- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాయ్.. నేను మీ రోబో టీచర్ సోఫియా.!
సోఫియాను దేశంలో విద్యార్థులకు సెకండ్ టీచర్‌గా మార్చాలనేది అతడి లక్ష్యం

దిశ, ఫీచర్స్: భవిష్యత్ అంతా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. రోబోటిక్ ఇంజనీరింగ్‌దే. ఇప్పుడు మనిషి చేసే పనులన్నింటినీ భవిష్యత్‌లో రోబోలే చేస్తాయి. అందుకే బేసిక్ విద్య నుంచే రోబోటిక్ వంటి అంశాల పట్ల అవగాహన కల్పించాలి. దీన్ని ముందుగానే గుర్తించిన యువకుడు ఆదిత్య.
ఏఐ టీచర్ రోబోట్..
అదొక మామూలు ప్రభుత్వ పాఠశాల తరగతి గది. బ్లాక్‌బోర్డు ముందు ఒక రోబోట్ టీచర్ నిలబడి ఉంది. తనను తాను పరిచయం చేసుకుంటూ.. "నేను ఏఐ టీచర్ రోబోట్. నా పేరు సోఫియా. నన్ను ఆదిత్య అనే విద్యార్థి తయారు చేశాడు. శివచరణ్ ఇంటర్ కాలేజీలో పాఠాలు బోధిస్తాను. పిల్లలూ.. మీకేమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా.?" అని అడుగుతోంది. ఆ తర్వాత విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెబుతోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.? రానురాను ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాల్సి ఉంటుందో. దీనిని తయారుచేసిన ఆదిత్య వయసు 17 సంవత్సరాలు.
ఐడియా మాత్రమే ఉంది..
బులంద్‌షహర్ ప్రభుత్వ పాఠశాల అయిపోయాక ఇతర విద్యార్థులు ఇంటికి పరుగులు తీస్తుంటే అదిత్య అక్కడే ఉండిపోయేవాడు. వైర్లు.. సర్క్యూట్లు.. పాత టీవీలు.. ఫోన్లు.. ఇలా ఏవి దొరికితే అవి సేకరించేవాడు. చిన్నప్పటి నుంచి వాళ్ల మామ చేతిలో చిన్న చిన్న రోబోలు చూసి మైమరచిపోయేవాడు. అక్కడి నుంచే మొదలైంది అతని ప్రయాణం. తాను కూడా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి రోబోట్ తయారుచేయాలని సంకల్పించాడు. వాస్తవానికి ఆదిత్య మైండ్ రోబోట్ ఐడియా అయితే ఉందిగానీ.. దానికొక ల్యాబ్ లేదు. ఖరీదైన టూల్స్ అవసరం ఉంటాయి. అవీ లేవు. ఏదైతే అదీ అని అడుగు ముందుకేశాడు.
అసలైన టాలెంట్..
ఎల్ఎల్ఎం చిప్‌సెట్ ఉపయోగించి ఈ రోబోట్‌ను తయారు చేశాడు ఆదిత్య. ఇది పిల్లలకు డౌట్స్ క్లియర్ చేయగలదు. ఇప్పటికైతే మాట్లాడగలదు.. త్వరలో రాయగలిగేలా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ ఉంటే.. విద్యార్థులు వచ్చి పరిశోధనలు చేయొచ్చు. ఇలాంటి అవకాశాలు అందరికీ దొరకాలి అని అంటాడు ఆదిత్య. మామూలు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్న ఆదిత్య.. పెద్ద పెద్ద కంపెనీలు చేసే పనిని తానొక్కడే చేశాడు. ఇంటర్నెట్.. యూట్యూబ్ తన గురువులు. అతని వీడియో చూసిన లక్షల మంది నెటిజన్లు ఇదీ అసలైన టాలెంట్ అంటే అని పొగుడుతున్నారు.
సెకండ్ టీచర్..
ఆదిత్య వాళ్ల నాన్న కంపౌండర్. తన నెలజీతం రూ.15,000. ఇది ఇంటి ఖర్చులకే సరిపోదు. తన పరిస్థితి తెలిసికూడా ఆసక్తిని.. లక్ష్యాన్ని చంపుకోలేక స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. వాళ్ల నాన్న తన ఆసక్తిని అర్థం చేసుకొని తనకు సాధ్యమైన సహకారం అందించాడు. ఖరీదైన కిట్లు కొనే డబ్బు లేదు కాబట్టి.. పాత టీవీలు.. మొబైల్స్.. వైర్లు.. ఫ్యాన్స్ దొరికిందల్లా రోబో తయారీకి ముడి సామాగ్రిగా ఉపయోగించాడు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ ట్రై అండ్ ఎర్రర్ మెథడ్‌తో నేర్చుకున్నాడు. సోఫియాను దేశంలో విద్యార్థులకు సెకండ్ టీచర్‌గా మార్చాలనేది అతడి లక్ష్యం.






