వేసవిలో అష్టాచెమ్మా ఆడితే వచ్చే మజానే వేరు

by Sujitha Rachapalli |   (  Updated:2026-05-24 09:53:11  IST  )

చిన్నప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చిందంటే మా ఇంటి ముందు అరుగు పండుగలా మారిపోయేది. పొద్దున పదింటికే అష్టా చెమ్మా స్టార్ట్ చేసేవాళ్లం.

వేసవిలో అష్టాచెమ్మా ఆడితే వచ్చే మజానే వేరు
X

దిశ, ఫీచర్స్ : చిన్నప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చిందంటే మా ఇంటి ముందు అరుగు పండుగలా మారిపోయేది. పొద్దున పదింటికే అష్టా చెమ్మా స్టార్ట్ చేసేవాళ్లం. ఫోన్లు, టీవీలు లేని ఆ కాలం అది. పొద్దున మొదలుపెట్టిన అష్టాచెమ్మా పొద్దుమూకంగా సూర్యుడు అస్తమించినంక కూడా సాగేది. మా పెరట్లోని వేప, కానుగ చెట్ల నుంచి చల్లని గాలి వీస్తుంటే అస్సలు లేవబుద్ధి కాకపోయేది.

అరుగుపై ఆనందం..

అష్టాచెమ్మా ఏదో ఉత్తగా తూతూమంత్రం గీతలు గీసి ఆడే ఆట కాదు. ఇది మన గ్రామీణ జీవితానికి ప్రతిరూపం. ఇంటి ముందు అరుగు మీద లేదా స్కూల్లో బండల మీద చిన్న చిన్న రాళ్లు, కట్టెపుల్లలు, కాగితం ముక్కలు కాయలుగా పెట్టుకొని ఆడేవాళ్లం. అష్టాచెమ్మకు చింత గింజలను ఒకవైపు తెల్లగా గీకి వాడేవాళ్లం. నాలుగు గింజల్లో మూడు నల్లగా.. ఒకటి తెల్లగా పడితే కన్ను. దీనికి ఒక పాయింట్. రెండు తెల్లగా పడితే దూగ. దీనికి రెండు పాయింట్లు. మూడు తెల్లగా పడితే తీని. దీనికి మూడు పాయింట్లు. ఒకవేళ నాలుగు తెల్లగా పడితే చెమ్మా. దీనికి నాలుగు పాయింట్లు. నాలుగింటికి నాలుగు నల్లగా పడితే అష్టా. దీనికి ఎనిమిది పాయింట్లు. ఈ ఆట మొత్తంలో హైలైట్ చెమ్మా, అష్టానే కాబట్టీ దీనికి అష్టాచెమ్మా అనే పేరొచ్చింది.

సంపుడు పందెం అయితే..

చెమ్మ చాలా సార్లు ఆటలో కీలకంగా పనిచేస్తుంది. అది పడగానే ఆనందంగా కేకలు వేసేవాళ్లం. ఇక అష్టా పడితే గెలిచినట్లే సంబర పడేవాళ్లం. కన్ను పడితే ‘అబ్బా.. ఛా మల్లా ఇదే పడిందా’ అంటూ నిరాశ ముఖం పెట్టేవాళ్లం. కానీ చాలా సందర్భాల్లో గెలుపును నిర్ణయించేది ఇదే. తరుచుగా అయితే ఎవరికైనా దూగ పడుతుంది. ఆట క్లయిమాక్స్‌లో చాలా రసవత్తరంగా ఉన్నప్పుడు తీని పడుతుంది. కానీ అప్పుడు మనకు కన్ను లేదా చెమ్మా అవసరం ఉంటుంది. ఇలా ఆద్యంతం టెన్షన్ వాతావరణం ఉంటుంది అష్టాచెమ్మాలో. ఇక ఆటలో సూపర్ హిట్ ‘సంపుడు పందెం’. ఒకరి కాయల్ని సంపుతూ ముందుకు వెళ్లడం అన్నమాట. సంపుడు పందెం అయ్యిందంటే ఆట ఒకింత రసవత్తరంగానూ.. ఒకింత ఉత్కంఠగానూ సాగుతుంది.

గాఢమైన బంధం..

మా అక్కలు, వాళ్ల స్నేహితులు, పక్కింటివాళ్లు ఎప్పుడూ అష్టాచెమ్మ ఆడేవాళ్లు. మధ్యాహ్నం భోజనం పూర్తయ్యాక ఆట మొదలయ్యేది. ప్రతీసారి ఆటలో చిన్నపాటి గొడవలు కచ్చితంగా ఉండేవి. ‘సంపిన పావు కదిలించినవ్’.. ‘తొండి ఆడినవ్’ అంటూ ఒకరిమీదొకరు అరుస్తుండేది. ముందే ఆడోళ్లు. ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు. కొంచెం సేపు ముఖాలు తిప్పుకున్నా మళ్లీ నవ్వుకొని ఆటలో మునిగిపోయేవాళ్లం. అప్పటి అవ్వలందరూ కలిసి కూర్చొని ఆడుకునేవాళ్లు. ఒకరి కష్టాలు, సంతోషాలు, ఇంటి సమస్యలు అన్నీ ఈ ఆటలోనే పంచుకునేవాళ్లు. ఫోన్లు లేని ఆ రోజుల్లో మనుషుల మధ్య బంధం ఇంత గాఢంగా, వాస్తవికంగా ఉండేది. కాబట్టే వాళ్ల జీవన విధానం బాగుండేది.

సంతోషాలను పంచాలి..

ఇప్పటి పిల్లలు మొబైల్ స్క్రీన్ల ముందు కూర్చొని గంటల తరబడి ఆడుతున్నారు. కానీ మా చిన్ననాటి ఆటల్లో ఉన్న స్నేహం, నవ్వులు, గొడవలు ఇప్పుడెక్కడివి.? నిజంగా ఆ అనుభూతే వేరు. వీధి అరుగు మీద కూర్చొని చింతగింజలు విసురుతూ అష్టా చెమ్మ ఆడిన ఆ రోజులు ఎప్పటికీ మనసులో మెరుస్తూనే ఉంటాయి. మన పిల్లలకు కూడా ఈ ఆటలు నేర్పించాలి. స్క్రీన్లతో పాటు నిజమైన బంధాలు.. సంతోషాలను కూడా పంచాలి. కానీ ఏం వింటారో ఏమో అనిపిస్తుంది. ఏ చిన్న మాటన్నా చిరాకు పడతారు. ఏడుస్తారు. బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. ఇక ఇలా అంతా ఒకచోట కూర్చొని ఆడటం, గెలుపు ఓటములు, తొండి, గొడవలు, అలగడం.. అంతలోనే ఒక్కటవ్వటం అంటే ఈ తరం పిల్లలతో అవుతుందా?

- మన్నె అనిత

బ్లాక్ అండ్ వైట్ టీవీలో దూరదర్శన్ చూసిన ఆనందాలు

Next Story