దతుగా నిలువడం వంటివి పరిష్కార అంశాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.






