- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరవ్ విజయ్.. వయసు చిన్నది.. మనసు గొప్పది.!
దేశంలోనే అతి పిన్న వయస్కుడైన సామాజిక కార్యకర్త.. ఆవిష్కర్త

దిశ, ఫీచర్స్: మనకు బాధేంటో తెలిస్తే.. అవతలి వాళ్ల సమస్య తీవ్రతను అంచనా వేయగలుగుతాం. బాధ తాలూకు నష్టం గురించి తెలుసు కాబట్టీ ఓ పరిష్కారం చూపించాలన్న ఆలోచన.. ఆ ఆలోచనలోంచి ఒక ఆవిష్కరణ పుట్టుకొస్తుంది. 17 ఏళ్ల ముంబై యువకుడు ఆరవ్ విజయ్. ఇప్పుడతను దేశంలోనే అతి పిన్న వయస్కుడైన సామాజిక కార్యకర్త.. ఆవిష్కర్తగా గుర్తింపు పొందాడు.
హాస్పిటల్ బెడ్‌పై ఐడియా..
ఆరవ్‌కు 11 ఏళ్ల వయసులో టిబియా ఎముక విరిగింది. కొంత సెట్ అయ్యే క్రమంలోనే మరోసారి అదే ఎముక విరిగి మొత్తం ఏడు నెలలు మంచానికే పరిమితమయ్యాడు. ఇటు తనకు.. అటు పేరెంట్స్‌కు పెద్ద సమస్యే అయింది దీనివల్ల. వాళ్లింటి తలుపులు ఇరుకుగా ఉండేవి. వీల్‌చైర్ లోపలికి రాకపోయేది. ప్రతీసారి తల్లిదండ్రులు ఎత్తుకేసుకెళ్లాల్సి వచ్చేది. ఈ చిన్న చిన్న విషయాలు ఎంత బాధ కలిగిస్తాయో తనకప్పుడే అర్థమయ్యింది. ఫిజియోథెరపీ సెంటర్‌లో ఆరవ్ ఒక పరికరం చూశాడు. అదేంటంటే.. కుర్చీలో కూర్చుంటే ఆటోమాటిగ్గా మెట్లెక్కే స్లోప్. తన గాయం తాత్కాలికమే. కానీ కొందరికి ఇది జీవితాంతం అవసరముంటుంది కదా. ఇలాంటిదేదైనా చేసిపెట్టాలి అనుకున్నాడు.
రోబోటిక్ ఫీడర్ ఆర్మ్..
సెరిబ్రల్ పాల్సీ సమస్య గురించి తెలుసు కదా.? ఇది మెదడు గాయం వల్ల వచ్చే శాశ్వత కదలికా ఇబ్బంది. పుట్టుకతోనే లేదా పసితనంలో మెదడులోని కదలికలను నియంత్రించే భాగం దెబ్బతినడం వల్ల ఈ సమస్య వస్తుంది. వాళ్లు మనసులో ఏం కోరుకుంటారో చెప్పలేరు. చేతులు కదలవు. తిండి కూడా ఎవరో ఒకరు పెట్టాలి. ఆ అవసరాన్ని తీర్చేందుకే ఆరవ్ ‘ఫీడ్‌ఈజ్’ అనే రోబోటిక్ ఫీడర్ ఆర్మ్ తయారుచేశాడు. దీని సాయంతో పిల్లోడు నోరు తెరిచాడో లేదో కెమెరా చూస్తుంది. రోబో చేయి అడుగులోంచి అన్నం తీసుకొని నోట్లో పెడుతుంది. దీనిని మొదటిసారిగా ముంబైలోని ముస్కాన్ ఎన్జీవో పాఠశాలలో పరీక్షించారు. పిల్లలు.. టీచర్ల ఆనందం చూసి ఆరవ్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
స్పీక్‌ఈజీ యాప్..
ఆరవ్ ఇప్పుడు రెండో పెద్ద ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాడు. ఆ ప్రాజెక్టే ‘స్పీక్‌ఈజీ’ అనే ఏఐ యాప్. మాట్లాడలేని పిల్లలు ఇంట్లోని వస్తువుల ఫోటోలు తీసి యాప్‌లో పెడితే ఆ ఫోటో నొక్కగానే “నాకు నీళ్లు కావాలి”.. “నన్ను బయటకు తీసుకెళ్లండి” అని తెలుగులోనో.. హిందీలోనో మాట్లాడుతుంది. భారతీయ సంస్కృతికి తగ్గట్టు దీనిని రూపొందించాడు. తల్లిదండ్రులు కూడా ఈ యాప్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చన్నమాట. ఆరవ్ లాక్‌డౌన్ రోజుల్లో ఇంట్లో కూర్చొని వేసిన స్కెచ్‌లను బ్యాడ్జ్‌లుగా.. మగ్‌లుగా.. టీ-షర్ట్‌లుగా మార్చి అమ్ముతాడు. లాభంలో 90 శాతం హెచ్ఐవీతో బాధపడే పిల్లలకు.. ఇతర ఎన్జీవోలకు ఇస్తాడు. ఇప్పటివరకు రూ.1.5 లక్షలకు పైగా ఇలా వసూలు చేశాడు. ఇదిప్పుడు పూర్తిస్థాయి సేవాసంస్థగా మారి కెన్షో ఫౌండేషన్‌గా రూపుదిద్దుకుంది.






