ఒక్క కాల్‌తో.. మీ ఇంటికే హాస్పిటల్ వచ్చేస్తుంది..

by Sujitha Rachapalli |

తేజ్ హెల్త్.. ఇంటికే హాస్పిటల్.. నిమిషాల్లో డాక్టర్, నర్సు మీ ముందుకు.. స్విగ్గీ, ఉబర్ మాదిరిగానే తేజ్ సేవలు.. బెంగళూరు యువకుడి ఆలోచన

ఒక్క కాల్‌తో.. మీ ఇంటికే హాస్పిటల్ వచ్చేస్తుంది..
X

దిశ, ఫీచర్స్: చిన్నపాటి జలుబు చేస్తెనే మనం ఆగమాగం అవుతాం. ఏమైందో ఏమో అని గాబరా పడిపోతాం. హాస్పిటల్ కోసం ఎంతోదూరం పరుగులు తీస్తాం. అంత రిస్క్ తీసుకున్నా మెరుగైన వైద్యం అందక తీవ్ర సమస్యలు ఎదుర్కుంటాం. ఇలాంటి సమస్యలను గ్రహించిన ఒకతను ఇంటి వద్దే హాస్పిటల్లో అందించే వైద్యం అందించేందుకు ఒక స్టార్టప్ రూపొందించాడు.

అత్యవసర సమయాల్లో..

సాధారణ జలుబు.. జ్వరం కోసం.. సమస్య తీవ్రంగా ఉంటే ఎక్స్ రే తీయించుకోవడం కోసం ఇకపై హాస్పిటల్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నాడు బెంగళూరుకు చెందిన యువకుడు ప్రవీణ్ గౌడ. దీనికోసం అతను ‘తేజ్ హెల్త్’ అనే స్టార్టప్‌ను రూపొందించాడు. హాస్పిటల్లో అందించే వైద్య సేవలను ఇంటికి తీసుకురావడమే ఈ స్టార్టప్ ఉద్దేశం. కేవలం నిమిషాల్లోనే డాక్టర్.. నర్సు.. టెక్నీషియన్ ఇంటి ముందుకు వచ్చేస్తారు. మనకు ఆరోగ్య సేవలు చాలా త్వరితగతిగా అందుతున్నాయని అనిపించినా వాస్తవానికి అత్యవసర సమయాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

పదేళ్ల అనుభవం..

చికిత్స కోసం హాస్పిటల్‌కి వెళ్లడంతోనే అయిపోదు కదా. లైన్‌లో నిలబడాలి. ఐదు నిమిషాల్లో అందాల్సిన వైద్యం ఐదు గంటలైనా అందదు. ఈ సమస్యను పరిష్కరించడానికే తేజ్ హెల్త్ ఒక కొత్త ఆరోగ్య మోడల్‌ను తీసుకొచ్చింది. రోగి ఇంటి వద్దనే సౌకర్యవంతమైన.. వేగవంతమైన.. మెరుగైన చికిత్స అందించడం దీని ప్రత్యేకత. ప్రవీణ్ గౌడకు హెల్త్ డిపార్ట్‌‌మెంటులో ఇప్పటికే అనుభవం ఉంది. పదేళ్ల క్రితమే వీమెడో అనే స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌ను స్థాపించి సక్సెస్ అయ్యాడు. ఆ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో 2026 జనవరిలో తేజ్ హెల్త్‌ను ప్రారంభించాడు.

ఇంటి వద్దకే..

వీమెడోలో లేనిది ఇంటి వద్దకే ఆరోగ్య సేవ. దానినే తేజ్ ద్వారా బ్రాండ్‌గా మార్చాడు. హాస్పిటల్‌కి వెళ్లకుండానే వైద్య సేవలు ఇంటికి రావాలన్నది అతని కల. ఆన్ డిమాండ్ కేర్ ద్వారా ఆ సేవలను అందిస్తున్నాడు. అంటే తేజ్ హెల్త్.. ఆరోగ్య సేవలను స్విగ్గీ లేదా ఉబర్ లాగా ఒక బటన్ నొక్కితే వచ్చేలా రూపొందించారు. కేవలం వేగం మాత్రమే కాదు. సౌకర్యం కూడా ముఖ్యం అనేదే ఆన్ డిమాండ్ కేర్ పాలసీ. క్విక్ కామర్స్‌లో వేగం ఎక్కువ. తేజ్ హెల్త్ సేవల్లో వేగం.. సౌకర్యం రెండూ ఉంటాయి. మిగతా హెల్త్ యాప్‌లు ఆన్‌లైన్ కన్సల్టేషన్ ఇస్తే.. తేజ్ వైద్యులు.. నర్సులను ఇంటికి పంపి సేవలు అందిస్తుంది.

10000 మంది రోగులకు..

ప్రవీణ్ టీంలో 20 మంది కోర్ టీమ్‌తో పాటు 500కి పైగా డాక్టర్లు.. నర్సులు.. ఫిజియోథెరపిస్టుల నెట్‌వర్క్ ఉంది. ప్రతి సేవను నిరంతరం పర్యవేక్షిస్తారు. రోగి బుకింగ్ నుంచి చికిత్స ముగిసే వరకు.. తర్వాత కూడా ఫాలో అప్ కాల్స్ చేస్తారు. వచ్చే ఐదేళ్లలో 5-6 ప్రధాన నగరాల్లో రోజుకు 10000 మంది రోగులకు సేవలు అందించాలని భావిస్తోంది. దీనికోసం మరిన్ని నగరాల్లోకి విస్తరించి నెట్‌వర్క్‌ను పెంచి.. టెక్నాలజీని బలపరచేందుకు ప్రణాళిక వేస్తున్నాడు ప్రవీణ్. ఆరోగ్యం హాస్పిటల్ గోడల మధ్యనే కాదు రోగి అవసరం ఉన్న చోటే అందాలి అనేదానికి ఇది చక్కటి ఉదాహరణ.

Next Story