జీఎస్టీలో సవరణలు.. నిర్మాణ రంగానికి మేలు

by Daayi Srishailam |

తగ్గనున్న ఇండ్ల ధరలు

జీఎస్టీలో సవరణలు.. నిర్మాణ రంగానికి మేలు
X

దిశ, మేడ్చల్ బ్యూరో: సొంతింటి కలను సాకారం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. నిర్మాణ ఖర్చుల కారణంగా ఇంటి నిర్మాణానికి వెనకడుగు వేస్తుంటారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ రేట్లను తగ్గించడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో సొంతింటిపై ఆశలు చిగురిస్తున్నాయి. ధరల తగ్గింపు కారణంగా నిర్మాణ రంగంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నగరవాసులకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ఇప్పుడు కొంచెం సులువు కానుంది. త్వరలో గృహ నిర్మాణ రంగం మరింత వేగాన్నిపుంజుకోనుంది.

నిర్మాణ సామగ్రి తగ్గింపు

నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్చల్స్, టైల్స్, రంగులు వంటి పలు నిర్మాణ సామగ్రి ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. దీంతో డెవలపర్లకు ప్రాజెక్ట్ ఖర్చులను తగ్గించడంతోపాటు ఇళ్ల కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తుంది. జీఎస్టీ 2.0 కింద సిమెంట్, రెడీ-మిక్స్ కాంక్రీట్ పై 18 శాతం (గతంలో 28 శాతం) ఇటుకలు, టైల్స్, ఇసుకపై 5 శాతం (గతంలో 18 శాతం) పెయింట్స్, వార్నిష్ లపై 18 శాతం (గతంలో 28 శాతం) పన్ను వర్తిస్తుంది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40 నుంచి 45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో 10 నుంచి 15 శాతం వరకు ఆదా అవుతోంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4 నుంచి 6 శాతం వరకు ఖర్చు తగ్గుతుందని రియల్ రంగ నిపుణులు తెలియజేస్తున్నారు.

కొత్త ప్రాజెక్ట్ లకే..

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సవరించినప్పటికీ, ఇండ్లు, నిర్మాణ సామగ్రి ధరలు ఇప్పుడే తగ్గుతాయని ఆశించలేం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్లు, విల్లాలు, వాణిజ్య భవనాల కోసం ఇప్పటికే మెటీరియల్ కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవచ్చు. ఇలాంటి ప్రాజెక్టులలో ధరలు తగ్గే అవకాశం తక్కువ. ఇలాంటి సందర్భాల్లో డెవలపర్లు ధరలను నేరుగా తగ్గించకుండా, పండుగ డిస్కౌంట్లు, ప్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్ లు లేదా కస్టమైజ్డ్ డీల్స్ అందించే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణలు పేర్కొంటున్నారు. కొత్తగా ప్రారంభమయ్యే ప్రాజెక్టులలో మాత్రం జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు నేరుగా కనిపిస్తాయని చెబుతున్నారు.

Next Story