- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐ ఇప్పుడు సహాయపడుతుంది ఓకే.. తర్వాత నైపుణ్యాలను దెబ్బతీస్తుందేమో జాగ్రత్త !
ఇప్పుడు ఎంతగానో సహాయపడుతున్న ఏఐ (AI ) భవిష్యత్తులో మానవ నైపుణ్యాలను దెబ్బతీస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. తాజా అధ్యయనం దానిని మరింత బలపర్చే ఫలితాన్ని వెల్లడించింది.

దిశ, ఫీచర్స్ : ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ (AI) మొత్తం ప్రపంచాన్నే మార్చేస్తోంది. మానవాళికి మరింత సౌకర్యంగా మారుతోంది. అనేక పనులను సులభతరం చేస్తోంది. ఇప్పటికే వివిధ రంగాల్లో దీనివాడకం సేవల్లో వేగాన్ని, పనుల్లో నాణ్యతను పెంచుతోంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగంలో చాలా వరకు హెల్ప్ అవుతోంది. ఇంతవరకు బాగానే ఉంది ఓకే.. కానీ ఇప్పుడు ఎంతగానో సహాయపడుతున్న ఈ ఆధునిక సాంకేతికత భవిష్యత్తులో మానవ నైపుణ్యాలను దెబ్బతీస్తుందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతుండగా.. ఒక తాజా అధ్యయనం దానిని మరింత బలపర్చే ఫలితాన్ని వెల్లడించింది. జాగ్రత్త పడకపోతే ఏఐతో ముప్పుపొంచి ఉందని, చివరకది నిపుణుల నైపుణ్యాలను హరిస్తుందని పేర్కొన్నది.
ది లాన్సెట్ గ్యాస్ట్రో ఎంటరాలజీ & హెపటాలజీ (The Lancet Gastroenterology & Hepatology) జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం ప్రకారం.. క్రిస్టోఫ్ బుడ్జిన్ అండ్ మార్సిన్ రోమాన్సిజిక్(Christoph Budzin and Marcin Romanczyk) అనే శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం ఏఐ నైపుణ్యాలను ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించింది. ఈ బృందంలో అకాడమీ ఆఫ్ సిలేసియా (పోలండ్), యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో (నార్వే)లకు చెందిన పరిశోధకులు కూడా ఉన్నారు. వీరు ACCEPT (Artificial Intelligence in Colonoscopy for Cancer Prevention) ట్రయల్‌లో నిపుణుల నైపుణ్యాన్ని ఏఐ ప్రభావితం చేసే తీరును అధ్యయనం చేశారు.
పోలండ్‌లో ఎంతో నైపుణ్యం కలిగిన ఎండోస్కోపిస్ట్‌లు (Endoscopists) కొలనో స్కోపీల సమయంలో ఏఐ సాధనాలను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా నెలల తరబడి ఉపయోగించిన తర్వాత వారు తమ సొంత నైపుణ్యాల్లో క్షీణతను కనబర్చినట్లు అధ్యయనం పేర్కొన్నది. ఏఐ (AI) సహాయంతో ఎంతో అద్భుతంగా పనిచేసిన ఎండోస్కోపిస్టులు, ఏఐ సహాయం లేనప్పుడు మాత్రం సొంత సామర్థ్యాన్ని కనబర్చడంలో విఫలం అయ్యారు. ముఖ్యంగా AI హెల్ప్ తీసుకున్న సమయంలో క్యాన్సర్‌కు ముందు దశలో ఉండే అసాధారణ కణితులను గుర్తించగలిగిన ఎండోస్కోపిస్టులు, దానిని వాడనప్పుడు అలా గుర్తించే రేటు 28.4% నుంచి 22.4%కి, 20% తగ్గింది. AIపై అతిగా ఆధారపడటం వల్ల మానవ నైపుణ్యాలు బలహీనపడే ఒక ఆందోళనకరమైన సమస్యను ఈ పరిణామం సూచిస్తుందని అధ్యయనం గుర్తించింది. అలాగే వైద్య రంగంలో కచ్చితత్వాన్ని పెంచినప్పటికీ, సిస్టమ్ వైఫల్యం లేదా ఆఫ్‌లైన్ అయినప్పుడు వైద్యుల సొంత నిర్ధారణ సామర్థ్యాలు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నది.
మానవ నైపుణ్యాలపై ఏఐ ప్రభావాన్ని విశ్లేషించిన అధ్యయనం.. ఈ సాంకేతికత అత్యంత సమర్థవంతంగా పనిచేస్తే, మానవులు తమ నైపుణ్యాలను సాధన చేయడం తగ్గించే ప్రమాదం ఉందని కూడా పేర్కొన్నది. దీనిని నివారించడానికి, AIని తెలివిగా ఇంటిగ్రేట్ చేయడం, అంటే ఏఐ సహాయంతో పాటు మానవ నైపుణ్యాలను కొనసాగించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. డాక్టర్లు తమ క్లినికల్ సామర్థ్యాలను కాపాడుకోవడానికి నిరంతర శిక్షణ, “AI-రహిత ప్రాక్టీస్” సమయాలు అవసరమని చెబుతున్నారు. ఇది కేవలం వైద్య రంగానికే కాదు అన్ని రంగాలకు, వ్యక్తిగత నైపుణ్యాలకు సైతం వర్తిస్తుందని పేర్కొంటున్నారు.






